కన్నులవెలుగు ;- సత్యవాణి- కాకినాడ

  "రండి బాబూ రండి రంగు రంగుల పమిదలు, రత్నాల పమిదలు,డజను పమిదలూ పదిరూపాయలే ,మట్టి పమిద వెలుగులే మహా లచ్మికిష్టం. మట్టి మూకుడులో బువ్వే మన ఎంకటేశుకిష్టం" గంగమ్మ నాలుగు రోజుల నుంచీ చెప్పిందే చెబుతోంది.
 ఆఖరి రెండు మాటలూ ఆదారినొచ్చినాళ్ళనీ అక్కడే ఆపేస్తున్నాయి .మరో ప్రమిదలంగళ్ళదగ్గరకు మళ్ళనివ్వటం లేదు.
 హమ్మయ్య !దీపావళి రోజు రాత్రైపోయింది.గంగ మిగిలిన ఐదారు ప్రమిదలు తట్టలో పెట్టుకొని ఆనందంగా,"దీపావళీ దివ్య దీపావళీ  బ్రతుకులను వెలిగించు హేలా వళీ" అని పాడుకొంటూ ఇల్లుచేరింది,
                        ఇంటికి చేరగానే మిగిలిన ప్రమిదలలో నూని పోసి, వత్తేసి దీపాలు వెలిగించింది.గంగ అడుగుల చడి విన్న గంగ నాయనమ్మ "పిల్లా దీపాలు వెలిగించవే ,దీపాల పండగ గదా యీ యేల" అంది.
                        గంగ ఎప్పుడో ఎలిగించేనే ,నాన్నా,తాతా, తమ్ముడూ అందరూ వచ్చేకా పటాసులు కూడా కాలుత్తాం"అంది.
                      గంగ మామ్మ "మీరేటి కాల్చీనా సూడ్డానికి కళ్ళుంటేగా,యెదవ సీకటి బతుకు  ఛీ ఛీ యెదవబతుకు"తననుతాను తిట్టుకొంటోంది.
 ఇంతలో గంగ అందరు కుటుంబ సభ్యులందరూ ఇల్లు  చేరారు .గంగ వెలిగించిన దీపాలు వారి కళ్ళలో తళ తళా మెరుస్తున్నాయి."రాయే పిల్లా !తుండుగుడ్డ పరు "అన్నాడు గంగ తాత అందరి జేబుల్లోవీ,చేతి గుడ్డల్లోవీ మొత్తం డబ్బులు మొత్తం తుండు మీద పోశారు.
గంగ మూటలోంచి విప్పి పోసిన డబ్బులు చూసి అదరూ నోరెళ్ళబెట్టేరు. 
                 "అన్ని డబ్బులెలా సంపాదించేవే పిల్లా ?"న్నాడు తాత మనవరాలి బుగ్గమీద చిటికేస్తూ.
"మరేటనుకొన్నావు గంగంటే!పమిదలలొకటేగాదు,కొన్ని మాటలుగూడా అమ్మాల ,అలా అమ్మేను ."అని గర్వంగా కళ్ళెగరేసింది గంగ.
                         అందరి దగ్గర డబ్ఫులూ  బొత్తెట్టి గంగ చేతులో పెట్టారు.లెఖ్ఖపెట్టిన గంగ  "మామ్మా ! నీకాపరేషనుకి సరిపడా సొమ్ములొచ్చినాయే ,నీకింక !కళ్లొచేసినాయే !రేపెల్లుండిలో నువ్వెలుగులు సూత్తావ్ ఆనాడు మనింట్లో దివ్వెలెలిగించుతాం.నువ్వుకళ్ళారా సూద్దువుగాని"అని మామ్మని కౌగలించుకొని ముద్దులు కురిపించింది గంగ .అప్పుడే మామ్మ తెల్లటి కళ్ళలో గంగ వెలిగించిన ఆశాదీపం వెలుగు పడి మెరుపులు మెరిశాయి.
     
                  
కామెంట్‌లు