మనకీర్తి శిఖరాలు ;- గోపాలస్వామి దొరస్వామి నాయుడు .- డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
 గోపాలస్వామి దొరస్వామి నాయుడు . ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,, నిరంతర అన్వేషకుడు. దక్షిణ భారతములో పారిశ్రామిక విప్లవానికి కారణభూతుడై భారతదేశపు ఎడిసన్ అని కూడా పిలువబడ్డాడు. మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈతడు భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేశాడు.
1893 మార్చి 23వ తేదీన కోయంబత్తూరు దగ్గరలోని కలంగల్ అనే గ్రామములో కమ్మ నాయుడు కుటుంబములో జన్మించాడు. 1920లో ఒక చిన్న మోటారు వాహనాన్ని కొనుగోలు చేసి పొల్లాచి, పళనిల మధ్య నడిపాడు. అతిత్వరలో యునైటెడ్ మోటార్ సర్వీస్ (UMS) సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా 1937లో భారత దేశపు మొదటి మోటారు వాహనాన్ని తయారు చేశాడు.
నాయుడు కనుగొన్న, తయారు చేసిన విలక్షణమైన పరికరాలు:
తొలి విద్యుత్ రేజర్
బహు పదునైన బ్లేడు.
దూరము సరిచేసే కెమేరా భాగము
పండ్ల రసము తీయు పరికరము
ఎన్నికల యంత్రం
కిరోసిన్ తో నడిచే ఫ్యాను (పంఖా)
ఐదు వాల్వులు గల రేడియో (డెబ్బయి రూపాయలు)
రెండు సీట్ల మోటారు కారు (రెండు వేల రూపాయలు) - 1952
స్వంతగా మార్పులు చేర్పులు చేసిన కెమేరాతో నాయుడు అడాల్ఫ్ హిట్లరును, లండనులో జార్జి రాజు అంత్యక్రియలను (1936), గాంధీ, నెహ్రు, సుభాష్ బోస్ మున్నగు నాయకులను ఫొటోలు తీశాడు. నాయుడు తయారు చేసిన పరికరాలు, పనిముట్లు, కోయంబత్తూరులోని 'జి.డి. నాయుడు ప్రదర్శనశాల' లో ఉన్నాయి.
1944లో పారిశ్రామిక వ్యాపకాలకు స్వస్తి చెప్పి నాయుడు సంఘసేవకు, బడుగు ప్రజల సేవకు అంకితమయ్యాడు. పేద విద్యార్ఠులకు పలు ఉపకారవేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు, కళాశాలకు దానధర్మాలు చేశాడు. 1945లో కోయంబత్తూరులో తొలి ఇంజనీరింగ్ కళాశాలకు నాంది పలికాడు. ఆర్థర్ హోప్ పాలిటెక్నిక్, ఆర్థర్ హోప్ ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించాడు. తదుపరి రెండు సంస్థలనూ ప్రభుత్వ ఆధ్వర్యమునకు ఇచ్చివేశాడు. 1967లో "జి. డి. నాయుడు పారిశ్రామిక ప్రదర్శన" ప్రారంభించాడు. ఇది ప్రతి సంవత్సరము సందర్శకులను విశేషముగా ఆకర్షిస్తుంది.

కామెంట్‌లు