సునంద భాషితం ;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అదును.... పదును
  ******
అదును లేదా అదను అంటే సరియైన సమయం.
సరియైన సమయం, సందర్భం చూసుకుని పనులు చేయడమైనా,మాట్లాడటమైనా చేయాలి.
అదనుగా లేనప్పుడు మనం ఏది మొదలు పెట్టినా  అది చల్లని ఇనుము మీద సమ్మెట పోటు వేసినట్లే.
అపహాస్యం పాలవ్వడమే తప్ప అనుకున్న ఫలితం కానీ, సరైన గుర్తింపు కానీ రాదు.
 వ్యవసాయంలో రైతులు  ఎండాకాలం వ్యవసాయ భూమిని అలా వదిలేస్తారు. వర్షాలు మొదలవుతూ వుంటే అదను చూసి పనులకు శ్రీకారం చుడతారు. అప్పుడే తాము చేసే కృషి ఫలిస్తుందని వారికి తెలుసు.
 ఎట్లా, ఎలా అని బాధ పడకుండా అదను చూసి తీసుకున్న నిర్ణయాలు అమలు పరిస్తే , ఆచరణలో వాటికి  ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
 అలాగే పదును అంటే చురుకుతనం,వాడి.కత్తి కత్తెరలాంటి వస్తువులను సాన పెడితే బండబారిన తనం, మొద్దుబారడం పోయి వాడి పెరుగుతుంది.అదే మనకూ అన్వయించుకోవచ్చు.
 మనస్సును ఎల్లప్పుడూ చురుగ్గా, వాడిగా ఉంచుకోవాలి. అప్పుడే ఉత్సాహం పెరుగుతుంది.పనిలో నాణ్యత కూడా ఉంటుంది.
పదును చైతన్యానికి ప్రతీక.
అదును సమయాసమయాలకు సూచిక.
 అదును చూసి పదను పెట్టుకున్న సత్కార్యపు ఆలోచనలు అమలులో పెట్టాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు