భక్త కన్నప్ప; -న: సి.హెచ్.ప్రతాప్;-సెల్ ; : 95508 51075
 ద్వాపరయుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు. తిన్నడి పుట్టుపూర్వోత్తరాలను, ఆతడు భక్త కన్నప్పగా మారిన వైనము తెలుసుకుందాం.
అర్జునునుడు ఆ జన్మలో శివసాయుజ్యం పొందలేక పోవడాన మరో జన్మ ఎత్తాడు. తిన్నడు బోయ కుటుంబంలో జన్మించినందున రోజూ వేటకు వెళ్ళేవాడు. ఒకరోజు వేటాడటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకింద నిద్రపోయాడు. అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్లు కల వచ్చింది.
తిన్నడు నిద్ర నుండి మేల్కొనగానే ఒక దుప్పి కనిపించింది. తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు. అక్కడ సరిగ్గా తనకు కలలో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది. పుట్టుకతోనే నాస్తిక భావాలు మెండుగా వున్నా, ఆ శివ లింగం చూడగానే అతనిలో నాస్తిక భావాలు అంతరించి, ఆస్తికత్వం ఉదయించింది. ఆ శివ లింగంతో తనకు జన్మ జన్మల బంధం వున్నట్లు అనిపించింది. ఆ లింగంతోనే మట్లాడాలని, దానినే ఒక్క క్షణమైనా మరువక, ఏమరుపాటు లేకుండా చూస్తూ వుండిపోవాలనిపించేది అతనికి.
. ఇక పొద్దస్తమానం శివుని సేవలోనే గడపసాగాడు. ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేస్తాడు. నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేతుల్లో పట్టినన్ని బిల్వపత్రాలు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు. వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు.
అదే దశలో ఆ లయకారుడు తిన్నడి భక్తి శ్రద్ధలను పరీక్షించ దలచాడు. ప్రతి నిత్యంలాగానే కన్నప్ప నైవేద్యం, గంగాజలంతో పూజ చేయడానికి వచ్చాడు. అప్పుడు ఆ శివయ్య తన కంటినుంచి రక్తపు నీరు కార్చడం మొదలు పెట్టాడు. అది గమనించిన తిన్నడు కంటిని తుడవడం ప్రారంభించాడు. ఎన్ని సార్లు తుడిచినా విగ్రహం కంటినుంచి నీరు కారడం ఆగలేదు. ఆ వైపరిత్యాన్ని చూసి భరించలేని తిన్నడు బాణపు మొనతో తన కంటిని తీసి నీరు కారుతున్న కంటికి అమర్చాడు.
 కానీ, అప్పుడు రెండో కంటిలోంచి రక్తం కారడం మొదలైంది.
తిన్నడు మరింత దుఃఖిస్తూ నా ప్రియమైన నేస్తానికి ఎంత దుఖం వచ్చింది అనుకుంటూ శివుడికి రెండో కంటిని పెకిలించి తీసి శివునికి అమర్చబోయాడు.
తిన్నడి అపరిమిత భక్తిప్రపత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. తిన్నడు మరో కన్ను పెకిలించకుండా వారించి, ''భక్తా, నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను.. కన్ను అప్పగించిన నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమౌతావు... సిసలైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు..'' అంటూ శివసాయుజ్యాన్నీ ప్రసాదించాడు.

సి హెచ్ ప్రతాప్ 



కామెంట్‌లు