మహిమ కలిగిన పన్నీర్ ఆకు విభూతి;-- యామిజాల జగదీశ్
 తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి సంబంధించి ఆరు ప్రధాన పుణ్యక్షేత్రాలున్నాయి. వాటిలో రెండవది -  తిరుచ్చెందూరు. 
ఈ పవిత్రక్షేత్రంలో జరిగే ఉత్సవాలలో అతి ముఖ్యమైనది కందషష్టి. ఈ ఉత్సవానికి తమిళనాడు నుంచే కాకుండా శ్రీలంక, మలేసియా, సింగపూర్ తదితర ప్రదేశాల నుంచి కూడా భక్తులు వస్తారు. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులు షష్టి వ్రతం ఆచరించి స్వామి దర్శనం చేసుకోవడం ఓ ఆనవాయితీ. 
ఈ ఆలయంలో "పన్నీర్ ఆకు విభూతి"ని ప్రసాదంగా ఇస్తారు. ఈ విభూతి మహిమతో కూడినదని భక్తుల నమ్మిక.
ఇది ఒక పురాతన హిందూ దేవాలయం, ఇది తమిళనాడు ప్రభుత్వంచే ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ ఆలయం 2000 సంవత్సరాల క్రితం నిర్మితమైంది.  మౌనస్వామి ఈ ఆలయాన్ని పునర్నిర్మించిన సాధువు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 72 సంవత్సరాలు పట్టినట్లు చరిత్ర పుటలు చెబుతున్నాయి.
తమిళనాడులో పలు దేవాలయాలను రాజులు నిర్మించారు, అయితే ఈ ఆలయాన్ని సాధువులు నిర్మించడం విశేషం. స్థానిక పురాణాల ప్రకారం, ఈ ఆలయంలో తొమ్మిది తీర్థాలు ఉన్నాయి. ఈ తీర్థాలలో ఎందులోనైనా స్నానం చేయడం వల్ల భక్తులకు అద్భుత ఫలితాలుంటాయని నమ్ముతారు.
ఈ కుమారస్వామి ఆలయం సముద్రానికి సమీపంలో ఉన్న ఏకైక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం సముద్ర తీరానికి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంది.
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1646 నుండి 1648 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని ఆక్రమించింది. అయితే ఈ ఆలయాన్ని విడిచిపెట్టినప్పుడు వారు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహంతో సహా ఎన్నింటినో దోచుకున్నారు. తమ ప్రయాణంలో, వారు తీవ్రమైన తుపానును ఎదుర్కొంటారు. తమ తప్పు తెలుసుకున్న వారు విగ్రహాన్ని సముద్రంలో పడేసి తుపాను నుండి తప్పించుకున్నారు. 
తరువాత, సుబ్రహ్మణ్య స్వామి వడమలియప్ప పిళ్లై అనే భక్తుడి కలలో కనిపించి విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చెప్పారు. అప్పుడా విగ్రహాన్ని సముద్రం నుండి తిరిగి పొందుతాడా భక్తుడు.
ఇక్కడి రాజ గోపురాన్ని మూడు వందల సంవత్సరాల క్రితం శ్రీ దేశికమూర్తి స్వామి నిర్మించారు. ఈ రాజగోపురం150 అడుగుల ఎత్తు ఉంటుంది. తూర్పు ద్వారం లేకుండా పశ్చిమ ద్వారాన రాజ గోపురం ఉన్న ఏకైక కుమారస్వామి ఆలయం ఇదొక్కటే.
2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర సునామీ తమిళనాడు తీరాన్ని తాకినప్పుడు ఈ ఆలయానికి ఎలాంటి నష్టమూ జరగలేదు. కానీ  ఆలయం చుట్టూ ఉన్నవన్నీ దెబ్బతిన్నాయి.
శూరపద్ముడితోనూ, ఇతర రాక్షసులతోనూ యుద్ధం చేస్తున్నప్పుడు తన అనుచరుల దాహాన్ని తీర్చడానికి సుబ్రహ్మణ్య స్వామి తన శూలముతో ఇక్కడ "నలి కినరు" అనే బావిని సృష్టించాడు. తమిళంలో కినరు అంటే బావి అని అర్థం.
శూరపద్ముడిని ఓడించిన కుమారస్వామిని "జయంతి నాథర్" అని పిలుస్తారు. 
 కాలక్రమంలో ఈ పేరు "సెంథిల్ నాథర్" గా మారింది. ఈ ప్రదేశాన్ని "తిరుజయంతిపురం" అని కూడా అంటారు. ఈ మాట క్రమేణా "తిరుచ్చెందూరు" గా మారింది.
తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో తిరుచెందూర్ పట్టణానికి తూర్పు అంచున ఉన్న ఈ ఆలయం సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఈ ఆలయంలో కుమార తంత్ర విధానం ప్రకారం పూజలు నిర్వహిస్తారు. 
ప్రతి తమిళ నెల చివరి శుక్రవారం నాడు ప్రత్యేక పూజ, విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు.
ఓమారు ఆదిశంకరులవారు సుబ్రహ్మణ్య స్వామిని కీర్తిస్తూ ఓ స్తోత్రాన్ని పఠించి తనకు అనారోగ్యాన్ని పోగొట్టమని ప్రార్థిస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి  " పన్నీర్ ఆకులో విభూతి" వేసి ఆదిశంకరులవారికి ఇస్తారు. ఈ విభూతిని నోట్లో వేసుకోవడంతోనే ఆదిశంకరులవారికి  అనారోగ్యం తగ్గిపోయినట్టు చెబుతారు.
అలాగే దేవతలను బంధించి హింసించిన శూరపద్ముడితో వారిని విడిచిపెట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర శరణుపొందమని వీరబాహు కోరినప్పుడు అందుకు శూరపద్ముడు తిరస్కరిస్తాడు. సుబ్రహ్మణ్య స్వామితో పోరుకు సిద్ధపడ్డాడు. యుద్ధం మొదలైంది. యుద్ధంలో సుబ్రహణ్య
 స్వామికి చెందిన సైన్యంలో కొందరు గాయపడ్డారు. ఆ గాయాలకు మందుగా ఈ " ఆకు విభూతి" ని ఇచ్చి తగ్గించారు.
తర్వాతి రోజులలో దాని మహత్యాన్ని ఆలయాన్ని నిర్మించిన సాధువులు ఆలయనిర్మాణపు పనులు చేసిన సిబ్బందికి వేతనంగా ఆకు విభూతిని ఇచ్చేవారట. వాటిని పాందిన సిబ్బంది విడలై ఆలయ వినాయకుడి సన్నిధిలో తెరచిచూడగా విభూతి బంగారునాణాలుగా మారాయట.
పని చేయనివారికి మాత్రం వొట్టి విభూతి  ఉండేదట. ఈ ఆకువిభూతి మహత్యాన్ని తెలిపే రీతిలో ఇప్పటికీ ఈ తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో " ఆకు విభూతి" ప్రసాదాన్ని ఇస్తారు.


కామెంట్‌లు