నెమలి నేర్పిన పాఠం;-డి.కె.చదువులబాబు.

 ఒక అడవిలో కందకం, వందనం అనే కోతులు ఉండేవి. కందకం సోమరికోతి. దానికి కష్టపడి ఆహారం సంపాదించుకోవడం ఇష్టంలేదు.అందువల్ల జంతువులు, పక్షులు దాచుకున్న ఆహారాన్ని దొంగిలించి కడుపు నింపుకునేది.కడుపు నిండగానే పడుకునేది. వందనం కష్టపడి తిరుగుతూ ఆహారం సంపాదించుకునేది.
ఒకరోజు వందనం, కందకంతో "నేను నాట్యం నేర్చుకోవాలని నెమలి వద్దకు వెడుతున్నాను.వస్తావా?"అంది.
"నాట్యం ఎందుకు నేర్చుకోవాలి?" అంది కందకం.
  " అడవిలో  జంతువులు, పక్షులు నెమలి నాట్యాన్ని,కోయిలపాటను,గిజిగాడిగూడును,చేపఈతను చూసి ప్రశంసిస్తున్నాయి. తినడం,నిద్రపోవడం కాకుండా మనం కూడా ఏదో ఒక కళలో నైపుణ్యం సంపాదించి, ఆనందాన్ని పంచుదాం. అందరి ప్రశంసలను అందుకుందాం.అడవిలో మనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుందాము" అంది వందనం.
"మధురంగా పాట పాడటానికి మన స్వరం పనికిరాదు.గిజిగాడిలా గూడు అల్లడం పక్షులకే చేతకావడంలేదు. మనవల్ల ఏమవుతుంది?నాకు నీళ్ళు అంటే భయం. ఈతవద్దు.నాట్యమంటే కాళ్ళూ, చేతులూ కదిలిస్తూ గెంతులేయడమేకదా! అంత మాత్రానికి గుర్తింపు వస్తుందంటే ఏందుకు రానూ?పోదాం పదా"అంది కందకం.
నెమలి వాటి కోరిక విని "మీకు నాట్యం నేర్పాలంటే ముందుగా నేను నివాసముంటున్న ఈచెట్టు చుట్టూ పరిసరాలను శుభ్రం చేయాలి"అంది.
కోతులు సరేనని పని మొదలుపెట్టాయి. కొద్దిసేపటికే కందకం ఆయాసపడుతూ ఈపని నావల్ల కాదు. చేతులు, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి." అని దూరంగా వెళ్ళి, ఓచెట్టు నీడన కూర్చుంది. 
వందనం చాలాసేపు కష్టపడి ఆచెట్టు పరిసరాలను శుభ్రం చేసింది. నెమలి కోతులను రేపటిదినం రమ్మంది.
 మరునాడు ఉదయమే కోతులు నెమలి వద్దకు వచ్చి నాట్యం నేర్పమన్నాయి. నెమలి వాటితో "నా తోక, ఒళ్లు దుమ్ము నిండుకుని ఉన్నాయి. పక్కనున్న పల్లెకు వెళ్లి, గుడ్డను సంపాదించుకుని వచ్చి, శుభ్రం చేయండి.అప్పుడు నాట్యం నేర్పుతాను" అంది.
కందకం, వందనంతో "ఇదేమన్నా గొర్రెతోకనా! నెమలి ఈకలను శుభ్రం చేయడమంటే మాటలా?నావల్ల కాదు"అంది.
వందనం పల్లెకు వెళ్లి గుడ్డను సంపాదించుకుని వచ్చి, కష్టపడి నెమలి చెప్పిన పని పూర్తి చేసింది.
వందనంను మరునాడు రమ్మని చెప్పింది నెమలి.
మరునాడు వందనంకోతి, కందకంకోతిని కూడా వెంట పిల్చుకుని వచ్చింది. నెమలి వందనంతో "నీకు నాట్యం నేర్పాలంటే నాకు మరి ఒక పని చేసిపెట్టాలి" అంది.  
వందనం చెప్పమంది.
"నాతోకకు ఎన్ని పింఛాలున్నాయో తెలుసు కోవాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. ఒకసారి లెక్కించి చెప్పాలి" అంది.
 నెమలి చెప్పిన పని పూర్తిచేసింది.వందనం. "రేపురా.నాట్యం నేర్పుతాను." అంది నెమలి. 
మరునాడు వందనం కందకంతో కలిసి వెళ్లింది. 
నెమలి కందకంతో "నీవు ఎందుకు వచ్చావు?"  అంది.
 "నాట్యం నేర్చుకోవడానికి వచ్చాను" అంది కందకం.
"ఏవిద్యనైనా అభ్యసించాలంటే కోరికతో పాటు ఓర్పు, పట్టుదల, శ్రద్ద, కష్టపడేగుణం ఉండాలి.అవిలేకనే నీవు నేను చెప్పిన పనులు ఏవీ చేయలేకపోయావు. పరిసరాలు శుభ్రం చేయడానికే కాళ్ళు, చేతులు లాగుతున్నాయని నీవు ఆయాస పడినప్పుడే సోమరిగా కాలం గడుపుతున్నావని అర్థమయింది. అలాంటి నువ్వు నాట్యం ఏం నేర్చుకోగలవు?. కష్టపడే గుణం,ఓర్పు,శ్రద్ద,పట్టుదల ఎంత మాత్రమున్నాయో పరీక్షించడానికే నేను పనులు చెప్పాను. వందనం చేయగల్గింది. కాబట్టి నాట్యవిద్యను అనతికాలంలోనే నేర్చుకొని,అందరి మెప్పూ పొందగలదు.నువ్వు వందనానికి తోడుగా వచ్చావు.కానీ నీలో శ్రమతత్వం లేదు.సోమరితనం వదిలించుకునిరా!అప్పుడు చూద్దాం"అంది నెమలి.
'తాను కష్టపడకుండా సోమరిగా గడపడంవల్ల ఏపని చేయాలన్నా ఒళ్లు వంచలేకపోయింది.శరీరం సహకరించలేదు. మనసు ఒప్పుకోలేదు. అంటే నా శరీరం ఆరోగ్యంగా లేనట్లే. అలాంటి తాను ఏపని చేయాలన్నా ముందుగా సోమరితనం వీడాలి. ఎదుగుదలకు బద్దకం బద్దశత్రువు.' అనుకుంటూ తన నివాసం దారి పట్టింది కందకం.

కామెంట్‌లు