*"దాశరధీ శతకం " - కంచెర్ల గోపన్న - భద్రాచల రామదాసు - 075*
 *: దశావతార వర్ణనము - శ్రీరామావతారము :*
*చంపకమాల:*
*దురమునఁదాటకం దునిమి | ధూర్జటి విల్దునుమాడి సీతనుం*
*బరిణయమంది తండ్రి పను | పన్ ఘనకాననభూమి కేఁగి దు*
*స్తరపటుచండ కాండకులి | శాహతి రావణకుంభకర్ణ భూ*
*ధరముగూల్చితీవె కద | దాశరధీ ! కరుణాపయోనిధీ !* 
తా: దశరధ పుత్రా! కరుణా సముద్రా! దశరధరామా!   
యుద్ధంలో తాటకిని చంపి, మహేశ్వరుని విల్లు విరిచి, సీతాదేవిని పెండ్లాడి, తండ్రి చెప్పాడని భయంకరమైన అరణ్యవాసం చేసి, ఇంద్రుని వజ్రాయుధం తో సమానమైన బాణములతో కొండలవంటి కుంభకర్ణుని, రావణుని యుద్ధంలో సంహరించినది, రామభద్రుడవైన నీవే కదా!.....అని భద్రాచల రామదాసుగా పేరుగాంచిన కంచెర్ల గోపన్న కీర్తిస్తున్నారు.
*భావం:*
*మానవ జన్మ ఎత్తిన ప్రతీ జీవి ఆచరించవలసిన ధర్మ సూత్రాలను అతి తేలికగా మా మానవులు తెలుసుకోడానికి రామచంద్రుడు అనే మానవునిగా అవతారం ధరించి ఆచరించి చూపావు కదా, పన్నగభూషణా! రాజు తన ప్రజలను ఎలా పాలించాలి, తండ్రి కొడుకుతో ఎలావుండాలి, కొడుకు తండ్రి పట్ల ఎంత విధేయతతో వుండాలి, అన్నతమ్ములు ఒకరి పట్ల ఒకరు ఎంత ఆదరంతో వుండాలి, భార్యా భర్తల నడవడిక ఎలా వుండాలి, అత్తా కోడళ్ళ మధ్య అరమరికలు లేకుండా ఎలా వుండాలి, సేవకుడు రాజు తో ఏవిధంగా మసలు కోవాలి, ఇలా ఒకటేమిటి మానవ జీవితంలోని అన్ని పార్శ్వాలను ఆచరించి చూపిన నిలువెత్తు ధర్మ మూర్తివి నీవు రామభద్రా! అందుకే "రామాయణం" అంటే "రాముడు నడిచిన దారి" అని అంటారు. రాముడు నడచన రోడ్డు కాదు. సకల గుణాభి రాముడైన రాముడు తన జీవితాన్ని ఎంత ఆదర్శవంతంగా మనకు చూపించాడో ఆ దారిలో మనం కూడా మన బ్రతుకుల్ని సఫలం చేసుకోవాలని, అటువంటి సదవకాశాన్ని పరమేశ్వరుడు మనకు కల్పించాలని ప్రార్థిస్తూ .......*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ

Nagarajakumar.mvss

కామెంట్‌లు