సనాతన సారం!;-- దోర్బల బాలశేఖరశర్మ
 అవును నిజమే, హైందవ మతం నానాటికీ క్షీణిస్తున్నది. ఇష్టంతోనో, అయిష్టంతోనో చాలామంది మతం మారుతున్నారు. మన తాత, ముత్తాతల కాలం నాటి మొన్నటి నమ్మకాలు నిన్న లేవు. నిన్నటి పరిస్థితి ఇవాళ లేదు. ఒకప్పుడు తాతలు చెప్పినట్టు మన తండ్రులు కళ్ళు మూసుకొని (గుడ్డిగానే) విని విశ్వాసాలను, ఆదేశాలను పాటించారు. కానీ, తర్వాత తండ్రులకు ఎదురు తిరిగే కొడుకులు, కూతుళ్ళు వచ్చారు. ఇప్పుడైతే అర్థం చేసుకొని ఆచరించే మనవలు, మనవరాళ్లు కనిపిస్తున్నారు. ఆనాటి వ్యర్థ (అర్థం లేని) ఆచారాలు, సంప్రదాయాలు, పూజలు, పురస్కారాలను నిన్నటి తరం నిక్కచ్చిగా ప్రశ్నించారు. ఊళ్లలో పురోహితుడు చెప్పినట్టు వినే పరిస్థితులు ఇప్పుడు చాలావరకు తగ్గిపోయాయి. అనేక దేవాలయాల్లో అర్చనలు, హారతులు లాంఛనంగా తయారయ్యాయి. భారతదేశంలో గత సుమారు ఏడు దశాబ్దాలుగా పాలకులు అవలంభించిన కుహనా లౌకిక విధానాలు మరోవైపు ప్రత్యేకించి హిందూ మతంపై దాడి చేసినంత పనే చేశాయి. అప్పటి తరం మనుషుల ఆలోచనలకు ఇది ఒక రకంగా ఊతమిస్తూ వచ్చింది.
ఇదంతా ఒకవైపు పార్శ్వం. చాదస్తాలు, అనాచారాలు, మూర్ఖపు విశ్వాసాలకు కాలం చెల్లుతున్నట్టుగానే, అట్టడుగున పేరుకుపోయిన సనాతన తాత్విక సారం మరోవైపు వెలుపలకు వస్తున్నది. అనవసర భయం స్థానంలోకి నిజమైన భక్తి నిర్భయంగా వచ్చి చేరుతున్నది. అసలైన ఆధ్యాత్మికత ఆవిష్కృతం అవుతున్నది. యావత్ ప్రపంచానికి దిక్సూచి వంటి మన అద్వైత సంస్కృతి నాటుకుంటున్నది. సహేతుక శాస్త్రీయత వైపు మనుషులు అడుగులు వేస్తున్నారు. ఈ మరో పార్శ్వంతో హైందవ మతం ఒక రకంగా రాటు తేలుతున్నది. చెత్తంతా ప్రవాహానికి కొట్టుకు పోయాక మిగిలిన స్వచ్ఛమైన నీటి తటాకం వలె పరిస్థితులు మెరుగవుతున్నాయి. ఇక, దీనికి ఇటీవలి భారత కేంద్ర పాలక నాయకత్వంలో వచ్చిన పూర్తి స్థాయి సానుకూల (వ్యతిరిక్త) మార్పు కొత్త తరం ప్రజల ఆలోచనలకు నైతిక బలాన్నిస్తున్నది. 
అవును నిజమే, మహా వృక్షానికి ఒకవైపు దుఃఖం, మరోవైపు సంతోషం. సనాతన భారతీయత (హైందవ మతం)లోని సుగుణాలు, శాస్త్రీయ విధానాలు, సకల మానవాళికి వర్తించే సూత్రాలు.. మొత్తంగా ఒక కొత్త  సూర్యోదయం వైపు భారతీయులను నడిపిస్తున్నాయి.  ఇంతకంటే, కావలసింది ఇంకేముంటుంది?! అయితే, ఏది ఎంత కాలం? గమ్యం ఇంకెంత దూరం?? అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. చెబుతుంది కూడా.
(ప్రతీకాత్మక చిత్రకారునికి ధన్యవాదాలతో)

కామెంట్‌లు