రాంగ్ నెంబర్! అచ్యుతుని రాజ్యశ్రీ

 స్నేహితులు అంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. శివా అన్నాడు "ఒరే నాచిక్కుప్రశ్న విప్పండి.మొహాలు చూడం కానీ కష్టసుఖాలు చెప్పుకోగలం.ఎవరా మిత్రుడు?"అంతా బుర్ర గోక్కున్నారు."ఈరోజు మానాన్న లాండ్ లైన్ ఫోన్ పెట్టించాడు.సెల్ కన్నా  ఇది నయం!" అన్న శివా తో కలిసి అంతా వాడిఇంటికెళ్లారు.అందరికీ స్వీట్స్ పంచాడు.అంతా ఒకసారి  తడిమి ఆనందించారు. అందరూ వెళ్లాక శివా దాని దగ్గర తిష్ట వేశాడు.అమ్మ షాపింగ్  నాన్న  ఆఫీసు నించి రాలేదు.టెలిఫోన్ డైరెక్టరీ చూస్తూ కొన్ని నెంబర్లు నొక్కాడు.అవతలి వారు హలో అనగానే "సారీ!రాంగ్ నెంబర్ " అని పెట్టేస్తున్నాడు.ఇలా అమ్మా నాన్న ఇంట్లో లేనప్పుడుడల్లా ఫోన్ చేయటం ఆపై పెట్టడం ఆటగా మారింది. ఓసారి  ఓనెంబర్కి అలా చేస్తూనే ఉన్నాడు.అవతల ఖళ్ ఖళ్ అని దగ్గుతో ఓవృద్ధ కంఠం విన్పడింది.అరడజను సార్లు  ఆనెంబరుకి ఫోన్ చేసి ఆతాతని సతాయించాడు.ఆరోజు  అమ్మ కి అనుమానం వచ్చింది. శివా బైట కి వెళ్ళగానే  రిడయల్ బటన్ నొక్కింది."అమ్మా!నాపేరు రమణ.ఎనభైఏళ్ల వాడిని!రోజూ ఓకుర్రాఠు ఫోన్ చేస్తూ నన్ను సతాయిస్తున్నాడమ్మా! రాంగ్ నెంబర్  అని పెట్టేస్తాడు.నాకొడుకు కోడలు ఉద్యోగం.భార్య పోయింది. అస్త్మా రోగిని! మోకాళ్ళ నెప్పులు.నేను వచ్చేదాకా  అలా ఆగకుండా మోగుతూనే ఉంటుంది. నన్ను ఇలా సతాయిస్తుంటే ఎలా అమ్మ?" "నేను  కనుక్కుంటాను.సారీ!"అని పెట్టేసింది. శివా ఇంటికి రాగానే  వాడిచెవి మెలేసి"ఆతాతని  సతాయిస్తున్నావా?" అని బాగా తిట్టింది.రిడయల్ చేసే సౌకర్యం ఉంది అని శివా కి  అప్పుడు తెలిసి వచ్చింది. ఫోన్ బిల్లు బాగా ఎక్కువ వచ్చింది అని తండ్రి తిట్టాడు. ఆరోజు  తల్లి కి వంట్లో బాగా లేదు. అందుకే ఇంట్లో ఉన్న శివా కి ఫోన్ కాల్స్ రావటం "మాఅమ్మ కి బాగా జ్వరం ఆంటీ" అని చెప్పటంతో వాడికి విసుగు వస్తోంది. డజను ఫైగా ఫోన్ కాల్స్  అమ్మని గూర్చి వివరాలు అడుగుతున్నారు ఆంటీలు.ఇంకొన్ని  రాంగ్ నెంబర్ కాల్స్ వచ్చాయి.వాడు ఇంక ఫోన్ ఎత్తటం మానేశాడు.నాన్న  పావుగంట కల్లా ఇంటికి తిరిగివచ్చి  ఛడామడా తిట్టాడు శివా ని "ఏంరా!అమ్మని గూర్చి కనుక్కోవాలని నేను ఫోన్ చేస్తే  ఎత్తలేదు. ఎందుకు?నిన్ను బడికి వెళ్లవద్దు అని చెప్పింది ఎందుకో తెలుసా?అమ్మ ఒక్కతే ఉంటుంది అని!" అప్పుడు అర్ధం ఐంది శివా కి పాపం  ఆతాతని  తాను  ఎన్ని సార్లు ఫోన్ చేసి సతాయిస్తుంటే  ఆయన ఎంత బాధపడిఉంటాడో అన్న సంగతి! ఏదైనా తనదాకా వస్తే కానీ తెలీదు మరి
🌹
కామెంట్‌లు