ఈర్ల సమ్మయ్యకు జాతీయ స్థాయి ఐకాన్ అవార్డు

కాల్వశ్రీరాంపుర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య విద్య, సాహిత్య రంగాల్లో విశేషంగా కృషి చేసినందుకుగాను 'జాతీయ ఐకాన్ అవార్డును' అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో విశ్వ విఖ్యాత కల్చరల్ అకాడమి సంస్థ ప్రతినిధులు ఈర్ల సమ్మయ్యను ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేసి, పుష్పగుచ్చం శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈర్ల సమ్మయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గత 2013 నుండి ఎస్సీ కాలనీ పాఠశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. మూతపడే స్థితిలో ఉన్న పాఠశాలలో పిల్లల సంఖ్యను గణనీయంగా పెంచారు. అహర్నిశలు శ్రమించి పాఠశాలను బతికించారు. తన వేతనంలో 25 శాతం డబ్బును పాఠశాల అభివృద్ధి, పిల్లల సర్వతో ముఖాభివృద్ధికి ఖర్చు పెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. అలాగే 'మధురిమలు' అనే నూతన తెలుగు లఘు కవితా ప్రక్రియను రూపొందించి తెలుగు రాష్ట్రాల్లోని కవుల చేత  రచనలు చేయిస్తున్నారు. 'మేఘన సాహితీ కళావేదిక' అనే సంస్థను స్థాపించి ఇప్పటివరకు 108 మధురిమలు పూర్తి చేసిన 92 మంది కవులు, కవయిత్రులకు 'మధుర కవి భూషణ' పురస్కారాన్ని అందజేశారు. అలాగే 500 మధురిమలు రాసిన ఆరుగురికి 'మధుర కవివిభూషణ' పురస్కారాన్ని ఆన్లైన్లో అందజేశారు.   కరోనా కాలంలో ఆన్లైన్లో నిర్వహించిన జూమ్ కవి సమ్మేళనాలలో పాల్గొని వందలాది ప్రశంస పత్రాలు, అవార్డులు అందుకున్నారు. మీరు సేవలను గుర్తించిన విశ్వ విఖ్యాత కల్చరల్ అకాడమీ సేవా సంస్థ ప్రతినిధులు దూడపాక శ్రీధర్, ఎస్విఆర్ వెంకటేశులు జాతీయ స్థాయి ఐకాన్ అవార్డుకు ఎంపిక చేసి, ఘనంగా సన్మానించారు. విద్యా, సాహిత్య రంగాల్లో ఈర్ల సమ్మయ్య చేస్తున్న సేవలను వారు కొనియాడారు. ఈర్ల సమ్మెకు జాతీయ ఐకాన్ అవార్డు రావడం పట్ల ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థినీ, విద్యార్థులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులు, యువతీ, యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, గ్రామస్తులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు