జననీ జన్మభూమిశ్చ;-: సి.హెచ్.ప్రతాప్
 తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు కు చెందిన సుబ్బయ్య కుటుంబం పేద కుటుంబం. వున్న అరెకరం పొలం పై వచ్చే ఆదాయంతో మొత్తం కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాడు. అతనికి ఒకే కొడుకు గోపి. చాలా తెలివైనవాడు. చిన్నప్పటి నుండి పేదరికంలో పెరిగినా, ఊళ్ళో వున్న ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ పొరుగునున్న కాకినాడలో సాంఘీక సంక్షేమ హాస్టల్ లో వుండి చదువుకున్నా మంచి తెలివితేటలు కనబరిచాడు. సినిమాలు, షికార్లు వంటి సరదాలను పక్కన పెట్టి మొత్తం రోజు చదువుకే కేటాయించి, కష్టపడి చదువుకొని, చివరకు కాకినాడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో ఉచిత సీటు తెచ్చుకున్నాడు. అతడికి ఇంటర్ లో వచ్చిన మార్కులు, ఎం సెట్ లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వం స్కాలర్ షిప్ కూడా మంజూరు చేసింది.
ఇంజనీరింగ్ లో అసాధారణ ప్రతిభ కనబరచిన అతడికి ఆఖరు సంవత్సరంలో చెన్నైలో ఒక మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రోగ్రామర్ గా  నెలకు యాభై వేలు ప్యాకేజితో ఉద్యోగం వచ్చింది.
ఉద్యోగంలో చేరుతూ తల్లిదండ్రులను కూడా చెన్నై తమతో రమ్మన్నాడు. పుట్టి పెరిగిన ఊరు వదిలి రావడానికి వారు ససేమిరా అంగీకరించలేదు.
ఒక శుభముహూర్తాన చెన్నై లో గోపి ఉద్యోగంలో చేరాడు. తన అసమానమైన ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ప్రమోషన్ లు సంపాదించుకుంటూ జీవితంలో మంచి విజయాలను అందుకోసాగాడు.
కొన్నాళ్ళకు గోపి తండ్రి మంచం పట్టినట్లు కబురు వచ్చింది. ఉద్యోగానికి శెలవు పెట్టి హుటాహుటిన బిక్కవోలు చేరుకున్నాడు గోపి. తండ్రి ఆఖరి దశలో వున్నాడు. కొడుకుతో" నువ్వు మంచి దశలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా వుంది. మన కుటుంబానికి మంచి పేరు తెచ్చి నువ్వు నా ఋణం తీర్చుకున్నావు. అయితే నువ్వు తీర్చుకోవాల్సిన మరొక రుణం కూడా వుంది. అది నీ జన్మ భూమి రుణం. నేను పుట్టినప్పటి నుండి ఆఖరి ఊపిరి వరకు  నన్ను అన్నివిధాల ఈ నేల నన్ను భరించింది. కాబట్టి ఈ జన్మభూమికి నా ఆఖరు కోరికగా ఏమైనా చేసి ఋణం తీర్చుకో" అని అడిగాడు. అలాగేనని గోపి మాట ఇచ్చాక తృప్తిగా కన్ను మూసాడు గోపి తండ్రి సుబ్బయ్య.
తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం సొంత ఊరి అభివృద్ధికి ప్క ప్రణాళిక వేసుకున్నాడు గోపి. అయిదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఊరి స్కూలు బాగు చేయీంచి మంచి ఫర్నిచర్ కొన్నాడు. ఇంకొక సంవత్సరం ఆ ఊరిలో తండ్రి పేరు మీద రెండు మంచి నీటి ప్లాంట్ ఏర్పాటు చేసి రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ ఇచ్చేలా ఏర్పాటు చేసాడు.
తర్వాత ఊరి ప్రాథమిక వైద్యశాల బాగు చేయించడం, ఊరి రోడ్డు రిపేర్ చేయించడం, అత్యవసర పరిస్థితి కోసం ఒక యాంబులెన్స్ కొనడం, ఈ విధంగా తన ఖర్చులు తగ్గించుకుని, ఆదా అయిన డబ్బుతో  ఏదో  ఒక ప్రజోపకార్యం గోపి ఇప్పటికీ చేస్తూనే వున్నాడు. ఆ విధంగా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం కన్న నేల  రుణం   ఎంతో కొంత ఈనాటికి కూడా తీర్చుకుంటునే వున్నాడు.


కామెంట్‌లు