గుర్తుకొస్తున్నాయి-నాగులచవితి ముచ్చట్లు;- సత్యవాణి
  దీపావళి సంబరాలు ముగిసీ ముగియగానే, నాగులచవితి వస్తుందని సంబరం మాకు.దీపావళినాడు దివిటీలు కొడుతూ, పాడనే పాడేము "దిబ్బూ దిబ్బూ దీపావళి- వెంట వచ్చే నాగులచవితి"అని.
            నాగులచవితంటే ఎందుకంత ఇష్టమంటే, పుట్టలో పాలు పొయ్యాలని కాదు,మా పొట్టలకు పాలు ఇస్తున్న, మా లోబీడు పొలంలోని ఆవులను చూడవచ్చని,వాటి తువ్వాయిలతో ఆడుకోవచ్చని.జామచెట్లెక్కవచ్చని,నారింజలు తెంపవచ్చని,కాలు సాగినంతమేల పరుగులు తీయొచ్చని.
          అమ్మ నాగులచవితి ముందురోజే కుంచాలాదిగా, నువ్వుపప్పు  చిమ్మిలి,బియ్యం చలిమిడి కుమ్మించేది పాలికాపులచేత. చవితినాడు ఉదయాన్నే అమ్మా,పిన్నీ పుట్టలోవేయడానికి వాళ్ళే చిమ్మిలీ ,చలిమిడీ మడిగా చేసుకొనేవారు. 
              చవితినాడుదయాన్నే తలకి స్నానాలు చేసి ,మడిబట్టలు కట్టుకొని ,దేన్నీ ముట్టుకోకుండా కూర్చుటే, "పిల్లల్లారా! జాగ్రత్త సుమీ,నోట్లో ఏమన్నా వేసుకొన్నారుకనుక,పుట్టలో పాలుపోసేదాకా ఏమీ కక్కూర్తి పడకండని "అడుగడుగునా హెచ్చరిస్తూనే వుండేది అమ్మ. కాసేపటికో,కూసేపటికో మరిడయ్యో,అప్పన్నో,దొంగబ్బాయో,రాజులో ఎవరో ఒకరు మైసూరెద్దుల టైర్ బండి తోలుకొచ్చేవారు.
      అమ్మా పిన్నీ ,చలిమిడీ,చిమ్మిలీ, పాలు ,వత్తీ పత్తీ ,అక్షింతలు వైగారా పూజాసామాగ్రి, ,ప్రసాదాలు అన్నిజాగ్రత్తగా సర్దుకొని బండెక్కేవారు.వాళ్ళిద్దరి మడికీ ,మా పిల్లల మడిమీద నమ్మకముండేదికాదు.అందుకని వాళ్ళని తగలకుండా "దూరం దూరం "అనేవారు.
           బండి లోబీడులో చేరిందంటే మా సంబరం అంబరాన్నంటేది.బండి మకాంలో ఆగీ ఆగగానే, దూకేసి పరుగులే పరుగులు తీసేవారం పిల్లలందరం
ఆవుదూడలదగ్గరకి.అవి మమ్మల్నిచూసి ,తోకలెత్తుకొని పరుగులు తీస్తుంటే, మేము వాటి వెనకాలపడేవాళ్ళం. అక్కడక్కడా కాలికి ఏపుల్లముక్కో,మట్టిగడ్డో అడొచ్చి బోర్లాపడ్డా, మోకాలికి దెబ్బతగిలినా,అటూ ఇటూ చూసి, గుండెలమీద మూడుసార్లు దబదబా చరుచుకొని,మట్టితీసి  పడిన చోటమట్టితీసి బొట్టెట్టేసుకొని, అక్కడదింత మట్టి తీసిదెబ్బకి రాసేసుకొని, మళ్ళీ దౌడు తీసేవాళ్ళం.
       ఈలోపులో పాలికాపులు పుట్ట వెతికి,దానిచుట్టుపక్కలంతా చక్కగాపారతో చెక్కి శుభ్రంచేసి,పాలు పొయ్యడానికి వీలుగా చేసేవారు.
