హృదయ విదారకం(కరోనా కష్టాలు);-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నేను చదివా నేను చదివా
కరోనా తెచ్చిన కడుకష్టాలను
బరువులభారంతో బహుదూర పాదనడకలను
చిధ్రమైన చాలా జీవితగాధలను
నేను చదివా నేను చదివా

నేను చూచా నేను చూచా
పనులు లేక
పైసలు లేక
పస్తులున్న పలువురుని
నేను చూచా నేను చూచా

నేను విన్నా నేను విన్నా
ఆకలి కేకలను
అడుక్కొనేవారి ఆర్తానాదాలను
అలమటించేవారి బ్రతిమలాటలను
నేను విన్నా నేను విన్నా

నేను వ్రాశా నేను వ్రాశా
బీదల పాట్లను
బడుగుల బాధలను
బోరు విలాపాలను
నేను వ్రాశా నేను వ్రాశా

నాకు తెలుసు నాకు తెలుసు
బండరాళ్ళు కరుగవని
ఎడారిలో మొక్కలు మొలవవని
క్రూరమృగాలు కరుణించవని
నాకు తెలుసు నాకు తెలుసు

తలచుకుంటే నాఒళ్ళు కంపిస్తుంది
నాకళ్ళు చెమ్మగిల్లుతున్నాయి
నానోరు తడబడుతుంది
నాకాళ్ళుచేతులు కదలకున్నాయి 
నామనసు దుఃఖిస్తుంది


కామెంట్‌లు