అవిటితనం; --సి.హెచ్.ప్రతాప్
 విజయనగరంలో ఒక ధనగుప్తుడనే ఒక బట్టల వ్యాపారి వుండేవాడు.నాణ్యమైన బట్టలను దూర ప్రాంతాల నుండి తీసుకువచ్చి, తక్కువ లాభాలను వేసుకొని అమ్ముతుండడంతో అతని వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు అతనికి నిజాయితీ గల వర్తకుడన్న మంచి పేరు కూడా వచ్చింది. అతనికి లేక లేక ఒక కొడుకు పుట్టాడు. అయితే పుట్టుకతోనే ఆ పిల్లవాడికి ఎడమకాలు అవలక్షణం ఏర్పడింది. అది ఎముకలు బలహీనత వలన సన్నగా వుండి నిలబడలేకపోయేవాడు. అప్పుడు ధనగుప్తుడు ఆ ఊరి వైద్యుడి సలహాతో పట్నం వెళ్ళి ఆ కాలుకు లోహంతో చేయబడిన ఒక కవచాన్ని వేయించాడు. దాని సహాయంతో ఆ పిల్లవాడు ఎలాంటి బాధ లేకుండా నడవగలిగేవాడు.అయితే నడకలో మాత్రం అవలక్షణం ఏర్పడి కుంటుతూ నడిచేవాడు.
అయితే అయిదేళ్ళ ప్రాయంలో విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్ళినప్పుడు  అతనికి ఇబ్బందులు ఎదురవసాగాయి. చిన్న క్లాసులలో అతని తోటి వారు ఈ కాలును చూసి నవ్వేవారు. కుంటివాడు అన్న పేరు కూడా పెట్టారు. అయితే ఈ ఇబ్బందులు పెద్ద క్లాసులకు వెళ్ళినప్పుడు మరింత ఎక్కువయ్యింది. నవ్వదం, అవహేళన చేయడం తో పాటు అతని ఎదురుగా కుంటి నడక అనుసరించడం లాంటి పనులు చేస్తుంటే ఆ అబ్బాయి ఎంతో బాధపడుతుండేవాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత సర్ది చెప్పినా ఆ ఆత్మన్యూనత నుండి బయటపడలేక పోయాడు. ఇదంతా చూసాక ధనగుప్తుడు ఈ సమస్య నుండి బయటపడేందుకు తన స్నేహితులను, తోటి వ్యాపారస్థులను సంప్రదించాడు.
ఒకరోజు పొరుగు రాష్ట్రంలో వున్న ఒక పురాతనమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి   ఆలయంలో పూజలు చేయిస్తే వెంటనే ఆ కాలు బాగుపడుతుందన్న నమ్మకంతో  వేలాది మంది అక్కడికి వెళ్ళి , పూర్తిగా బాగై తిరిగి వస్తున్నారని చెప్పి తన కొడుకుతో అక్కడికి ప్రయాణం కట్టాడు.
విషయం తెలుసుకున్న ఆ అబ్బాయి, నిజంగా అక్కడికి వెళ్ళి పూజలు చేయిస్తే కాలు బాగవుతుందా అని తండ్రిని అడిగాడు.
తండ్రి ఆ మందిరం  గురించి తాను విన్న కధలు అన్నీ  చెప్పి వాడిలో నమ్మకం కలిగించాడు.  
తండ్రీ కొడుకులిద్దరూ పొరుగు రాష్ట్రానికి ప్రయాణం కట్టారు. రెండు రోజుల ప్రయాణం తర్వాత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మందిరానికి చేరుకున్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నెలవుగా వున్న ఒక అద్బుతమైన ఆలయం అది.  భక్త జనంతో కిటకిటలాడుతోంది.
వారిద్దరూ గర్భగుడిలో ప్రవేశించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడున్న పూరోహితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. స్వామికి అభిషేకం చెసిన జలంతో ఆ అబ్బాయి ఎడమ కాలు మీద మర్ధనా చేసాడు ధనగుప్తుడు.
గుడి బయటకు రాగానే ఆ అబ్బాయి ఆశ్చర్యంతో ఎగిరి గంతేశాడు. నా ఎడమ కాలులో ఏదో శక్తి వచ్చినట్లు అనిపిస్తొంది.ఇక మీదట నేను పరిపూర్ణమైన ఆరొగ్యంతో నడవగలను అని తండ్రితో అన్నాడు.
ధనగుప్తుడు మరింత ఆశ్చర్యంతో కొడుకు కాలు వంక చూసాడు. అది ఎప్పటిలా, శక్తిహీనంగా వుంది.
అప్పుడు ఆ అబ్బాయి" నాన్నగారు,  నా కాలు లో వున్న లోపం అలాగే వుంది. కాని ఆ సమస్యను తలుచుకుంటూ బాధపడుతూ ఆత్మనూన్యతతో బాధపడే నా మనస్సులో వున్న లోపాన్ని ఆ దేవుడు సరి చేసాడు. ఇకమీదట ఈ కాలు అవిటితనం గురించి ఎంతమాత్రం బాధపడను. ఇతరులు నా కాలు గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోను సరికదా వారిని మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాను. చదువులతో పాటు క్రీడలలో కూడా రాణిస్తానని మాట ఇస్తున్నాను. ఇక నా గురించి మీరు అమ్మ ఎలాంటి బెంగ పెట్టుకోకండి " ఎంతో ధైర్యంగా చెప్పాడు. చెప్పడమే కాదు ఆ క్షణం నుండి ఉత్సాహంగా, ఉల్లాసంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. శారీరక అవిటితనం కంటే మానసిక అవిటితనం ఎంతో ప్రమాదకరమైనదని, దానిని ప్రధమ దర్శనం లో తొలగించిన ఆ దేవదేవుడికి మనసులోనే శత సహస్ర కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకున్నాడు ధనగుప్తుడు.
సి హెచ్ ప్రతాప్ 

కామెంట్‌లు