               అమ్మ పుట్ట చుట్టూ పసుపునీళ్ళుచల్లితే పిన్ని పిండితో ముగ్గు పెట్టేది. అమ్మ తనముందు తరాలవాళ్ళని తలచుకొని, రావయ్యమ్మ కొలిచిన నాగన్నా, బాపనమ్మ కొలిచిన నాగన్నా,బానమ్మ కొలుస్తున్న నాగన్నా, సుందరమ్మ కొలుస్తున్న నాగన్నా,"అంటూ, ఇద్దరూ మంత్రాలు చదువుతూ పూజచేసేసి,పాలు పుట్టలో పోసి, పిసరంత పిసరంత చలిమిడీ,చిమ్మిలీ పుట్టలో వేసేసి,ఆవుపాలుకూడా అమ్మా పిన్ని పుట్టలోపోసొసాకా,అప్పుడు మా పిల్లమూకని పేరు పేరునా పిలిచి పుట్టలో పాలు పోయించి,  చిమ్మీలీ చలిమిడీ వేయించేవారు. నిజానికి మాకు ఆ పుట్టను చూస్తే, భయంతో కూడిన భక్తి  వుండేది.ఎందుకంటే, పుట్టలోంచి పామెక్కడ" బుస్స్" మంటూ పైకెక్కడ వచ్చేస్తుందోనని బిక్కు బిక్చుమంటూ వుండేవాళ్ళం.
       అమ్మ మా అందరిచెేతా ఇలా చెప్పించేది,"నాగేంద్రుడా తండ్రి!పడగ తొక్కితే పసివాళ్ళనుకో .నడుంతొక్కితే ,నావాళ్ళనుకో.తోక తొక్కితే తొలగిపోతండ్రీ! నూకలిస్తాను నీకు -మూకనియ్యి మాకు తండ్రీ!అని మా అందరిచేతా అనిపించేది.అర్థరాత్రీ,,అపరాత్రీ గొడ్డూ గోదా తిరుగుతాయి తండ్రీ !చల్లగాచూడు తండ్రీ!"అని మళ్ళీ వేడుకొనేది.పుట్టమన్ను తీసి చెవితమ్మెలకి రాసుకొని,చెవిపోటు రానీకు తండ్రీ!అంటూ దణ్ణం పెట్టుకొమ్మనేది మమ్మల్ని.ఆతరువాత నాగులపంచె పుట్టమీదకప్పేది.
          అంతా బాగానే వుందికానీ,చిమ్మిలెప్పుడు చేతిలోపడేస్తుందా, అని ఎదురుచూసే ,మా పిల్లల ఎదురు చూపులకు అప్పుడు ఫలితందక్కేది. పాపం మా మణిచెల్లీ ,వల్లి చెల్లీ అమ్మ అనమన్నవి అంటున్నా,వాళ్ళచూపులు మాత్రం చిమ్మిలి బుట్టమీదే వుండేవి.మణికైతే మరీను, నోట్లో నీరూరిపోతుంటే దానికి కంట్రోల్ చేసుకొడానికి మరీ కష్టపడవలసి వచ్చేది."పిల్లల్లారా! ఇంకోపూజా ,ఇంకోపూజా కాదు కాస్తంత కక్కూర్తిపడడానికి.నాగేంద్రుడితో వ్యవహారమిది" అంటూ అమ్మ హెచ్చరించేది. మొత్తానికి దబ్బకాయంతంత చిమ్మిలి ,చలిమిడి ముద్దలు చేతిలో పడేవి మా అందరికీ, అక్కడ వున్న పాలికాపులతోసహా.
           పైరు గాలులను,పాడి ఆవులను, బుజ్జి తువ్వాయిలను వదలలేక వదలలేక బండెక్కేవాళ్ళం పిల్లలం .దారిపొడుగునా ,""కాత్తంత పెసాదమెట్టండి,కూసింత పెసాదమెట్టండి."అని అడిగినవాళ్ళకు ,అడగని వాళ్ళకు
ముందురోజు పాలికాపులచేత కుమ్మించిన చలిమిడి,చిమ్మిలి దబ్బకాయలంతంత ముద్దలు వాళ్ళచేతిలో పడేసేది అమ్మ. అలా తీసుకొన్నవాళ్ళు  పరుగు పరుగున వెళ్ళి,మరింతమందిని బండిదగ్గరకు పంపించేవారు.ప్రసాదం తగ్గిపోతే,
ఐపోయిందనకుండా,నోటితో లేదనేది చేతితో లేదన్నట్లు అందులో అదులోనే అందరికీ సర్దేది అమ్మ.
        ఇంటికి వచ్చాకా అమ్మా,పిన్నీ  ఉపవాసమని ప్రసాదాలు తింటుంటే,వాళ్ళ ఆకులో వున్న చిమ్మిలిని ,చలిమిడినీ చూసి,"హమ్మో!అంతంతే?"అంటూ గుండెలమీద చెయ్యేసుకొనే మాచెల్లాయి వల్లిని చూసి,"ఆకు మూతేసుకో ఓవిడా! పిల్లలకు కనపడకుండా" అని తోడికోడళ్ళిద్దరూ గలగలా నవ్వుకొంటూ,ప్రసాద పారాయణం కానిచ్చేవారు.
  

కామెంట్‌లు