సంశయ స్వభావం- సి.హెచ్.ప్రతాప్ -సెల్ ; : 95508 51075

 మహరాష్ట్ర లో  డి.ఏం. ముల్కీ అనువాడు చిన్నప్పటి నుండి నాస్తిక భావాలను అలవరచుకున్నాడు. దేవుళ్లను, వారిని పూజించే ఆస్తికులను తీవ్రం గా విమర్శించేవాడు.ఎల్లవేళలా తన స్వశక్తిని నమ్ముకోవాలిగాని దేవతలను నమ్ముకొని పూజలు చేస్తూ, దేవాలయాల వెంట తిరగడం మూర్ఖత్వం అని వాదించేవాడు. మనిషి అభివృద్ధి  సాధించాలంటే తెలివి తేటలు ప్రధానం కాని, దైవ శక్తి ఎంతమాత్రమూ కాదనేవాడు. అతనిని పరమ నాస్తికుడుగా ముద్ర వేసి అందరూ దూరంగా వుంచారు. ముల్కీ అన్నయ్య మాత్రం ఆస్తికుడు. ఉదయమే లేచి పూజాది కార్యక్రమాలను చేయనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. ఇదిలా వుండగా 1916 వ సంవత్సరం లో ముల్కీకి తీవ్రంగా జబ్బు చేసింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏ మాత్రం నయం కాలేదు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఇక తనకు చావు తప్పదన్న భయం ముల్కీకి కలిగింది. ఒకరోజు రాత్రి కలలో ఒక మహనీయుడు అతనికి కనిపించి నీ పూర్వ జన్మ దుష్కర్మల కారణంగా నీకు ఈ జబ్బు చేసింది. త్రికరణ శుద్ధిగా నమ్మి నా దర్శనానికి వస్తానంటే నీకు ఈ జబ్బు తగ్గుతుంది అని అన్నారు. అసలే ప్రాణభయంతో వణికిపోతున్న ముల్కీ తప్పక వస్తానని వాగ్దానం చేసాడు. వెంటనే ఆ మహనీయుడు అడృశ్యమయ్యారు. కల చెదిరి ముల్కీకి మెలకువ వచ్చింది. నాటి నుండి చిత్రాతి చిత్రంగా అతనికి వ్యాధి తగ్గనారంభించింది. కొద్ది రోజులలోనే అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యాడు. ఇంటిలోని వారందరూ ఎంతో సంతోషించారు. ముల్కీ మాత్రం తన వ్యాధిని తగ్గించింది కలలో కనిపించిన మహనీయుడే నన్న విశ్వాసం ధృఢంగా కలిగి అదే విషయం తన వదిన గారికి చెప్పాడు. ఆమె వెంటనే పూజా మందిరంలో వున్న శ్రీ సాయి ఫొటోను ముల్కీకి చూపించగా తనకు కలలో కనిపించిన మహనీయుడు శ్రీసాయియేనని గుర్తించి ఆనందించాడు. అంతటితో అతనిలో నాస్తిక భావాలు పూర్తిగా అంతరించిపోయి శ్రీ సాయికి భక్తుడయ్యాడు. త్వరలోనే శిరిడీ వెళ్ళి శ్రీ సాయి దర్శనం చేసుకున్నాడు. సాయి దర్శనం తోడనే అతనిలో అధ్యాత్మిక కెరటాలు ఉవెత్తున ఎగిసిపడ్డాయి. సంశయాలన్నీ పటాపంచలు అయ్యాయి. నాటి నుండి నిత్య సాయి స్మరణ, సద్గంధ పారాయణ, సాయి ఆరాధనలతో కాలం గడపసాగాడు.

సి హెచ్ ప్రతాప్ 


ఫ్లాట్ నెంబర్ : 405 ,శ్రీ బాలాజీ డిలైట్స్
రాహుల్ కోలనీ, ఎ ఎస్ రావు నగర్
సాయి సుధీర్ కాలేజీ వద్ద
హైదరాబాద్ 500 062
 

కామెంట్‌లు