*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ద్వితీయ (సతీ) ఖండము-(0166)*
 బ్రహ్మ, నారద సంవాదంలో.....
*విష్ణుమూర్తి క్షువునకు సహాయపడుట - దధీచి శాపము - మృత్యుంజయ మంత్ర అనుష్టానము - దధీచి అవ్యధుడు అగుట - క్షువునకు ఊరట కలిగించుట*
*శుక్రాచార్యుడు, దధీచి కి "మహామృత్యుంజయ" మంత్రమును ఇచ్చుట*
*మహా మంత్రము యొక్క ప్రథమ చరణము - "త్ర్యంబకం యజామహే" - మనము భగవంతుడు అగు త్ర్యంబకుని ఆరాధన చేద్దాము. త్ర్యంబకుడు - మూడు లోకములకు తండ్రి, శివుడు. సూర్య, చంద్ర, అగ్ని అనే మూడు మండలములకు తండ్రి. సత్వరజస్తమో గుణములకు మహేశ్వరుడు. ఆత్మతత్వము, విద్యాతత్వము, శివతత్వములకు, ఆహవనీయము, గార్హపత్యము, దక్షిణాగ్ని అనే మూడు అగ్నులకు, భూమి, నీరు, తేజస్సు అనే మూడు భూతములకు, స్వర్గం యొక్క మూడు భుజములకు, త్రిధాభూత సమస్తానికి బ్రహ్మ, విష్ణు, శివుడు అనే మూడు రూపములలో ఈశ్వరుడే మహాదేవుడు అవుతాడు.*
*మహా మంత్రము యొక్క రెండవ చరణము - "సుగంధిం పుష్టి వర్ధనమ్" - పూవులలో మంచి వాసన ఇచ్చే గంధము ఎలా వుంటుందో అలాగే భగవంతుడు అయిన శివుడు, అన్ని భూతములలో, గుణములలో, పనులలో, ఇంద్రియాలలో, మిగిలిన దేవీ దేవతలు అందరిలో, దేవ గణములలో కూడా ఆత్మ రూపములో వ్యాపించి వున్నాడు. ఇలా సర్వాంతర్యామి అయిన పురుషుడు శివుడు కనుక, ఆతని చేతే ప్రకృతి పోషింప బడుతుంది. మహత్తత్వము నుండి అన్ని కల్పముల పుష్టి జరుగుతుంది. బ్రహ్మకు, విష్ణదేవునకు, మునులు అందరికీ, రుషులకు, ఇంద్రియాలతో వున్న దేవతల పోషణ కూడా అన్నిటా వ్యాపించి వున్న ఆ మహేశ్వరుడే చేస్తున్నాడు. అందువల్లనే ఆ మహా స్వామి "పుష్టి వర్ధనుడు" అయ్యాడు.
*మహా మంత్రము యొక్క మూడవ, నాల్గవ చరణములు - " ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్" - పండిన దోసకాయ, దోస తీగ నుండి ఎలా వేరు పడుతుందో, అలాగే మహేశ్వరుని భక్తిలో పండిన వారు మృత్యువు నుండి వేరుపడతారు. కానీ మోక్ష మార్గానికి దగ్గరగా వెళతారు. రుద్రదేవుడు అమృత స్వరూపుడు. పుణ్యకర్మ చేసి గానీ, తపస్సు చేసి గానీ, స్వాధ్యాయము వలన గానీ, యోగము చేత గానీ, ధ్యానము చేసి గానీ పరాత్పరుని ఆరాధించిన వారికి శివుడు స్వయముగా మృత్యు బంధనము నుండి వేరు చేస్తాడు. ఖర్జూరము పండిన తరువాత తీగ నుండి విడిపోతుంది. మహాశివుని ధ్యానములో వున్నవారు కూడా మృత్యువు నుండి విడి పోతాడు కానీ, మోక్షము నుండి కాదు.*
*"త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనమ్"*
*"ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్"*
*దధీచి మహర్షీ, ఉత్తమమైన ఈ మహామృత్యుంజయ మంత్రమును నిష్టతో, నియమముతో జపించుచూ, తరువాత, జపము, హవనము చేస్తూ, ఈ మంత్రముతో అభిమంత్రించిన నీటిని మూడపూటలా తీసుకుని, ఆ స్వామి దగ్గరగా వుండి ధ్యానము చేస్తూ వుంటే మృత్యువు నీ దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంది. న్యాసము మొదలైన పద్ధతులలో విధి సహితముగా శివభగవానుని పూజించు. తరువాత, శాంత చిత్తముతో శివ ధ్యానము చేయి. ధ్యానము చేసే విధానము కూడా నీకు వివరిస్తాను.* 
 *ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు