మనతెలుగు వెలుగులు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నన్నయ్య నట్టింటపుట్టి నడయాడి
తిక్కన ఘంటాన తియ్యందనమయి
పోతన పద్యాలలో పోతపోసుకొని
మనతెలుగు ప్రఖ్యాతిపొందింది

ధూర్జటి కావ్యాలలో దద్దరిల్లి
అల్లసాని అక్షరాలతో అలరించి
రాయలచేత లెస్స యనిపించుకొని
మనతెలుగు ఘనకీర్తి గడించింది

శ్రీనాధ ప్రబంధాలలో శ్రంగారమయి
తిరుపతి కవులనోట తీపిపద్యాలయి
బళ్ళారి నాటకరంగాన అజరామరమయి
మనతెలుగు నందనవనమయి నిలిచింది

గురజాడ చేతిలో ముత్యాలసరమయి
గిడుగు పుణ్యాన వ్యావహారికమయి
రాయప్రోలు కలాన తృణకంకణమయి
మనతెలుగు దేదీప్యమానమై మెరిసింది

విశ్వనాధ చేతిన వేయిపడగలయి
నండూరికలాన అమాయక యెంకయి
జాషువా కవనాన గబ్బిలమయి
మనతెలుగు మనసులను దోచింది

దేవులపల్లి కలాన భావకవితలయి
దాశరధి చేతిలో రసరమ్యగీతాలయి
పుట్టపర్తి పేరున పెనుకొండలక్ష్మయి
మనతెలుగు వెలుగులను చిమ్మింది

సినారె సాహిత్యాన విశ్వంభరమయి
కరుణశ్రీ నోట పుష్పవిలాపమయి
చలం ఊహలలోన మైదానమయినిలిచి
మనతెలుగు మన్ననలను సంపాదించింది

వేమన పద్యాలలో విశ్వవ్యాప్తమయి
బద్దెన సుమతీశతకాన హితములయి
శ్రీశ్రీ వ్రాతలలో మరోప్రపంచమయి
మనతెలుగు లోకాన వాసికెక్కింది

చక్కగ పదాలనుపారించి చేర్చికూర్చి
ఇంపుగసొంపుగ అక్షరాలను పొదిగి
పాటలను కవితలను ప్రీతితో వ్రాసి
తెలుగుతల్లి మెడలోవేసెద మల్లెదండనల్లి

రుచిగ శుచిగ వండివడ్డించి
వినోద వికాసముల  జోడించి
హావ భావములను పసందుగామలచి
తెలుగుతల్లికి జైకొట్టెద గళమునెత్తి

ఓరి తెలుగోడా
తెలుగుచరిత్ర తెలుసుకోరా
తెలుగుసాహిత్యం చదవరా
తెలుగుభాషను వ్యాప్తిజేయరా 


కామెంట్‌లు