విలువ తెలీని మగపుట్టుక;-- యామిజాల జగదీశ్
 స్త్రీతో సహా అన్ని ప్రాణులను సృష్టించిన దేవుడు చివరగా పురుషుడి సృష్టిని మొదలు పెట్టాడు...
ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఆరు రోజులుగా పురుషుడి సృష్టి కొనసాగించాడు. అది చూసిన దేవత "ఎందుకీ సృష్టికి మాత్రం ఇంత సమయం పడుతోంది?" అని అడిగింది.
అందుకు దేవుడు "ఈ సృష్టికి నేను ఎన్నో విషయాలను వరాలుగా ఇవ్వాలి. ఈ మగ సృష్టి నచ్చిందీ నచ్చలేదు అని దేనినీ వేరు చేయక పెట్టింది తినాలి. పంతానికి పోయే బిడ్డను క్షణంలో దారికి తీసుకురావాలి. చిన్న గాయం మొదలుకుని విరిగిన మనసు వరకూ అన్నింటికీ అతను ఓ ఔషధమై ఉండాలి. అతనికి ఆరోగ్యం బాగులేనప్పుడూ అతనే నయం చేసుకుని రోజంతా శ్రమించాలి. ఇన్నింటినీ చేయడానికి అతనికి రెండే రెండు చేతులు మాత్రమే ఉంటాయి..." అన్నాడు.
 
"అదేంటీ ఇన్నింటికీ రెండు చేతులేనా?" అని దేవత విస్తుపోయింది.
మెల్లగా మగాడిని తాకిన దేవత "కానీ ఇతనిని ఇంత కఠినంగా సృష్టించారేమిటీ?" అని అడిగింది. 
దానికి దేవుడు "ఇతను శారీరకంగా కఠినమైనవాడు. చూడటానికి అలా కనిపిస్తాడు. కానీ మానసికంగా చాలా సున్నితమైనవాడు. అందుకే అన్ని సమస్యలనూ ఎదుర్కొంటాడు. అధిగమిస్తాడు. అంతేకాదు అతను అన్ని బరువులనూ తట్టుకోగలడు. కష్టం, ప్రేమ, కోపం అని అన్ని భావోద్వేగాలనూ తనలోనే అదుపులో ఉంచుకోవడం తెలుసు. నవ్వొచ్చినా దానిని కోపంద్వారా చూపగలిగే తత్వం ఈ సృష్టికి ఉంది. తనకు న్యాయమని అనిపిఉచే విషయంకోసం పోరాడి జయించడం తెలుసు. ఇతరుల నుంచి దేనినీ ఆశించక ప్రేమను మాత్రం చూపిస్తాడు...." అంటాడు.
"ఓహో...ఈ మేరకు మగాడు ఆలోచించగలడా?" అని దేవత అడుగుతుంది.
"అన్ని విషయాల గురించి ఆలోచించడమే కాదు. వాటికి పరిష్కారమూ అతను చెప్పగలడు" అని వివరించాడు దేవుడు...
ఆ దేవత మగాడి కళ్ళను నెమ్మదిగా తాకి "ఇతని కళ్ళు ఎండిపోయినట్లు పొడిగా ఉన్నాయేంటీ? కన్నీళ్ళు రావా" అని ప్ర
శ్నించింది. 
అప్పుడు దేవుడు "ఓ మగాడి కన్నీరు ఎంతో సున్నితమైంది. అది ఎప్పుడూ రాదు. ఒకవేళ వచ్చిందంటే అది అతనినే కాకుండా చుట్టూ ఉన్నవారందరినీ బాధపెడుతుంది. కనుక అతని సంతోషమూ దుఃఖమూ దిగులూ ఆశ్చర్యమూ అంటూ అన్ని భావోద్వేగాలను చూపకుండా ఓ నవ్వుతో దాటేస్తుంటాడు" అన్నాడు.
అయితే మీ సృష్టిలో ఇది అమోఘం. అయితే ఈ సృష్టిలో ఎలాంటి లోపమూ లేదా అని అడిగింది దేవత. 
"తన విలువేంటో మగాడికి ఎప్పటికీ తెలీదు..." అని దేవుడు తేలికగా జవాబిచ్చాడు.
(గమనిక తమిళ మూలానికి అనుసృజన. రాయడమైతే రాసాను కానీ కొన్ని భావోద్వేగాలు నా వరకైతే సరికావు. చాలా చిన్న చిన్న విషయాలకు ఆలస్యాలకు నేను కోప్పడతాను. ఆ కోపాన్నో అసహనాన్నో చూపకూడదనే అనుకుంటాను. కానీ దాచుకోలేను. అయితే కాస్సేపు తర్వాత ఆలోచిస్తాను. అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది కదా అని బాధ పడతాను. ఏం చేయను...పుట్టుకతో వచ్చిన గుణమేమో మరి. ఈ జన్మకింతేనేమో. ఇలాగే మిగిలిన వారికి అన్పించొచ్చు...అన్పించక పోవచ్చు. అది వ్యక్తిగత విషయం. పోస్టయితే రాయాలన్పించి స్వేచ్ఛానువాదం చేసాను నాకు నచ్చడంతో! ఇది అందరికీ నచ్చాలనేం లేదు. మరికొన్నింట్లోనూ నేను వెనకబడినవాడినే. ఒకానొకప్పుడు స్త్రీ కన్నీరు గురించి తమిళ కవి కవికో అబ్దుల్ రహ్మాన్ స్త్రీ కన్నీటి గురించి కవితాత్మకంగా రాశారు. అది చదివిన మరుక్షణం రాసానుకూడా. కానీ ఆ ప్రతీ నా దగ్గర లేదు. పోయిందెంటో...

కామెంట్‌లు