దేవుడున్నాడా? లేడా?;-- యామిజాల జగదీశ్
 "నాన్నా, దేవుడు ఉన్నాడా లేడా" సైకిల్  నేర్చుకుంటున్న పదేళ్ళ అబ్బాయి తొక్కడం ఆపి నేలమీద కాలు పెట్టి నిల్చుండిపోయాడు.
"ఏమిట్రా ఉన్నట్టుండీ ప్రశ్న" అడిగాడు తండ్రి.
"ఏమీ లేదు నాన్నా. దేవుడు అనే వాడు లేనేలేడు. అంతా అబద్ధం అని మా టీచర్ చెప్పారు" అన్నాడు అబ్బాయి. 
"దేవుడు ఉన్నాడా లేడా అనేది ముఖ్యం కాదురా. అలా ఒకరు మనకు కావాలా వద్దా  అనేదే ముఖ్యం" చెప్పాడు తండ్రి.
"మనకెందుకు దేవుడు?" అడిగాడు అబ్బాయి.
"కరెక్ట్. అది తర్వాత చెప్తాను. నువ్విప్పుడు సైకిల్ తొక్కు" అన్నాడు తండ్రి.
రెండురోజులుగా ముమ్మరంగా సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నాడు. వెనకాల క్యారియర్ ని పట్టుకుంటూ తండ్రి వెంట వెళ్ళడం మామూలు. ఈరోజు ఓమేరకు ఎలా బ్యాలన్స్ చేయాలో తెలుసుకున్నాడు అబ్బాయి అని గ్రహించిన తండ్రి వెనకాల క్యారియర్ పట్టుకోవడం మాని ఆగిపోయాడు. అబ్బాయి బాగానే తొక్కుతున్నాడు సైకిల్. కొంచెం దూరం వెళ్ళ గానే "శెభాష్...బాగాతొక్కుతున్నావురా" అంటూ తండ్రి చప్పట్లు కొట్టాడు. 
అంతే, ఆ మాట చెవిన పడటంతోనే సైకిలుతోసహా అబ్బాయి కింద పడ్డాడు తటాలున.
పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి అబ్బాయినీ సైకిలుని పైకి లేపాడు.
"నేను వెనకాల పట్టుకున్నాననే నమ్మకంతో నువ్వు ఇంతదూరం ఒక్కడివే తొక్కుకుంటూ రాగలిగావు. కానీ నేను చేయొదిలేసానని తెలిసిన మరుక్షణం కింద పడిపోయావు. దేవుడి నమ్మకంకూడా అలాంటిదేరా" అన్నాడు తండ్రి.
"బాగా సైకిల్ తొక్కడం నేర్చుకుంటే నువ్వు పట్టుకోకపోయినా కిందపడకుండా తొక్కుతా నాన్నా" అన్నాడు అబ్బాయి.
"అవును కదూ....అదీ నిజమే" అనుకున్నాడు తండ్రి.

కామెంట్‌లు