రేడియో మాణిక్యం (4);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం.9492811322.
 నాకన్నా పది సంవత్సరాల ముందు  హైదరాబాద్ లో కొత్తగా ఆకాశవాణి కేంద్రాన్ని నెలకొల్పినప్పుడు  కొత్త కళాకారుల కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో  గాత్ర సంగీతం  ద్వారా అనేక కీర్తనలు ఆంధ్ర ప్రజలకు వినిపించాలన్న కోరికతో  సంగీత పటిమ కొత్త పుంతలు తొక్కించే పద్ధతిలో  ప్రదర్శించాలని  వివిధ పద్ధతులలో కీర్తనను గానం చేయాలన్న కోరికతో  హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రానికి వెళ్ళింది అమ్మ.  గాత్రంతో పాటే వైలిన్, వీణ వాద్యాలను కూడా నేర్చుకుంది. ఆ రెంటిలోనూ తన సత్తా చాటడం కోసం  కేంద్రానికి వెళ్ళింది. పరిస్థితుల ప్రభావం వల్ల సంగీత కళాకారుల అవసరం లేక ఆమె కంఠాన్ని మెచ్చి అనౌన్సర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో  అక్కడ ఆ ఉద్యోగంలో చేరింది. శారద గారు అప్పుడు విజయవాడ  ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్గా చేస్తున్నారు. ఆ తర్వాత ఆమె కూడా హైదరాబాద్ వెళ్లడం  ఇద్దరు కలిసి అనేక కార్యక్రమాలు చేయడం శ్రోతలకు తెలుసు. ఆకాశవాణి కేంద్రం అనగానే ఇది సంగీత సాహిత్య సారస్వత నిలయం అని తెలుస్తోంది. శెమ్మం గుడి శ్రీనివాస్ అయ్యంగార్ నుంచి  మంగళంపల్లి బాలమురళీకృష్ణ,  ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, టి.అర్ మహాలింగం, ఎన్. రమణి   మణి అయ్యర్ (మృదంగము) లాంటి హేమాహేమీలు అందరూ  ఆకాశవాణి కేంద్రాలలో కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నవారే. వారి స్థాయిని బట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలను ఇచ్చి ఆకాశవాణి  వారిని ఆహ్వానిస్తుంది. వారిని మొదట పరిచయం చేసుకునేవారు అనౌన్సర్ లే ఎంతో గౌరవంతో వెళ్లి వారి పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొని ఏ గురుముఖతః వారు విద్యను నేర్చుకున్నారో ఆ వివరాలన్నింటినీ సేకరించి చివరకు సంగీత కచేరి అయిపోయిన తరువాత వారిని ఆప్యాయంగా పంపించేది కూడా అనౌన్సర్ లే  అంత బాధ్యతాయుతమైన ఉద్యోగం అది. శ్రోతలకు ఏ కేంద్ర సంచాలకులు తెలియకపోవచ్చు కానీ  నిత్యం శ్రోతలను ఆనందంలో ముంచెత్తే అనౌన్సర్ లు తెలియకపోవడం ఉండదు. అలా మంచి పేరు సంపాదించుకున్నది అమ్మ. 
దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, సి.నారాయణ రెడ్డి, దాశరథి, మునిమాణిక్యం, స్థానం నరసింహారావు లాంటి హేమాహేమీలైన కవి వరులు అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు, సావిత్రి, జి.వరలక్ష్మి లాంటి నటీ నటులు  అనేక రకాల  మేధావులంతా ఆకాశవాణికి వస్తారు. వారినందరిని  పరిచయ కార్యక్రమాలను ఎక్కువగా అనౌన్సర్లే  చేస్తారు. ఆ చేసేటప్పుడు ఎంతో అణకువగా ఉండాలి.తనకు కావాల్సిన సమాచారాన్ని  రాబట్టాలి. వారిని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేయకూడదు. కొన్ని మాటలు కులం, జాతి లాంటివి ఆకాశవాణిలో వినిపించకూడదు అన్న నియమాలను పాటిస్తూ అసిధారావ్రతంగా ఆ కార్యక్రమాలను చేసే దైర్యం ఒక్క అనౌన్సర్ లకే వుంది అందరిలోకి మేటి మా అమ్మ.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఆమెకు జరిగిన సన్మానాలు మరెవ్వరికీ జరిగి ఉండవు. వాయిస్ ఆఫ్ హైదరాబాద్,  స్వర రత్న అన్న పేరుతో ఆమెను పిలుచుకుంటూ ఉంటారు శ్రోతలు ప్రేమగా. ఆ పరిసర ప్రాంతాలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న అమృతలత సంస్థ వారు జీవిత సాఫల్య బహుమతులిచ్చి ఎంతో గౌరవించారు.... అలాంటివి ఎన్నో... ఎన్నెన్నో....


కామెంట్‌లు