చలపతి జబ్బు;-డి.కె.చదువులబాబు..

 చలపతికి రెండు రోజులనుండి ఆరోగ్యం సరిగాలేదు.భోజనం చేయడం లేదు. నిద్రపోవడం లేదు. భార్య జానకమ్మ కారణం అడిగింది.
"గుండెల్లో బాధగా ఉంది. కాళ్ళూ, చేతులు లాగుతున్నాయి.నీరసంగా ఉంది." అని చెప్పాడు.
ఊరిలోని వైద్యుడి దగ్గరకు భర్తను తీసుకెళ్లింది.అనారోగ్య వివరాలు చెప్పింది. వైద్యుడు పరీక్షించాడు. పెద్దగా అనారోగ్య సూచన కనిపించలేదన్నాడు. మాత్రలు ఇచ్చాడు.నాలుగు రోజులు వాడమన్నాడు. మాత్రలు వేసుకున్నాడు. మార్పురాలేదు.కలత నిద్రలో కలవరిస్తున్నాడు.నిద్రపట్టక ఉలిక్కిపడి లేస్తున్నాడు.
ఈసారి పట్నంలోని పెద్ద వైద్యుడి వద్దకు భర్తను తీసుకెళ్లింది. ఆయన రోగలక్షణాలు అడిగి తెలుసుకున్నాడు. మందులిచ్చి వారంరోజులు వాడమన్నాడు. ఆమందులకూ మార్పు రాలేదు. ఆమె తన అన్న మాధవుడికి కబురు పెట్టింది. మాధవుడు రెక్కలు కట్టుకుని వాలాడు. చలపతిని తన ఊరిపక్కన ఆశ్రమంలో ఉన్న దయానందుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆయన ఘనవైద్యుడు. సమస్య విన్నాడు. మందులు వాడినా తగ్గలేదని తెలుసుకున్నాడు.
"నీకు ప్రతిరోజూ ఎక్కువగా ఎవరు గుర్తుకొస్తుంటారు?"అడిగాడు దయానందుడు. 
"పక్కింటి రాఘవయ్య, ఎదురింటి శివయ్య గుర్తుకొస్తుంటారు."చెప్పాడు చలపతి. "ఈఅనారోగ్యం రావడానికి ముందురోజుల్లో ఎక్కడకెళ్లావు?"అని అడిగాడు.
"పక్కింటి రాఘవయ్యగారికి ఈఏడు పంట బాగా పండింది. అందుకుగాను ఇరుగు పొరుగు వారికి, పేదలకూ విందుభోజనం ఏర్పాటు చేశాడు. మేము ఇద్దరం వెళ్లాము.అలాగే మరుసటిరోజు ఎదురింటి శివయ్య తనకొడుకుకు మంచి కొలువు దొరికిందని ఘనంగా విందుభోజనం ఏర్పాటుచేస్తే వెళ్లాను" చెప్పాడు చలపతి. "మరి నువ్వు కూడా పేదలకు, ఇరుగు పొరుగు వారికి భోజనం పెట్టవచ్చు కదా!" అన్నాడు దయానందుడు.
 "నాకు వాళ్లలాగా పంటలు విరగకాయలేదు. కొలువులు రాలేదు కదా !నేనెందుకుభోజనాలు పెట్టాలి?" ముఖం మాడ్చుకుంటూ అన్నాడు చలపతి.
"నువ్వు నీ ఇరుగు పొరుగు అభివృద్దిని చూసి ఓర్వలేకున్నావు. ఈర్ష్యతో, నీకడుపు మండుతోంది. అసూయతో నిద్రపట్టడం లేదు. అన్నం తినాలనిపించడం లేదు.గుండెల్లో మంటగా ఉంది. నిరంతరం ఈర్షాద్వేషాలతో రగిలిపోతున్నావు.
నీరోగానికి కారణం ఇదే. మనసు ఈర్ష్యాద్వేషాలతో మధనపడుతుంటే ఆప్రభావం శరీరంపైకూడా ఉంటుంది. మంచి పంట పండటానికి వ్యవసాయంలోనూ, మంచి కొలువు రావడానికి చదువులోనూ ఏమెలుకువలు పాటించాలో అడిగి తెలుసుకో! భవిష్యత్తులో నీవూ అభివృద్దిలోకి వస్తావు.  ఈర్ష్యాద్వేషాలు చెదపురుగుల్లాంటివి.చెదపురుగులు పుస్తకాలను,చెక్కను ఎలా నాశనం చేస్తాయో అలాగే ఈర్ష్యాద్వేషాలు మనిషిని నాశనం చేస్తాయి. నిరంతరం మంచిమనసుతో ప్రశాంతంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉంటారు. ఈవిషయం నీపిల్లలకు కూడా తెలియజేయి." అని వివరించాడు దయానందుడు.
"స్వామీ!నాకు ఏమందులూ అవసరంలేదు.జ్ఞానోదయమయింది."అనిఆయనకు నమస్కరించి ఇంటి దారి పట్టాడు చలపతి.

కామెంట్‌లు