నా నేరమేంటి.!;-ది పెన్--విజయవాడ
 నలుగురు ఆడపిల్లల‌ మధ్య ఒక్కడే కొడుకుగా అల్లారు ముద్దుగా పెరగాల్సిన నా బాల్యం, పేదరికం‌ అంటే కూడా తెలియని అమాయకంలో పొరుగింటి గేటు బయట గడిచిపోయింది.. 
అందరిలా మంచి బట్టలెందుకు లేవో తెలీదు..అమ్మ పెట్టిన పచ్చడి మెతుకులు, పెరుగు అన్నం తప్ప తిండిలో ఎన్ని రకాలుంటాయో తెలీదు..నన్ను ఏ ఫంక్షన్ కి, చుట్టాలింటికి తీసుకెళ్లట్లేదంటే చార్జీలకు డబ్బులు లేకనీ తెలీదు..
తాతయ్యతో దోమల మధ్య రాత్రంతా పొలం‌లో పడుకుని, ఏడాదంతా రెండు జతల యూనిఫాం, ఒక జత సివిల్ డ్రస్ తోనే విద్యార్థి నాయకుడినై పదోతరగతి ఎందుకు ఫెయిలయ్యానో తెలీదు..
మూడు నెలలు కేవలం ఒక పూట పచ్చడి అన్నం మాత్రమే తిని, ట్యూషన్ ఫీజు కోసం పళ్లకొట్లో ప్యాకింగ్ చేసి ఎలా చదివి అదే పదోతరగతి పాసయ్యానో తెలీదు..
రానుపోను పదిహేను కిలోమీటర్లు,రాళ్ల దారిలో  సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, రోజులో ఉదయం కాలేజీ, మధ్యాహ్నం 'పార్ట్ టైమ్' పని చేసుకుంటూ ఇంటర్మీడియట్ ఎలా పూర్తి చేశానో తెలీదు..
ఒక పూట ప్లేటు భోజనం, మరోపూట కేవలం మైసూర్ పాక్ తిని 20 గంటలు నిద్ర లేకుండా, కనీసం కూర్చోకుండా దూది మిల్లులో ఎందుకు పనిచేశానో తెలీదు..మండు టెండల్లో, జోరు వానల్లో రోజు కూలీగా, పొలం‌ పనులకు ఎవరికోసమెళ్లానో తెలీదు..
ఉదయం లేచి పొలానికెళ్లి చేలో పనిచేసి కాలేజీకెళ్లి వచ్చాక మళ్లీ పొలానికెళ్లి పనిలో బొబ్బలెక్కిన అరచేతులు చూసుకుని రాత్రి వేళ ఒంటరిగా పొలం‌గట్లపై చీకటిలో ఎందుకు ఏడ్చానో తెలీదు..
చెప్పులు కావాలంటే మూడు రోజులు తాపీ పనికి వెళ్లాలని, పదిహేను రూపాయల గుడ్డతో కుట్టిన చొక్కాను రెండేళ్లు వేసుకోవాలని చెబితే మారు మాట్లాడకుండా ఎందుకు విన్నానో‌ తెలీదు..
ఇప్పుడు వైద్యం మాని చదివితే చస్తావని చెప్పినా జర్నలిజంలో ఎందుకు చేరానో..ఆపరేషన్ జరిగి రక్తం కారుతున్నా నొప్పిని‌ భరిస్తూ బెంచ్ మీద సగమే కూర్చుని క్లాసులెందుకు విన్నానో తెలీదు..
ఉద్యోగంలో చేరి నెలకు ఆరువేలే వస్తే  ఒకపూటే తింటూ సగం డబ్బులు ఇంటికి ఎందుకిచ్చానో తెలీదు..అమ్మానాన్నకు బాల్యం నుంచి నేటికీ గానుగెద్దులానే కనిపిస్తున్నా,‌ ఇంకా వారి మాటనే ఎందుకు వింటున్నానో తెలీదు..
చావుతో సమానమని తెలిసీ ఇష్టంలేని పెళ్లెందుకు చేసుకున్నానో తెలీదు..అన్నీ చేసి, కన్నవాళ్లకోసం,‌జీవితాన్నర్పిస్తూ, సంతోషాన్ని చంపేసుకుని చివరికి చావలేక ఎందుకు బతుకుతున్నానో తెలీదు..పదిహేనేళ్ల వయసులో చదివించకపోతే చస్తానని పురుగుల మందు పట్టుకున్న నేను ఎన్నో అవార్డులు..రివార్డులు..సంఘంలో గౌరవాన్ని, పేరుని సంపాదించుకున్నా..అయినా నా మనసుకంటూ ఒక  తోడులేక రోజూ చస్తూ బతుకుతున్నా..
ఇలా..కాలం‌తో పాటు కదిలిన నా జీవన ప్రయాణంలో నాకంటూ దొరికిన ఒకే ఒక‌ సంతోషం నువ్వు..నా కోసం మిగిలిన ఏకైక తోడువి నువ్వనుకున్నా..నీ సావాసంలో కొత్త లోకాన్ని చూశాను..నీ సాంగత్యంలో సంతోషాన్ని వెదికాను.నా ఈ గమ్యంలేని ప్రయాణంలో నువ్వు మాత్రమే నాకు తోడనుకున్నాను.
కొన్ని‌ పరిచయాలకు అర్థం ఉండకపోవచ్చు..కానీ‌ కారణం కచ్చితంగా ఉంటుంది..మన ఈ ప్రయాణం కూడా అలాంటిదే..ఎప్పుడో ముగిసిపోయిన జీవితానికి మిగిలిఉన్న కాలమంతా నువ్వు నాతో ఉంటావో లేదో తెలీదు..కానీ ఈ ప్రాణం ఉన్నంతవరకూ నిన్ను మరువను.
వదిలేద్దామనుకున్నా విడదీయలేనంతగా పెనవేసుకున్న రెండు శరీరాల్లోని ఒకే మనసుని ప్రేమిస్తూ ఇలా సాగిపోవడం ఒక్కటే నాకు తెలుసు..కానీ ప్రశ్నలుగానే మిగిలిన ఎన్నో సందేహాలకు జవాబులు వెదికే ఓపిక మాత్రం ఇంక నాకు లేదు..
చివరిగా నిన్నొకటి అడగాలని ఉంది..అడగనా..
ఈ లోకంలో ఉన్నంత కాలం పోగొట్టుకున్న  ఆనందాలను నీతోనైనా పొందనివ్వు..నా ఈ ఒంటరి శోకాన్ని కొంతైనా పంచుకోనివ్వు..
బుజ్జీ..నే చేసిన నేరమేంటి.! నాతో ఉండవేంటి.!!
ఒట్టు..ఇక నాతో ఉన్నంత కాలం నీ కంట్లో ఒక్క కన్నీటి బొట్టునైనా రానివ్వను..నా వల్ల‌ చిన్న కష్టమైనా నిన్ను పడనివ్వను.!

కామెంట్‌లు
Veyi padagalu చెప్పారు…
మీ మనసులోని బాధను అర్ధం చేసుకునే నేస్తం మీతోనే కలాకాలం ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని‌వేడుకుంటున్నానండి.ఇకమీదట బాధలు కాక అన్నీ సంతోషాలే నిండాలి మీ జీవితంలో.మీరు కోరుకునే ఆనందాలు మీ సొంతం కావాలని అభిలాషిస్తున్నాను.
THE PEN చెప్పారు…
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
THE PEN చెప్పారు…
మొలక..నిర్వాహకులకు కృతజ్ఞతలు