ట్రోఫీలు....ట్రోఫీలు;-- యామిజాల జగదీశ్
 క్రీడా పోటీలు నిర్వహించి తుది పోరులో గెలిచిన వారికి ట్రోఫీ ఇస్తుండటం చూస్తుంటాం. నాలుగేళ్ళకోసారి జరిగే ఒలింపిక్సులో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు ఇస్తారు. ట్రోఫీ Trophy అనే పదం ఫ్రెంచ్ మాటైన “Trophee” నుంచి వచ్చింది. 1550లలో ట్రోఫీ అనే పదాన్ని ఇంగ్లీషులో చేరింది. పూర్వం గ్రీస్‌లో, యోధుడి విజయానికి ప్రతీకగా ట్రోఫీలిచ్చేవారు. 
పురాతన రోమన్లు ​కూడా విజేతకు ట్రోఫీ ఇచ్చేవారు. 
క్రీడాకారులకు ట్రోఫీలు ఇచ్చే సాంప్రదాయం గ్రీకు వారి నుంచే మొదలైంది. అథ్లెట్ల మధ్య వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించి బహుమతులిచ్చేవారు. అథ్లెట్ అనే పదం గ్రీకు మాటైన అథ్లాన్ Athlon నుంచి ఏర్పడినదే. 
1599లో ఇంగ్లండులో గుర్రప్పందాలు నిర్వహించి కార్లిస్లే బెల్స్ Carlisle Bells ని కానుకగా అందించేవారు. క్రీడా చరిత్రలో అత్యంత పురాతనమైన క్రీడా ట్రోఫీగా దీనిని పరిగణిస్తారు. కార్లిసిల్ లోని టులీ హౌస్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీలో ఈ బెల్స్ ని భద్రపరిచారు. 
ఇక ఫుట్ బాలుకి సంబంధించి ఇంగ్లండులో స్కాటిష్ ఫుట్ బాల్ అసోసియేషన్ ఛాలెంజ్ కప్ పురాతనమైనదిగా చెప్తారు. ఈ ట్రోఫీ పేరు - స్కాటిష్ కప్ The Scottish Cup Trophy !
విజేతలకిచ్చే ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ 1974లో రూపొందించారు. అంతకుముందు ఫీఫా వరల్డ్ కప్ విజేతలకు 1949నాటి జూల్స్ రిమెట్ ట్రోఫీ ప్రతిరూపాన్ని ఇచ్చేవారు. 
విలువిద్యా పోటీలకు సంబంధించి ఇంగ్లండులోని యార్క్ షైర్ లో 1673 లో  మొట్టమొదటగా ట్రోఫీ ఇవ్వడం ఆరంభమైంది. ఈ ట్రోఫీ పేరు స్కార్టన్ సిల్వర్ యారో ! Scorton silver arrow. 
ఓ నిర్ణీత దూరం నుంచి బ్లాక్ స్పాట్ ని లక్ష్యం చేసుకుని బాణాన్ని సంధించి విజయుడిగా నిలిస్తే అతనిని కెప్టన్ ఆఫ్ ది యారో అనే టైటిల్ తో సమ్మానించేవారు. అదే రెడ్ జోన్ విజేతనైతే లెఫ్టినంట్ ఆఫ్ ది యారో అనే టైటిల్ ఇచ్చేవారు. సిల్వర్ యారో అసలైన ట్రోఫీని లీడ్స్ లోని Royal Armouries Museum లో భద్రపరచి దాని ప్రతిరూపాన్ని విజేతలకు ఇస్తున్నారు.
ఇక గోల్ఫ్ క్రీడకు సంబంధించి రాయల్ మసల్బర్గ్ గోల్ఫ్ క్లబ్ 1774లో ఇచ్చిన ట్రోఫీ పురితనమైన ట్రోఫీగా నమోదైంది. గోల్ఫ్ క్లబ్ కి ఈ ట్రోఫీ ఇచ్చింది థామస్ మెక్మిలన్.
మన భారత దేశంలో అతి పురాతనమైన ట్రోఫీ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో ప్రదానం చేయడమే. దురంద్ ఫుట్ బాల్ టోర్నమెంట్ 
విజేతలకు ఇచ్చే ట్రోఫీ పేరు దురంద్ కప్. షిమ్లాలో 1888లో ఈ పోటీలు మొదటిసారిగా జరిగాయి. ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో దురంద్ ఫుట్ బాల్ టోర్నమెంట్ సొసైటీ ఈ పోటీలు జరిగాయి. ఆసియాలో అతి ప్రాచీనమైన ఫుట్ బాల్ టోర్నమెంటుగా దీనిని పేర్కొంటారు. ప్రపంచంలో మూడవ పురాతన టోర్నమెంటుగా నమోదైంది. ఈస్ట్ బెంగాల్ క్లబ్, మోహన్ బగాన్ జట్లే ఎక్కువ సార్లు ఈ ట్రోఫీని గెల్చుకున్నాయి.
క్రికెట్ క్రీడకు సంబంధించి మన దేశవాళీ పోటీలలో పురాతనమైంది రంజీ ట్రోఫీ. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో తొలి రంజీ ట్రోఫీ పోటీలు 1934 జూలైలో నిర్వహించారు. ఆ తర్వాతే ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటివి మొదలయ్యాయి. 
ఆసియా కప్ క్రికెట్ పోటీలు షార్జా వేదికగా 1984లో మొదటిసారిగా జరిగాయి. ఆసియాలో క్రికెట్‌ క్రీడను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికిగాను 1983లో ఏర్పాటైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. పదిహేనవసారి కూడా దుబాయ్ ఆతిథ్యంలోనే ఈ పోటీలు జరిగాయి. మొదటి పద్నాలుగు సార్లు నిర్వహించిన ఆసియా కప్ లో భారత జట్టు 
అత్యధికంగా ఏడు సార్లు ఈ ట్రోఫీని గెల్చుకుంది. అయితే ఈసారి సూపర్ - 4 దశతోనే తప్పుకుంది మన రోహిత్ సేన. అయితే అత్యధికసార్లు ఈ కప్ ని గెల్చుకున్న జట్టు టీమ్ ఇండియానే.  మరోవైపు ఈ ఆసియా కప్ చరిత్రలో ఒక్కసారికూడా మిస్సవకుండా ఆడిన జట్టు శ్రీలంక. ఆరుసార్లు విజేతగా నిలిచి ఈ ట్రోఫీని సొంతం చేసుకుంది శ్రీలంక. 
అత్యంత జనాదరణ పొందిన వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు 1975 నుంచి మొదలయ్యాయి. ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రప్రథమ ప్రపంచ కప్ ఛాంపియన్ షిప్ లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. మన భారతదేశం తొలిసారిగా కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో ప్రపంచ కప్ ని కైవసం చేసుకుంది. 
ఇలా ఒక్కో క్రీడలోనూ ప్రతిష్టాత్మక ఛాంపియన్ షిప్ నిర్వహించి ట్రోఫీలివ్వడం జరుగుతోంది. 


కామెంట్‌లు