దేవుడ్ని చూడాలంటే;-- జయా
 అందరికీ తెలిసే ఉంటుంది. అయినా మంచి విషయాన్ని మరొక్కసారి చెప్పుకోవడం తప్పుకాదేమో....
ఓరోజు రామకృష్ణ పరమహంస వద్దకు  ఒకడొచ్చాడు.
"అయ్యా! మీరు దేవుడ్ని చూసేరా?" అని అడిగాడతను. 
"చూసానుగా" అన్నారు పరమహంస. 
"అయితే నాకు చూపించండి" అడిగాడు ఆ వ్యక్తి.
అప్పుడు అక్కడున్న వాళ్ళు పరమహంస ఏం చెప్తారాని ఎదురు చూస్తున్నారు.
పరమహంస ఆ వ్యక్తితో "మీరేం చేస్తున్నారు? అడిగారు.
"నేను డాక్టర్ని" అన్నాడా వ్యక్తి.
"అలాగా...అయితే నన్నూ డాక్టర్ని చేయండి" అన్నారు పరమహంస.
అప్పుడా మనిషి "డాక్టర్ అవాలంటే మాటలనుకున్నారా? అందుకు చాలా చదవాలి" అన్నారు.
అంతట పరమహంస "డాక్టర్ అవాలంటేనే అదేదో చదవాలంటున్నారు. అలాంటిది దేవుడ్ని చూడాలనుకుంటే దానికంటూ ఓ చదువుండదా? నేను చదివిన ఆ చదువుని కావాలంటే మీకు చెప్తాను" అన్నారు.
పరమహంస మాటతో ఆ మనిషి ఇంకేమీ మాట్లాడక మౌనంగా వెళ్ళిపోయారు.

కామెంట్‌లు