యధార్ధం! అచ్యుతుని రాజ్యశ్రీ

 బాల చాలా రోజులబట్టి బడికి రావటంలేదు.అందుకే కారణం తెలుసుకోవాలని టీచర్ బాల ఇంటికి వెళ్లింది.ఆమె తల్లి సూటిగా టీచర్ తో ఇలా అంది" అమ్మా! మీరు ఫ్రీగా సదువు సెప్తుండారు.బువ్వ పెడుతుండారు.అంతా బాగుండాది.కానీ నామగడు మంచాన పడిండు.నేనొక్కదాన్నే అన్ని పన్లు సేస్తుంటే  నాపెయ్య ఖాయలా పడ్తది.మూడు పొట్టలు నిండాల! ఆకార్ఖానాలో  పనితో నామగడికి దగ్గు దమ్ము! నేను నాలుగిళ్లలో పాచిపనిచేస్తే ఓరెండువేలు వస్తాయి. నాబిడ్డ సదూకోవాలంటే ఇప్పుడు  తొమ్మిదో కలాసు! ముందు కడుపు నిండితేనే కదా సదువుకోవాలనే ఉషారు వస్తాది.మందుగోలీలు మింగితేనే నేను పనికి ఎల్లగలను.బాలను ఓటీచరమ్మ కాడ పనికి పెట్టిన! ఆమె రిటైరయ్యిన పెద్దమ్మ! బాలకి పదోకలాసు పుస్తకాలు సదువు సెప్తాంది.నాబిడ్డకి మూడు వేలిస్తాది.చాయ్ టిపిను బువ్వ అంతా ఆయమ్మకాడనే! ఇస్కూలు ఐతే పొద్దుగాల తొమ్మిది నుంచి నాల్గుదాకా ఆడనే ఉంటాది.ఐనా దాని దిమాగ్ అంతా దాని అయ్యమీదనే!"అమ్మా!నేనూ పైసలు జమచేస్త! ప్రైవేట్ గా సదూకుంటా! అయ్య ఖాయిలా పడిండు.నీవు మిషన్ లెక్క పనిసేస్తే నీకు ఏమైనా ఐతే నాకెవలు దిక్కు?బడిలో కూకున్నా నాకు ఇదే ఆలోశన!" అంది ఏడ్సుకుంటా నాబాలమ్మ!" ఆమె మాటల్లోని  చేదునిజం గ్రహించింది టీచర్!"సరే నమ్మా! బాలకి ఏమైనా అవసరం పడితే నాదగ్గరకు పంపు!" అని టీచర్ ఇంటిదారి పట్టింది.ఆమెకు ఓకధగుర్తు కొచ్చింది. అదేమంటే.. ఓకోడిపెట్ట తనపిల్లల్తో గింజలకోసం వెతుకుతా ఉంది అక్కడ ఇక్కడ పురుగుపుట్ర గింజలు ఏరుతుంటే పిల్లలు కూడా అమ్మ చుట్టూ తిరుగుతున్నాయి. దూరంగా ఉన్న ఓషాపువాడు  పావురాలకి గింజలు చల్లుతున్నాడు. కోడి ఆలోచిస్తోంది "హు! ఏంమనుషులు! తనని తన పిల్లలని ఎప్పుడు కూరొండుకుని తిందామా అని చూస్తారు. తనుపెట్టే గుడ్లకోసం తెగ తాపత్రయపడడం చూస్తోంది. ఇలా ఆలోచిస్తున్న కోడికి పిచ్చిముత్యాల దండ రోడ్డుపై కన్పడింది! తల్లి కోడి గబగబా పరుగెత్తి ముక్కుతో పొడిచి అవి గింజలు కావు అని తెలుసుకుని నిరాశచెందింది!ఎంత విలువైన వస్తువైనా నోట్లో వేసుకుని  కడుపునింపుకోటానికి  పనికి రాకుంటే వ్యర్థం కదా!? ఆలాజిక్  ఇప్పుడు టీచర్ కి అర్ధం ఐంది. బాలతల్లి మాటల్లో పచ్చినిజం నిలదీస్తోంది🌹.
కామెంట్‌లు