తలవంచిన రాజు;-- యామిజాల జగదీశ్
 అనగనగా ఓ రాజు.అతను తన కన్నా తెలివైన వారెవరూ లేరని అనుకునే వాడు. ఈ విషయం అందరికీ ఎలా తెలిసేలా చేయాలి అని ఆలోచనలో పడ్డాడు. 
ఆలోచించగా ఆలోచించగా అతనికో ఆలోచన తట్టింది.
వివిధ దేశాలనుంచి మేధావులను తన ఆస్థానానికి రప్పించాడు. వారి వంక ఓ అహంభావంతో చూశాడు.
"మేధావులారా! ప్రపంచానికి కేంద్ర బిందువు ఎక్కడ ఉందో చెప్పండి?" అని అడిగాడు రాజు.
ఎవరూ జవాబు చెప్పలేదు. రాజుకు ఆనందమేసింది. చాటింపు వేసే భటుడిని పిలిచాడు.
"ప్రపంచానికి కేంద్ర బిందువు ఎక్కడ ఉంది? సరైన సమాధానం చెప్పే వారికి పది వేల బంగారు నాణాలు కానుకగా ఇస్తాం. జవాబు తప్పయితే ఉరిశిక్ష అంటూ ఊరంతా ప్రకటించి రా" అని ఆ వ్యక్తిని ఆదేశించాడు రాజు.
ఆ మనిషి ఊరు ఊరంతా చాటింపు విషయం వ్యాపించింది. 
రాజ్యంలోని వారందరూ విన్నారు. కానీ ఎవరూ జవాబు చెప్పడానికి ముందుకు రాలేదు.
ఈ చాటింపుని విన్న విష్ణువు అనే యువకుడు మనసులో అనుకున్నాడు. ఎవరూ జవాబు చెప్పలేరనే ధీమాతో ఉన్న రాజుని అందరి సమక్షంలో అవమానపరచాలనుకున్నాడు. 
విష్ణువు ఓ గాడిద మీద కూర్చుని రాజు కోటకు బయలుదేరాడు. అతను కోటలోకి ప్రవేశిస్తుండగా ద్వారపాలకులు అడ్డుకున్నారు. 
"ఎవరూ గాడిదమీద కోటలోకి వెళ్ళడానికి వీల్లేదు" అని అడుకున్నారు ద్వారపాలకులు.
అయితే ఆ యువకూడు "ఈ గాడిద ఉంటేనే నేను రాజు గారి ప్రశ్నకు సరైన జవాబు చెప్పగలను. కనుక గాడిదతోసహా నన్ను కోటలోకి పోనివ్వండి" అని వినయంగా అడిగాడు.
ద్వారపాలకులలో ఒకడు రాజు దగ్గరకు వెళ్ళి యువకుడి విషయం చెప్పాడు. 
రాజు సరేనని అతనిని గిడిదతో లోపలకు పంపండి అన్నాడు.
ఆ యువకుడు గాడిదను లాక్కుంటూ సభలోకి వచ్చాడు. అక్కడున్న వారందరూ అతని వంక విచిత్రంగా చూశారు. 
యువకుడు విష్ణువు రాజుకు తల వంచి నమస్కరిస్తూ "మీ ప్రశ్నకు జవాబు చెప్పి పది వేల బంగారు నాణాలు బహుమతిగా పొందడానికి వచ్చాను" అన్నాడు.
"ప్రపంచానికి కేంద్ర బిందువు ఎక్కడ ఉంది?" అని అడిగాడు రాజు.
"రాజా! నా గాడిద ఎడమ మోకాలు ఎక్కడ ఉందో అక్కడే ప్రపంచ కేంద్ర బిందువు ఉంది. నేను ప్రపంచాన్ని కొలిచి ఈ విషయం చెప్పడానికి వచ్చాను. మీకు నా మాట మీద అనుమానం ఉంటే కొలిచి చూసుకోవచ్చు" అన్నాడు విష్ణువు.
"అలా అంటావా? సరే. ఇప్పుడు నీకు ఇంకొక ప్రశ్న. ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. సరైన లెక్క చెప్పాలి. తేడా రావడానికి వీల్లేదు" అని అడిగాడు రాజు.
"రాజా!నా గాడిద శరీరంమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి" అన్నాడు విష్ణువు.
"మూఢుడిలా చెప్పకు. సరయిన జవాబు చెప్పు" అన్నాడు రాజు.
"రాజా! నేను చెప్పిన మాట మీద మీకు అనుమానముంటే మీ మనుషులతో లెక్కించండి. రెండూ సరిగ్గా ఉంటాయి. అలా కాక నా లెక్కలో తేడా ఉంటే నేనం ప్రాణత్యాగానికి సిద్ధమే" అన్నాడు యువకుడు విష్ణువు.
రాజుకు ఏం చెప్పాలో ఏం చేయాలో తెలీక నొలుక కరచుకుని కోపావేశంతో ఆ యువకుడికి తన మంత్రితో పది వేల బంగారు నాణాలు ఇప్పించి సాగనంపాడు. తన అహంకారాన్ని తన తెలివితేటలతో దెబ్బతీసిన ఆ యువకుడిని ప్రశంసించక ఉండలేకపోయాడు. అతను చెప్పిన జవాబులు తనకే ప్రశ్నార్థకాలై చిక్కుల్లో పడేస్తాయని రాజు ఊహించలేదు. తను ఓడిపోయినట్టు బయటకు చెప్పుకోలేక పోయాడు. 
విష్ణువు మహదానందంతో ఆ నాణాలతో ఇంటికి చేరుకున్నాడు.

కామెంట్‌లు