ముల్లా నసీరుద్దీన్ కథలు;-- యామిజాల జగదీశ్
 "తెలుగులో నసిరుద్దీన్ కథలుగా వచ్చిన అతిపెద్ద గ్రంథం ఇదే అని హామీ యిస్తాను...." నన్న రచయిత సౌభాగ్య మాటలతో ఏకీభవిస్తాను. నేనంతకుముందు తెలుగులో ఇన్ని కథలతో కూడిన నసీరుద్దీన్ కథల పుస్తకం చూడలేదు.
అక్షరాలా రెండు వందల యాబై ఏడు పేజీల సౌభాగ్య గారి "ముల్లా నసీరుద్దీన్ కథలు" పుస్తకంలోని మాటలను చదువుతూ పేజీలు తిప్పుతూ పోతుంటే ఎక్కడా బోరు కొట్టకుండా హాయిగా అన్పించింది. 
నేనప్పుడప్పుడూ కొన్ని ముల్లా కథలు "బుజ్జాయి" అనే పిల్లల మాసపత్రికలో రాశాను. ఓ ఏడాది క్రితం వాట్సప్ లోని ఓ గ్రూపులో ఓ పది పదిహేను కథల వరకూ పోస్ట్ చేస్తే ఓ మిత్రుడు "...ఎవడీ ముల్లా...చంపుతున్నావుగా మమ్మల్ని" అని అనడంతో మళ్ళీ ముల్లా కథలు రాయలేదు. బహుశా నేను సరిగ్గా రాయలేదేమో. కానీ ఇంటర్నెట్టులో ముల్లా కథలు కనిపిస్తే చదవటం మాత్రం మానలేదు. ఇంగ్లీషులో కాదండోయ్...తమిళంలో చదివేవాడిని. అలాగే నా దగ్గర తమిళంలో ముల్లా కథల పుస్తకం నా దగ్గరుంది. ఇందులో మొత్తం నూట అరవై కథలున్నాయి. 2006లో చెన్నైలో ఈ పుస్తకాన్ని కొన్నాను. ఇది అప్పటికి ఎనిమిదో ముద్రణ (2005లో). ఈ పుస్తకం తొలిసారి 1988లో అచ్చయింది. అప్పట్లో ముప్పై అయిదు రూపాయలు దీని ధర. తమిళంలో ఈ కథలను రాసిన రచయిత ఎ. సోది. ఇందులో నుంచి నేను కొన్ని కథలు అనువదించాను. తమిళంలో ముల్లా కథల పుస్తకాలనేకం ఉన్నాయి. అలాగే వివిధ తమిళ దిన, వార, మాసపత్రికల్లో ముల్లా కథలు క్రమంతప్పక వస్తుంటాయి. 
ఇక తెలుగులో ఎక్కడో ఎప్పుడో ముల్లా నసీరుద్దీన్ కథల పుస్తకం ఒకటి చదివాను. ఆ తర్వాత పుస్తక రూపంలో మళ్ళీ ముల్లా నసీరుద్దీన్ కథలు చదవడం సౌభాగ్యగారి వల్లే. ఇప్పుడు చదివిన సౌభాగ్యగారి పుస్తకమే నేను చూసిన పెద్ద పుస్తకం ముల్లాకు సంబంధించి. అలవోకగా కథలు రాసేసే బహుగ్రంథ కర్త సౌభాగ్యగారి శైలిలో ఈ నసిరుద్దీన్ కథలు చదువుతుంటే ఎంతో బాగున్నాయోనని చెప్పడం చిన్న మాటే అవుతుంది. 
సౌభాగ్యగారు తమ ఉపోద్ఘాతంలో ముల్లా పుట్టుక, మరికొన్ని వివరాలిచ్చారు. ప్రాంతాల్ని బట్టి ముల్లాకు ఎన్నో పేర్లున్నాయంటూ నసీరుద్దీన్, నస్రుద్దీన్, నస్రుద్దీన్ ఎఫెండీ, హోడ్జా, హోకా మొదలైనవి చెప్పుకొచ్చారు. అయితే తాను మాత్రం నసిరుద్దీన్ అనే రాశానని ఆయన చెప్పుకున్నారు.
