పాటనడగాలి...;-కిలపర్తి దాలినాయుడు
పాటకేమయ్యిందో
వాగ్గేయకారుణ్ణి అడగాలి
ఉప్పెనలా ఎగసేపాట
నిప్పుల్లా రాజేపాట
నిశ్శబ్ధం వహించిందెందుకో...

సమసమాజరాగానికి
గాయాలౌతున్నప్పుడు
పాట పల్లవించాలికదా!

చరణాలకు మరణంలేదు
గుండెతాళానికి...పాట నృత్యం చేయాలి కదా!

ఖనేల్ ఖనేల్ మంటున్న
డప్పుగొంతుకలోనూ 
ఏదో కఫం పట్టు అడ్డినట్టుంది
ఎరవేసిన గాలాన్ని మింగిన ట్టుంది!

కళ్ళగజ్జెలు బెంగతో కదలడం లేదు.....
నెగడు చుట్టూ జతలజతల
కాళ్ళు ఏదో సందేశానికి
అప్రయత్నంగా కదిలేవి!

అక్షరాలు వరుసతప్పి
పదాలను తయారు చేయలేక
పోతున్నాయి...
వాక్యసూత్రం తయారుచేసే
నాయకత్వం...మత్తులో
కూనరిల్లుతుందా...
చైతన్యం విస్ఫోటనం చెందక పోతే...
వనరుల్ని బోషాణంలో పెట్టుకొని వాడు వెళ్ళిపోతాడు
నీ రేపటి తరం స్మశానవాటికలోనే కాపురంచెయ్యాల్సొస్తుంది!
పాటను కాటేసే పాములను 
పట్టుకొని...బుట్టలో పెట్టకపోతే

అందరికీ చెందాల్సినవి
ఆవిరౌతాయి...
ఎడారులు తయారుకాబడి
బ్రతుకులు బీడౌతాయి!

వాగ్గేయకారుడికేమయ్యిందో
పాటనే అడగాలి!
----------------------------------------


కామెంట్‌లు