పెన్సిళ్ళతో తుషార్ రికార్డు!;-- యామిజాల జగదీశ్
 ఢిల్లీ కుర్రాడు తుషార్ లఖన్‌పాల్ పెన్సిల్ సేకరణలో గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఏడేళ్ళ క్రితం వసంత్ కుంజ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న రోజుల్లో తుషార్ ఈ రికార్డు నెలకొల్పాడు. పెన్సిళ్ళ సేకరణలో అతని దగ్గర వివిధ ఆకారాలు, పరిమాణా లలో 19,000 కంటే ఎక్కువ లెడ్ పెన్సిల్స్ ఉండటంతో ఈ అరుదైన రికార్డుకి సొంతదారుడయ్యాడు. అఫ్ కోర్స్ రెండేళ్ళ క్రితం ఈ రికార్డు ఓ విదేశీయుడి పరమైంది.
17 ఏళ్ల తుషార్ లఖన్‌పాల్ ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల నుంచి 19,824 పెన్సిళ్లను సేకరించాడు. 
ఇందుకు సంబంధించి లండన్‌లోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కార్యాలయం పూర్తి వీడియోతోపాటు స్టిల్ ఫోటోలు తీసింది. ఈ సందర్భంలో ఓ పెన్సిల్ తయారీ కంపెనీ ప్రతినిధి, ప్రభుత్వ అధికారి, ప్రజా జీవితంలోని ఓ సీనియర్ వ్యక్తి కూడా పాల్గొన్నారు.
తుషార్ మాట్లాడుతూ, "నేను 3 సంవత్సరాల వయస్సు నుండి పెన్సిల్స్ సేకరిస్తున్నాను. నేను బహుమతులుగా పొందిన పెన్సిళ్లను జాగర్తగా దాచుకునేవాడిని. వాటిలో వివిధ రకాల పెన్సిళ్లు ఉండటంతో సేకరించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాను. క్రమంగా ఈ అలవాటు ఓ ఉద్వేగభరితమైన అభిరుచిగా మారింది, ఇది నా కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రోత్సాహమూ ఉంది" అని చెప్పాడు.
ఉరుగ్వేకు చెందిన ఎమిలియో అరేనాస్ 16,260 లెడ్ పెన్సిల్‌ల సేకరణతో గిన్నిస్ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డుని తుషార్ అధిగమించాడు. అయితే ఎమిలియో రెండేళ్ళ క్రితం ఈ రికార్డును తిరగరాశాడు. ఎమిలియో సేకరించిన పెన్సిళ్ళు  24,026. ఎమిలియో అరవై నాలుగేళ్ళుగా పెన్సిళ్ళు సేకరిస్తున్నాడు.
తుషార్ దగ్గర వివిధ దేశాల నుండి సేకరణలో రకరకాల ఆకారాలు, పరిమాణాలలో పెన్సిళ్ళు ఉన్నాయి. అతని దగ్గర 3 సెంటీమీటర్లు మొదలుకుని 8 అడుగుల 3 అంగుళాల పొడవు గల పెన్సిలు దాకా ఉన్నాయి.  క్లచ్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, సువాసన పెన్సిళ్లు, వివిధ క్యాప్‌లు, బొమ్మలతో కూడిన పెన్సిళ్లు, చెక్క పెన్సిళ్లు, చేతితో తయారు చేసిన పేపర్ పెన్సిళ్లు, రీసైకిల్ చేసిన వార్తాపత్రిక పెన్సిల్సూ, చెంచా ఆకారంలోనూ,  థర్మామీటర్ పెన్సిల్స్, 24 క్యారెట్ గోల్డ్ డిజైనర్ పెన్సిల్ ఇలా మరెన్నో ఉన్నాయి.
తుషార్ పెన్సిళ్ళ సేకరణకు సంబంధించి 2009, 2010, 2012లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు చేసుకుంది.  
ఒకప్పుడు ఇంగ్లండ్ రాణి ఉపయోగించిన మరో రెండు పెన్సిళ్ళు కూడా తుషార్ దగ్గరుండటం విశేషం. "ఈ రెండూ నా సేకరణలో అత్యంత విలువైనవి. నా హృదయాన నిలిచిపోయేవి" అని తుషార్ చెప్పాడు. 
తుషార్ తన సేకరణలో ఒకేలాంటివి అదనంగా ఉండే పక్షంలో తోటి పిల్లలకు ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు.
అతనిప్పుడు పెన్సిల్ మ్యూజియంను ప్రారంభించాలని ఆలోచిస్తున్నాడు. అలా అతను ఆరంభిస్తే ప్రపంచంలో అది రెండవదవుతుంది. ఎందుకంటే ఇంగ్లండులో ఇప్పటికే ఓ పెన్సిల్ మ్యూజియం ఉంది. స్కూలు పిల్లలందరూ తన దగ్గరున్న పెన్సిళ్ళను చూడాలన్నది తుషార్ ఆశ. 

కామెంట్‌లు