అమృతపానీయం ;-చంద్రకళ యలమర్తి, విజయవాడ

 తెల తెల వారక మునుపె 
మత్తు కనులు తెరిచి తెరవక నే
తూరుపులో సూరీడు పొడవకనే
ఆమె అలికిడి లేక ఉలికిపడి
మాటలు తడబడి చతికిలబడి 
నా నెచ్చెలి ప్రాణసఖి
ప్రియసతి కానరాక
గుండెలు ఝల్లుమనె 
నరములు జివ్వుమనె 
తనువు తహతహ లాడె
ప్రాణములు విలవిలలాడె 
నలుదిశల నాకనులు వెతికి 
జవ్వని జాడలేక కలత  పడినవి 
తీయని పాయసముకన్న
జుంటె తేనియ కన్న
తేనెలూరు జున్నుకన్న
మత్తున ముంచు మధువు కన్న
తెలివినిచ్చు క్షీర పానీయమె మిన్న
ఆతురుతతొ వేచి వేసారితి 
తెల్లని, చిక్కని పాలు మరగకాచి
నల్లని కాఫీ గింజల పొడిని వేసి
తియ్యని చక్కర గుళికలు కలిపి
పలుమార్లు ప్రియముగ తిరగపోసి
తెల్లని నురగలు కక్కు కమ్మని
నొ్రూరించెడి ఘుమ ఘుమల
పానీయమునకై చకోరమైతి 
క్షణమొక యుగముగ వగచితి
నాతపము, నిరీక్షణ ఫలియించి,
ప్రత్యక్షమాయె నాఅనురాగ దేవత 
అమృతము పంచు మోహినివోలె
దేవేరి అరుదెంచె చేత కాఫీ కప్పుతొ 
నా పెదవుల  విచ్చుకున్నవి
ఆ సువాసనలు ఆఘ్రాణించి 
 ఆమధురిమలు ఆస్వాదించి
అలవోకగ సుతి మెత్తగ సుధా పానము 
నాకంఠ సీమన జాలువారగనే
అరమోడుపు కన్నుల మైమరచితి
జన్మ సాఫల్యము నొందితి
వింతగా నా పంచ ప్రాణములు
మరల తిరిగి వచ్చిచేరె నాలోన
నిజమో కలయో, పగలో రేయో 
 ఇదేమి యోగమో, మాయయో  
 తెలియక కాలమాగి స్వర్గమే అగుపించె 
అలౌకిక, అద్భుత అనిర్వచనీయ ఆనందం 
దక్కేను ప్రతి ఉదయం !
****

కామెంట్‌లు