ఎదురు చూపులు...; ప్రమోద్ ఆవంచ---7013272452.

 పండగొచ్చింది పల్లెకు 
వెలుగు తెచ్చింది 
విచ్చుకున్న పువ్వుల విప్పారిన
ఆశలు 
పురి విప్పిన నెమలిలా ఊరు సిగం
ఊగుతుంది.
ఊరి బస్సు నిండు గర్భిణీలా భారంగా
కదులుతుంది.
తప్పిపోయిన లేగ దూడ తల్లి ఒడిలోకి
చేరినట్లుంది.
పండగ కోసం ఎదురు చూస్తూ ఒట్టి పోయిన
అమ్మ కళ్ళు తడిబారాయి.
ఊరు ఆప్యాయతల కరువుకాటకాల్లో
అల్లల్లాడిపోతోంది.
ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు పిల్లాజల్లలతో
ఊపిరి పీల్చుకుంటుంది.
మనుషులు తిరగాడని ఊరికి బూజు
పట్టింది
దుమ్ము దులిపినా కొద్ది జ్ఞాపకాల
కొర పోతుంది.
గుడిసెకు కళ వచ్చింది
జాజి రంగు చీరలో ఊరు బతుకమ్మ
ఆడుతుంది.
పసుపు గౌరమ్మ నట్టింట్లో తిరగాడుతుంది
మామిడాకు తోరణాలతో గుడిసె పచ్చగయ్యింది
వలస బోయిన ఊరు,పట్నం రుచులకు
మరిగింది.
బ్రాండ్ బట్టల మోజులో పడి కన్న ఊరిని
మరిచింది.
మేర అంజయ్య పగిలిన అద్దాలు పెట్టుకొని
చిరిగిన బతుకికి కాజాలు కుడుతున్నాడు.
సూపర్ మార్కెట్ల మోతతో, చిన్న దుకాణాల
సరుకంతా పంది కొక్కుల ఆహారమైంది.
శిధిలమైన శివాలయం తెల్ల సున్నంతో
ముస్తాబైంది.
విభూతి బొట్టుతో పూజారి బాలకోటి ముఖం 
విప్పారింది 
జమ్మి చెట్టు ఆకులు రెపరెపలాడుతున్నాయి.
ఏడాదికి ఒకసారే మమ్ముల్ని పట్టించుకుంటారనీ
కొన్ని ఆకులు మూతి ముడుచుకున్నాయి.
ఊరు ఊరంతా పాలపిట్ట దర్శనానికి నల్లవాగుకి
సాగింది.
కడుపునిండా తిని, తాగి ఊరు మత్తులో మునిగిపోయింది.
తెల్లారింది, మంచు తెరలను తెంచుకుని భానుడి
కిరణాలు నేలను తాకాయి.
పండగ అయిపోయింది 
మెల్ల మెల్లగా ఊరు ఖాళీ అవుతుంది
గుడిసె ఒంటరి అవుతుంది గుడిసెలో 
ముసలోళ్ళ గోస కన్నీటి వీడ్కోలులో
బొట్టు బొట్టుగా రాలుతుంది 
ఊరు బస్సు భారంగా కదిలిపోతుంది....
ఎదురుచూపుల కాలం మళ్ళీ మొదలయ్యింది.
                               
కామెంట్‌లు