'ఎవరిధర్మంవారేనిర్వర్తించాలి";-ఎం బిందుమాధవి
 రామాయణాన్ని మనకి తెలిసిన కధే అనుకుంటే సరిపోదు.
లోతుగా పరిశీలిస్తే... అందులో మనం నేర్చుకోవలసిన విషయాలు..ధర్మాలు చాలా ఉన్నాయి.
సీతా రాములు మానవ జన్మనెత్తి మానవులుగానే సంచరించారు. కాబట్టి వాళ్ళు మసిలినట్టు, ప్రవర్తించినట్టు మనకి కుదరదు అనుకోవటానికి లేదు.
సీతా దేవిని అపహరించటానికి రావణాసురుడు ముందుగా మారీచుడిని బంగారు లేడి రూపంలో పర్ణశాలకి పంపించి ఆమెని ప్రలోభపెట్టాడు.
మాయలేడి కాకపోతేమరొకటి మనని ప్రలోభపెడుతుంది.
ఆ బంగారులేడిని పొందాలని సీతా దేవి ఆశపడి శ్రీరాముడిని తనకి దాన్ని తెచ్చి ఇమ్మని అడుగుతుంది. మారీచుడు ఆ ప్రయత్నంలో కావాలనే రాముణ్ణి పర్ణశాలకి దూరంగా తీసుకెళతాడు. సీతా దేవిని తప్పుదారి పట్టించటానికి మారీచుడే రాముడి గళంతో సహాయం కోసం అరిచి..లక్ష్మణుడిని కూడా అక్కడికి రప్పిస్తాడు.
ఒంటరిగా పర్ణశాలలో మిగిలిన సీతా దేవిని మోసం చేసి రావణాసురుడు అపహరించాడు.
తనకి దూరమైన భార్యని లక్ష్మణుడి సహాయంతో వెతుకుతూ రాముడు కిష్కింధకి చేరటం...అక్కడ సుగ్రీవుని పనుపున హనుమ సీతా దేవిని వెతుకుతూ లంకకి చేరటం జరుగుతుంది.
హనుమ లంకలోని వనాలు..నదులు..ఉద్యానవనాలు..గృహాలు..చివరికి రావణాంతః పురంలో కూడా వెతికి వెతికి చివరికి అశోకవనం లో ఆమెని చూసి సంతోషిస్తాడు.
ఆమెని పోగొట్టుకున్న రాముడు అనుభవిస్తున్న బాధని ఆమెకి వివరిస్తాడు. అక్కడ సీతాదేవి పరాయి రాజ్యంలో అనుభవిస్తున్న క్షోభ ..రావణుడు స్వయంగా ఆమెని మాటలతో హింసించటమే కాకుండా... రాక్షస స్త్రీలని ఉసిగొలిపి పెట్టే బాధలు ప్రత్యక్షంగా చూసి...ఇంకా ఆమె బాధపడటం చూడలేనని.. తన భుజాలు ఎక్కితే ఆమెని రాముడి వద్దకి వెంటనే చేరుస్తానని చెబుతాడు.
ఇతరుల దృష్టిలో పడకూడదని హనుమ తన సూక్ష్మ రూపంలో సీతతో సంభాషిస్తాడు. తనని తీసుకెళతానన్న హనుమతో 'ఇంత సూక్ష్మంగా ఉన్న నువ్వు నన్ను ఎలా తీసుకెళ్ళగలవు' అని ఒకసారి...రూపం పెంచిన హనుమతో 'నీ వేగానికి నేను సముద్రంలో పడిపోతానని' ఒక సారి... తన సందేహాన్ని వ్యక్త పరుస్తుంది.
తరువాత సంభాషణ కొనసాగిస్తూ...'నన్ను రావణుడు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నేను నిస్సహాయమైన స్థితిలో ఉన్నాను. కాబట్టే అతను నన్ను స్పృశించి తీసుకురాగలిగాడు. కానీ ఇప్పుడు తెలిసి బుద్ధి పూర్వకంగా పర పురుషులని స్పృశించను.. నేను పతివ్రతని' అంటుంది.
ఆ మాటతో చిన్నబుచ్చుకున్న హనుమతో...నువ్వు నాకు పుత్ర సమానుడవు. నా నిజమైన అభ్యంతరం అది కాదు. ఆ నాడు రామచంద్ర మూర్తి లేనప్పుడు రావణుడు నన్ను దొంగతనంగా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళితే రావణుడి చర్యకి మన చర్యకి తేడా ఉండదు.
అంతే కాదు... నన్నొక్క దాన్ని నువ్వు రక్షించితే చాలదు. రావణుడి వల్ల క్షోభ పొందుతున్న లోకమంతా రక్షించబడాలి. రావణ సంహారం జరిగితేనే అది జరుగుతుంది. అది రామచంద్రమూర్తి వల్ల మాత్రమే జరగ గలదు. అప్పుడే రామచంద్రుని అవతార పరమార్ధం నెరవేరుతుంది. అది ఆయన పని కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి లక్ష్మణ సహితంగా రామచంద్ర మూర్తిని శీఘ్రమే ఇక్కడికి తీసుకురా అంటుంది.
'ఎవరికి నిర్దేశించిన పని వారే చెయ్యాలి. ఎవరి ధర్మాన్ని వారే నెరవేర్చాలి' అని చెబుతుంది.
ఈ సంఘటన వింటుంటే..పంచతంత్రం కధల్లో చాకలి ఇంట్లో ..వారింటికి వచ్చిన దొంగని చూసి యజమానికి సేవ చెయ్యాల్సిన కుక్క అరవకపోతే.. దాని బదులు గాడిద తను అరిచి చాకలి చేతిలో దెబ్బ తిన్న కధ గుర్తొస్తోందా?
అంటే మనకి ఎంత శక్తి సామర్ధ్యాలున్నా..మనం ఎంత ప్రయోజకులమైనా మనకి నిర్దేశించని పని జోలికి పోకూడదు అని రామాయణం ఎంత చక్కగా చెప్పిందో కదా!


కామెంట్‌లు