నారాయణ నామ మహిమ;-: సి.హెచ్.ప్రతాప్
 పూర్వం కన్యాకుబ్జం గ్రామంలో అజామిళుడనే బ్రాహ్మణుడు నివసించేవాడు. అతడు అనేక గురువులకు శశ్రూషలు చెసీ చతుర్వేదములను, 108 ఉపనిషత్తులను, పురాణేతి ఇతిహాసాలను పఠించాడు. నిత్యం క్రమం తప్పకుండా ధర్మాన్ని ఆచరించేవాడు . అయితే యుక్త వయస్సులో వయసు ప్రభావం వలన  ఒక పరాయి కులానికి చెందిన యువతి మోజులో పడి, ఆవిడను పెళ్ళి చేసుకున్నాడు. కుల భ్రష్టుడు అయ్యాడని అతడిని మొత్తం కులం నుండే వెలివేయడం వలన ఊరుకి దూరంగా భార్యతో నివసించ సాగాడు. నాటి నుండి కర్మానుస్ఠానం వదిలివేసి ఆవిడ తోడిదే లోకంగా బ్రతక సాగాడు. సంసారం పోషించుకోవడం కోసం చెయ్యని పాపాలు లేవు.
క్రమక్రమంగా వృద్ధ్యాప్యంలో అజామిళుడు పడ్డాడు.శరీర పాటవం తగ్గిపోవడం వలన మంచాన పడ్డాడు.అతడిని చిన్నకొడుకైన నారాయణ పట్ల ఎంతో ప్రేమ వుండేది. వాడిని చూడకుండా, వాటిని తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా వుండేవాడు కాదు.
ఒకరోజు అతనికి అవసాన దస సమీపించింది. ప్రాణాపాన వాయువులు శరీరం నుండి నిష్క్రమించే సమయం వచ్చింది. యమభటులు ఆయుధాలు ధరించి ఎదుట నిలబడ్డారు. పుత్ర వియోగం కలుగుతున్నందుకు బాధతో నారాయణా అంటూ వణుకుతున్న కంఠంతో పిలిచాడు.
మరుక్షణంలోనే ప్రాణాలు వదిలాడు. యమభటులు అతడిని సూక్ష్మ శరీరంతో నరక లోకానికి తీసుకుపోతున్నారు. తీరా నరక ద్వారం సమీపిస్తున్నంతలో విష్ణుదూతలు వచ్చి అడ్డగించి అతడిని వైకుంఠానికి తీసుకురావాల్సిందిగా విష్ణు భగవానుడి ఆజ్ఞ అని చెప్పారు.ఆశ్చర్యం తో యమభటులు" వీడు జీవితంలో చెయ్యని పాపాలు లేవు. వీడికి నరకమే గతి అని యమ ధర్మరాజు చెప్పారు. ఈ పాపాత్మునికి వైకుంఠవాస ప్రాప్తి ఎలా ఇస్తారని అడిగారు. అందుకు విష్ణుదూతలు" ఈ అజామిళుడు జీవితంలో ఎన్ని పాపాలు చేసినా కూడా అవసాన దశలో శ్రీహరిని స్మరించడం వలన  అన్ని పాపాలు ప్రక్షాళన అయిపోయి ధన్యత పొందాడు"  అని వారికి శ్రీహరి నామస్మరణ యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేసి వైకుంఠానికి సూక్ష్మ శరీరంతో తీసుకువెళ్ళారు.
అందుకే పిల్లలకు నారాయణ నామం పేరుగా పెట్టుకొని పిలిచినా,గ్రంథ పఠనంలో శ్రీహరి నామాలు నోరారా పలికినా,కష్ట సమయంలో మరియు అంత్య సమయాలలో నారాయణ అని నోరారా పలికినా జీవుడు సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడన్నది వేదాలు నిరూపించిన సత్యం.


కామెంట్‌లు