వింత తోట!(2వభాగం) అచ్యుతుని రాజ్యశ్రీ

 దక్షిణ తుఫాను గావుకేకలతో గుహలోకి చొరబడ్డాడు."ఏంటీ!ఆకురాలు కాలంలాగా  దిగబడ్డావు?" అని ఉత్తర తుఫాను అనటంతో చిలికిచిలికి గాలివానగా మారింది. "ఒరేయ్! మీరిలా కాట్లాడుకుంటుంటే ఇద్దర్నీ ఆగోతాంలో వేసి మూతిబిగిస్తా"తల్లి అరుపుతో  ఇద్దరూ  నోరు మూసుకున్నారు."అమ్మా!నేను ఎడారి ప్రాంతంలో తిరిగాను. ఎండమావుల్ని చూసి  జనం నీరు ఉంది అనే భ్రమలో  పరుగులుతీస్తారు.దాహం కోసం తాము ఎక్కివచ్చిన ఒంటెల పొట్టలు చీల్చి అందులోని సంచుల్లో నీటిని  చుక్క చుక్క గా నోట్లో పోసుకోవటం చూశాను. ఇసుక తుఫాను కి నాకళ్లల్లో దుమ్ము పడింది అమ్మా! చిన్న చిన్న ప్రాణులు అన్నీ ఇసుక కుప్పల్లో కూరుకుపోయాయి.ఇంతలో తూర్పు తుఫాను వచ్చాడు "అమ్మా! నేను స్వర్గం లోని తోట లోకి వెళ్లాను. అక్కడి వారంతా మధువు తేనె తాగుతూ ఆనందం తో చిందులేస్తున్నారు.అక్కడ జ్ఞాన సరస్సు ఉంది. ఆనీటిని కడుపు నిండా తాగాను.స్వర్గలోకపు రాకుమారితో కాసేపు ఆడుకున్నాను."అంతే!దేవదత్తుడి కళ్ళలోఆనందం తళుక్కుమంది."తూర్పు తుఫాను! నన్ను స్వర్గపు తోట లోకి తీసుకుని వెళ్లవూ?" "అలాగే!రేపు వెళ్దాము ".
తెల్లారగానే అందరికీ రొట్టెలు వేడి వేడి చాయ్ ఇచ్చింది అవ్వ!తూర్పు తుఫాను  వీపుపై ఎక్కికూచున్నాడు దేవదత్తుడు. ఎత్తయిన కొండలు చిన్న చిన్న చుక్కల్లా కనపడుతున్నాయి.రయ్ రయ్ న సాగుతున్నాడు తూర్పు తుఫాను. దూరం గా కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతులతో కమ్మని సువాసనలు వెదజల్లే స్వర్గపుతోట కన్పించింది. ఒక సొరంగం మార్గం గుండా తోట లోకి ప్రవేశించారు. ఆపక్కనే  నల్లని రాళ్ళతో మెరుస్తూ మృత్యులోయ కూడా ఉంది. అక్కడ ఉన్న నదిలోని నీరు నిర్మలంగా కమ్మని అమృతం లా ఉంది. దాని పై ఉన్న  పూలవంతెన దాటారు ఇద్దరూ! ఓఅందాల రాకుమారి పిట్టలతో ఆడుతోంది.
 చిన్నప్పుడు బామ్మ చెప్పిన  తోట కన్నా ఇది ఎంతో బ్రహ్మాండంగా ఉంది. పక్షుల జంతువుల ఆకారంలో ఎన్నో వింత వృక్షాలు కనపడ్డాయి.మెత్తని ఆకు పచ్చని గడ్డిపై పెద్ద గుండ్రటి గ్లోబ్ లాంటి వస్తువు ఉంది. అది గాజు లాగా మెరుస్తోంది.భూమి అంతా ఎంతోఅందంగా కనపడుతోంది.దాని కున్నమీట నొక్కగానే తన రాజ్యం అమ్మా నాన్న లు కనపడ్డారు.పాపం!కొడుకు కనిపించనందుకు వారు దిగాలుగా ఉన్నారు. "దేవదత్తా! బాధ పడకు.ఇదిగో ఈమీట నొక్కాను.మీ అమ్మా నాన్నలతో మాట్లాడు" అంది రాకుమారి. "అమ్మా నాన్న!నేను  మీ అబ్బాయిని .బామ్మ కథల్లో చెప్పిన స్వర్గపు తోటలో ఉన్నా.రేపు వచ్చేస్తా" అన్న కొడుకు ని చూస్తూ ఆనంద భాష్పాలు రాల్చారు.ఆమర్నాడే రాకుమారి తో తనదేశం చేరిన దేవదత్తుడు తూర్పు తుఫాను ని తన  అంగరక్షకుడిగా నియమించాడు🌹
కామెంట్‌లు