స్నేహ బంధం;- సి.హెచ్.ప్రతాప్

 ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ వుండేది.దొరికిన జంతువు నల్లా చంపి తింటూ ఆకలి తీర్చుకొని తర్వాత తన గుహలో హాయిగా గుర్రు పెట్టి నిద్రపోయేది. ఒకరోజు ఆ సింహం దాహం వేయగా నీళ్ళు తాగి దాహం తీర్చుకోవడానికి ఒక చెరువు వద్దకు వెళ్ళింది. వర్షాకాలం కావడాన్న దాని కాలు జారి పడి చెరువు గట్టున వున్న బురదలో కూరుకుపోయింది. అందులో నుండి బయట పడేందుకు తన సర్వ శక్తులూ ఒడ్డి ప్రయత్నించింది కాని బయటపడలేక పోయింది.ఫలితంగా రెండు రోజుల పాటు తిండి, నిద్రాహారాలు లేక అక్కడే నీరసంతో పడిపోయింది. ఒకరోజు ఆ చెరువులో నీళ్ళు త్రాగుదామని వచ్చిన ఒక నక్క సింహం పరిస్థితి చూసి జాలిపడి తన కాళ్ళతో ఆ బురద నంతటినీ పక్కకి తోసేసింది. అంతటితో బ్రతుకు జీవుడా అని బయటపడిన సింహం నక్క కు కృతజ్ఞతలు చెప్పి తన గుహ దగ్గరే వుండమని, తాను సంపాదించిన ఆహారం లో ప్రతీ రోజు కొంత భాగం ఇస్తానని వాగ్దానం చేసింది.అందుకు సంతోషించిన నక్క ఆ గుహకు దగ్గరలోనే ఉండసాగింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని సంవత్సరాలలో వారి కుటుంబం పిల్లా పాపలతో పెరిగి హాయిగా వుండసాగాయి.
కొంతకాలం తర్వాత ఆడ సింహానికి తన భర్త, మగ నక్క మధ్య వున్న స్నేహానికి అసూయ చెందింది. దానికి తన భర్తను మగ నక్క రక్షించిన విషయం తెలియదు. తన కంటె తన భర్త ఆ నక్కతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం దానికే మాత్రం నచ్చలేదు. దానితో తన పిల్లలతో నక్క స్వభావం మంచిది కాదు కాబట్టి వాటికి దూరంగా ఉండాలని నూరిపోయసాగింది. ఆ పిల్ల సింహం పిల్ల నక్కలతో కలిసి తమ తల్లి పాడిన పాటనే పాడసాగాయి.నక్క పిల్లలు వెళ్ళి ఈ మాటలు తల్లి నక్కకు చెప్పాయి. ఆ మాటలు విన్న తల్లి నక్కకు ఎంతో కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి మగ నక్కకు ఈ విషయాలనీ చెప్పింది. అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఏర్పడింది. ప్రతీరోజు వాదులు కోవడం, కొట్టుకోవడం చేయసాగాయి. మగ నక్క సింహం వద్దకు వెళ్ళి తమ రెండు కుటుంబాల మధ్య రగులుతున్న చిచ్చు గురించి చెప్పి, మనసులు కలవని చోట కలిసి ఉండడం మంచిది కాదు కాబట్టి మంచిగా విడిపోదామని చెప్పింది. కొంత సేపు చర్చించుకున్నాక రెండు కుటుంబాలు విడివిడిగా ఉండడం మొదలుపెట్టాయి. మన మధ్య ఎంత గాఢమైన స్నేహం వుండు కాక, కాని మన కుటుంబ సభ్యులకు మన స్నేహం ఆమోదయోగ్యం అవ్వాలన్న రూలేం లేదు. కలహించుకుంటూ కలిసి బ్రతకడం కంటే విడివిడిగా బ్రతికితే కనీసం స్నేహబంధమైనా నిలుస్తుందని అవి అనుకున్నాయి.కాబట్టి విడివిడిగా వుంటూనే మనం మన స్నేహం కొనసాగించవచ్చని అవి రెండూ తీర్మానించుకున్నాయి.

కామెంట్‌లు