తప్పుకో రూపాయి;-- యామిజాల జగదీశ్
 తన కొడుకుని పిలిచిన ఆ తండ్రి “మనమిద్దరం ఇక మీదట తప్పు చేయకూడదు. ఎవరు ఏ తప్పు చేసినా దానికి అపరాధంగా ఈ హుండీలో ఓ రూపాయి వేయాలి. అలా జమైన డబ్బులను ఓ రోజు తీసుకెళ్ళి ఆలయానికి ఇచ్చెయ్యాలి” అన్నాడు.
కొడుకు అందుకు ఒప్పుకున్నాడు.
వారి ఆలోచన అలాగే కొనసాగింది.
ఉన్నట్టుండి తండ్రి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. హుండీలో ఉన్న డబ్బునంతా ఆలయానికి ఇచ్చేసి ఆయన ఆస్పత్రిలో చేరారు.
కొడుకుతో “నేను లేనప్పుడైనాసరే నువ్వీ విధానాన్ని కొనసాగించాలి. ఓ తప్పుకి ఓ రూపాయి చొప్పున హుండీలో వేస్తుండు. మరచిపోకు“ అన్నాడు తండ్రి.
ఆస్పత్రిలో మూడు నెలలు ఉండిన ఆ తండ్రి ఇంటికి చేరుకున్నాడు. హుండీని చూశారు. అందులో ఒక్క రూపాయే ఉంది.
తండ్రికి ఆనందం వేసింది. కొడుకుని పిలిచి “ఈ మూడు నెలలలో నువ్వు ఒకే ఒక్క తప్పు చేసేవా... గుడ్“ అన్నాడు.
“కాదు నాన్నా, హుండీలో మూడు వందల రూపాయలు పోగయ్యాయి“ అన్నాడు కొడుకు.
“ఆ డబ్బుని గుడికి ఇచ్చేసేవా“ అడిగాడు తండ్రి.
“నాన్నా, హుండీలోని డబ్బునంతా నేనే తీసుకున్నాను. ఆ తప్పుకోసం మీరు చెప్పినట్టు ఈ హుండీలో వేసాను ఒక్క రూపాయి“ అన్నాడు ఆ కొడుకు.
తండ్రి నోటంట మాట లేదు.

కామెంట్‌లు