చీమలు చెప్పిన పాఠం;-- యామిజాల జగదీశ్
ఇది కథ కాదు,
కవితా కాదు,
ఓ సంఘటన!

ఓరోజు సాయంత్రం వేళ...
ఓ మంచి పుస్తకాన్ని చదువుతున్నాను
ఇంతలో
మెడమీద చురుక్కుమంది...
చేయి పెట్టి చూస్తే
కుట్టిందొక చీమని తెలుసుకున్నాను

అంతేకాదు,
నేను ఆనుకుని కూర్చున్న గోడమీద
చీమల దండు...
రేపటి అవసరాలకు 
ఈరోజే ఆహారపు వేటలో ఉన్నాయవి
దారి తప్పని వరుసలో
చీమలు చురుగ్గా పోతున్నాయి

చీమల గురించి
చిన్నప్పుడు స్కూలు పాఠ్యపుస్తకంలోనూ
పెద్దలు అక్కడక్కడా చెప్పిన కథలతోనూ
ఎన్నో విషయాలు తెలుసుకున్నా...

వాటిలో ఎంతటి చురుకుతనమో
రేపటి అవసరాలకు
ఆహార సేకరణకు పోతున్నాయి
తీపిపదార్థంలో మన్ను కలిస్తే
దానిని వేరు చేసి తీసుకుపోతాయి
అంతేతప్ప 
కనిపించింది కదాని
చెత్తాచెదారాన్ని తీసుకుపోవు
ఇలా ఎన్నో విషయాలు
చదివాను అక్కడక్కడా...

అయితే కొత్తగా మరేదైనా దాని నుంచి
తెలుసుకోవాలనిపించింది

ఏ అడ్డంకీ లేకుండా 
పోతున్న చీమల దారి నడుమ
నా వేలు అడ్డుపెట్టాను...

అప్పటివరకూ
ఏ సమస్యా లేని వాటి ప్రయాణంలో
సమస్యగా నా వేలు...

వరుసకు నా వేలు అడ్డు పడటంతో
దారి తెలీక చీమలు చెల్లాచెదురయ్యాయి

కొన్ని చీమలు
నా వేలుని చూసి భయపడ్డాయి
వచ్చిన దారినే వెనుతిరిగాయి

ఇంకొన్ని చీమలు 
నా వేలు నుంచి పక్కకు జరిగి
చుట్టుతిరిగి సాగిపోయాయి
మళ్ళా తమ ప్రయాణాన్ని వరుసక్రమంలో
కొనసాగించాయి

మరికొన్ని చీమలు 
నా వేలుమీదకెక్కి
కిందకు దిగి ముందుకు పోయాయి
వాటిలో ఒకటి రెండు కుట్టడంతో
నొప్పెట్టి వెనక్కుతీసుకున్నా నా వేలిని

ఇంత చిన్న చీమలలో
ఎన్ని గుణాలో....
ఎంత చక్కగా పాఠం చెప్పాయో...

మనలోనూ ఇలా
పలు రకాలవారుంటారు

జీవితంలో కొందరు
తమ ప్రయత్నాలను
సమస్యలకు భయపడి కొనసాగించక
మధ్యలోనే తప్పుకుంటారు

కొందరు
మనకొచ్చిన గొడవనుకుని
సమస్యల నుంచి తప్పుకుని
పక్కకు పోతారు ప్రశాంతంగా...

కొందరు సమస్యలను 
చాలా తేలికగా తీసుకుని 
సమర్థతతో
శక్తియుక్తులతో సాధిస్తారు
అనుకున్న దానిని 

కొందరు 
సమస్యకే సమస్యగా మారి
ఎదురొడ్డి నిల్చుని 
విజయం సాధిస్తారు

అద్భుతమైన పాఠాన్ని 
చెప్పక చెప్పిన చీమలకు కృతజ్ఞతలు
చెప్పడం నా వంతైంది...!!కామెంట్‌లు