శ్రీకాళహస్తీశ్వర దేవాలయం ప్రాశస్థ్యం --సి.హెచ్.ప్రతాప్ ;-సెల్ ; : 95508 51075
 శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది. ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.
శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది.
ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం.
రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.
భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన, పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయు లింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తు కళకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం, చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కళంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు.. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్నా శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయు లింగంగా కొలువైన స్వామి వారి ఉఛ్వాశ నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు.
సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు. కానీ శ్రీ కాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది.


సి హెచ్ ప్రతాప్ 


కామెంట్‌లు