క్రొంగొత్త జీవం పోసుకున్న పచ్చని ప్రకృతి
చెరువు కుంటలు నిండు కుండలా కళకళ లాడగా
పుడమికి అర్చన చేసే పూలాభిషేక వైభవం
ప్రకృతితో పులకరించే మానవ అనుబంధం
సీతాకోక చిలుకల గుంపులా మహిళా లోకం
ఉయ్యాల పాటలతో వలయంలా తిరుగుతూ
అందాల ఆనందభరిత అద్భుత మహోత్సవం
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాల సంబరం
పువ్వు లేనిదే పూజ లేదని తలచి
పువ్వులే దేవుళ్ళని కొలిచే పూల పండుగ
ఆడుతూ పాడుతూ అద్భుత నాట్య భంగిమలతో
చిన్న పెద్ద ధనిక పేద అంతరాలు లేని సమాంతర స్వప్నం
పొద్దస్తమానం పనులతో అలసి సొలసి
జాలువారే జానపదుల ఆట పాటల సందడి
ఐక్యత ఆత్మీయత అనురాగాలు రంగరిస్తూ
ఏడాదికోసారి ఎదురు చూసే వనితల వేడుక
చారిత్రక పురాణ కథలకు రంగులద్ది
కష్టసుఖాల జీవిత పాఠాలు వల్లె వేస్తూ
భాషా యాస సుధారస రమ్య గీతాలతో
తమ సంతతి దక్కాలని మొక్కే ఆనవాయితీ
దుర్గాష్టమి సద్దులతో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం
శ్రీదేవి శరన్నవరాత్రుల సుమ శోభిత ఆరాధనా పర్వం
ఊరునేకం చేసిన తెలంగాణ ఉద్యమ గొంతుక!
నాడు నవాబు భూస్వాముల కబంధ హస్తాల్లో
నలిగి సమిధలైన తల్లుల కడుపుకోతలు కోకొల్లలు
పగిలిన గుండె అద్దం నిండా నెత్తుటి ప్రతిబింబాలు
నూటొక్క పూల కోటొక్క వేదనల ఆవిష్కరణ దృశ్యం!
నేడు అడుగడుగు కామం కళ్ళతో విషసర్పాల చూపులు
నైతికతకు శిలువేసి మానవత్వం మంటగల్పే మృగాలు
అబలలపై జరిగే అఘాయిత్యాల నివారణకు
మహిళా విప్లవ శంఖారావం పూరించాలి!
(సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలతో)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి