తీపి రోగం;-డాక్టర్ కందేపి రాణీ ప్రసాద్
ఒక్కసారి ఒంట్లో కి చేరిందంటే
కిరాయి కట్టదు, ఖాళీ చేయదు
ఊరకుండదు,ఊరుకొనియ్యధు
జీవితాంతం వదిలి పెట్టదు!

పక్కలో పడుకున్న పాములా
ఎప్పుడు కాటేస్తుందో తెలియదు
ముళ్ల కంపకు చుట్టుకున్న బట్టలా
ఎక్కడ చిరుగుతుందో తెలీదు.!

ఖాళీ స్థలం కనబడితే
కబ్జా చెసే పొలిటీషియన్ లా
కనిపించిన అవయవాలపై
కాలు దువ్వి అటాక్ చేస్తుంది!

గుండె గూబ పగలగొట్టి
కిడ్నీల కీళ్లు విరగ్గొట్టి
మెదడు మాడు మీద తన్ని
కాలేయాన్ని కాలితో తొక్కి

ఊపిరితిత్తులను గోళ్ళతో గిచ్చి
ఊపిరి ఆడకుండా ఉరేస్తుంది
శరీర మంతా తిమ్మిరెక్కించి 
సూదులతో తూట్లు పొడుస్తోంది!

దుక్క లాంటి మనిషిని
దూది పింజలా మారుస్తుంది
ఎదురరాయి కొట్టుకున్నా
ఏడేళ్లు మానక ఏదిపిస్తుంది!

ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసే క్లోమం
గ్లూకోజు ను నియంత్రించే ధామం
మారిన జీవన శైలితో పాడైన క్లోమం
ఇంటింటికీ తీపి రోగులే పాపం!

పండుగ అయినా, వెడుకైనా
నోరు తీపి చేసుకోలేని పరిస్థితి
పెళ్లి కెళ్లినా,పార్టీ కెళ్ళినా
ఐస్ క్రీం తినలేని అసహాయ స్థితి!

కామెంట్‌లు