మంగోలియా కొన్ని కొత్త విషయాలు;-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

 మంగోలియా అనగానే మనకు చంగీజ్ ఖాన్ గుర్తుకు వస్తాడు.మంగోలియా రష్యా చైనా మధ్యన ఉంది.దక్షిణ భాగం గోబీ ఎడారిని ఆనుకుని ఉంది.మంగోలియా దేశం మన దేశంలో సగ భాగం ఉంటుంది.దీని పూర్తి పేరు 'పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ మంగోలియా'.దీని రాజధాని ఉలాన్ బాటర్, అంటే 'ఎర్రనాయకుడు' అని అర్థం! ఇరవయ్యో శతాబ్దం మొదటి భాగంలో ఈ దేశంలో పరిశ్రమలు అభివృద్ధి చెందాయి.మంగోలియాకు చెందిన జూడిర్ డిమిడిల్ గూర్చా  ఈ దేశపు మొట్ట మొదటి వ్యోమగామి.ఇతను రష్యాకు చెందిన'సూయజ్ 39' లో 1981 లో భూమి చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. మంగోలియా దేశంలో పురాతన కాలం నుండి నాగరికత ఎంతో అభివృద్ధి చెందింది.మంగోలియాలో అనేక మంది కవులు అత్యుత్తమమైన ఎన్నో కవితలు వ్రాశారు.వీరి పురాతన శాస్త్రజ్ఞులు అంతరిక్ష శాస్త్రం మీద ఎన్నో పుస్తకాలు వ్రాశారు.
       మచ్చుకు వీరి సాహిత్యం నుండి కొన్ని సామెతలు...'ఒక మంచి పుస్తకం సముద్రమంత మేలు చేస్తుంది,పుస్తకంతో పోలిస్తే సంపద పనికిరాదు!' 'మంచివాడితో స్నేహం వెన్నెల   వంటిది' చెడ్డవాడితో స్నేహం విషపుపాముతో చెలిమి వంటిది' ఇలాంటి మంచి సామెతలు ఎన్నో ఉన్నాయి.ఇక్కడ నిర్భంధ విద్యను అమలు చేస్తున్నారు.ఇక్కడ కూడా ఉన్నత విద్య అభ్యసించడానికి పోటీ పరీక్షలలో పాల్గొనవలసి ఉంటుంది.ప్రభుత్వం మతాన్ని ప్రోత్సహించదు.అయినా బౌద్ధులు,, భౌద్ధ మఠాలు కనబడతాయి!
        ఈ దేశంలో మోలిబ్డినమ్,రాగి గనులు ఉన్నాయి.ఈ దేశంలో ఒంటె పాలనుండి 'కుమిస్' అనే పానీయం తయారు చేస్తారు.కానీ ఇందులో సారాయి పాలు హెచ్చుగా ఉంటుంది.
       ఈ దేశంలో ఎండాకాలం చాలా తక్కువ! రష్యాలోని సైబీరియా ఎడారినుండిఅతి చల్లని గాలులు వీచి ఈ దేశంలోఅతి చల్లని చలికాలం(-43°) ఎక్కువ.
       2020జనాభా లెఖల ప్రకారం ఇక్కడి జనాభా 32.8 లక్షలు. పల్లెల్లో జనం ఎక్కువగా గొర్రెలు, మేకలు,ఒంటెలు మీద ఆధారపడి బతుకుతారు. అందుకే ఈ దేశ మాంసపు ఉత్పత్తి కూడా ఎక్కువ.
       ఈ దేశంలో చదువుకు చాలా విలువ ఇస్తారు.పిల్లలను గ్రంథాలయాలకు పంపి చదివించి వారు చదివిన విషయాలు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చెప్పాల్సి ఉంటుంది. జాంబీ డాష్డాన్ డాగ్ అనే బాల సాహిత్య రచయిత అప్పుడప్పుడూ తాను రాసిన పుస్తకాలను ఒంటె మీద పెట్టుకుని తిరుగుతూ పిల్లల చేత  చదివిస్తుంటాడు!
       మంగోలియా లో జీవవైవిధ్యం కూడా ఎక్కువే! రకరకాల చేపలు,పక్షులు,సైబీరియన్ ఇన్బెక్స్ అనే పొట్టేలు,సైబీరియన్ మంచు చిరుత,వైల్డ్ బాక్ట్రియన్ ఒంటె వంటి జంతువులను ఇక్కడ చూడవచ్చు.
ఈ దేశం ప్రకృతి దృశ్యాలకు నిలయం కూడా!
      ఇన్ని విశేషాలు ఉన్న ఈ దేశంలో ప్రజలు చాలా మంచివారని అక్కడికి వెళ్ళి వచ్చిన వారు చెబుతుంటారు.
               *******       *******

కామెంట్‌లు