తాత్వికుడు, మేధావి, హాస్యకారుడు అయిన ముల్లా కథలు నవ్విస్తాయి. ఆలోచనలో పడేస్తాయి. ముల్లా కథలను ఓషో తన ప్రసంగాలలో ఉటంకించడం చదివానక్కడక్కడా. 
నవ్వునీ  మతాన్నీ దగ్గరకు చేర్చినవాడని, 
అవి రెండూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేలా చేసినవాడు ముల్లా అని చెప్పిన రచయిత అనువదించిన కొన్ని కథలు మచ్చుకి...
పేజీ 175లో...
నసిరుద్దీన్ కొడుకు "నాన్నా! దేవుడు ఎక్కడ వుంటాడు" అని అడిగాడు. 
నసిరుద్దీన్ "నాకెలా తెలుసు? ఆయన ఎప్పుడూ తన యింటికి నన్ను ఆహ్వానించనే లేదు!" అన్నాడు. 
పేజీ 182లో...
నసిరుద్దీన్ పక్కింటతను "నసిరుద్దీన్ ! ఈ సంగతి తెలుసా! జడ్జిగారికి మతిస్థిమితం తప్పిందట" అన్నాడు.
నసిరుద్దీన్ "నేను నమ్మను. మతి లేని వాడికిమతిస్థిమితం ఎలా తప్పుతుంది" అన్నాడు. 
పేజీ 191లో...
క్రూరుడు, మూర్ఖుడు అయిన ఒకరాజు ముల్లా నసిరుద్దీన్ గురించి, అతని తెలివితేటలు గురించి విని పిలిపించి "అవునయ్యా" విన్నాను. "సైతాను నీ మొగుడేట కదా? అతనెలా వుంటాడు?" అన్నాడు.
నసిరుద్దీన్ అద్దమిచ్చి "ఇందులో చూడండి" అన్నాడు.
పేజీ 127 లో...
"నసిరుద్దీన్ ! ఒక ప్రశ్నకు సమాధానంగా యింకో ప్రశ్న వేస్తావు. ఎందుకు?" 
"ఔనా?" అని!
పేజీ 179లో ...
నసిరుద్దీన్ కొడుకు "నాన్నా! ,నేను నీలాగా జ్ఞానిని కావాలంటే ఏం చేయాలి?" అని అడిగాడు.
నసిరుద్దీన్ "అన్నీ తెలిసినవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మౌనంగా విను. యింకా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను విను" అన్నాడు.
ముల్లా నసీరుద్దీన్ కథలలా ఉంటే ముల్లాను ఆధారంగా చేసుకుని ఒకటి రెండు సినిమాలు కూడా వచ్చాయి. 
సోలోవ్యోవ్ రాసిన పుస్తకంలోని కథలతో రష్యన్ భాషలో 1943లో, యకోవ్ ప్రొతజనోవ్ దర్శకత్వంలో నస్రెద్దీన్ ఇన్ బుఖారా అనే సినిమా విడుదలైంది. అలాగే మరొక సినిమా 1947లో "ది అడ్వెంచర్స్ ఆఫ్ నస్రెద్దీన్" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నబీ గనియెవ్ దర్శకత్వం వహించారు. ఇక 
1964లో, కెనడియన్ -బ్రిటీష్ యానిమేటర్ 
రిచర్డ్ విలియమ్స్ నస్రుదిన్ పాత్ర ఆధారంగా ఓ యానిమేషన్ చిత్రాన్ని ప్రారంభించారు. ఇద్రీస్ షా సహాయసహకారాలందించారు. అయితే వీరి మధ్య అనుకోని సమస్యలు తలెత్తడంతో  నస్రెద్దీన్‌  అనే పాత్రను ఉపయోగించుకునే హక్కును విలియమ్స్ కోల్పోయారు. అసంపూర్తిగా ఉండిపోయిన ఈ చిత్రాన్ని ఆ తర్వాత "ది థీఫ్ అండ్ ది కాబ్లర్‌" పేరిట మళ్లీ రూపొందించారు. కానీ మళ్ళీ ఈ సినిమాకు అడ్డంకులు ఎదురయ్యాయి.
కానీ ముల్లా నసీరుద్దీన్ కి పలు దేశాలలో విగ్రహాలు ఆవిష్కరించడం గమనార్హం. కామెంట్‌లు