కష్టాల కొలిమిలో కాలుతున్న గల్ఫ్ కార్మికులు ;--ప్రత్యేక కథనం : సి.హెచ్.ప్రతాప్

 దశాబ్దాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా గల్ఫ్ దేశాల లోని ప్రవాస భారతీయుల దయనీయ స్థితి మారడం లేదు. 2018 వ సంవత్సరం లో సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ ఖతార్ లోని దోహా లో ప్రవాస భారతీయ కార్మీకుల శిబిరాలలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీక్షించి, వాటిని వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చి నాలుగేళ్ళు దాటినా   వారి ఇబ్బందులలో కించిత్తైనా మార్పు రాకపోవడం బాధాకరం. సరైన ధృవ పత్రాలు లేకుండా కొనసాగుతున్న ప్రవాసులను దేశం విడిచి వెళ్ళాలని యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం క్షమా భిక్ష పధకాన్ని ప్రవేశపెడితే  దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం భారతీయులు, వారిలో 60 శాతం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వుండడం ప్రభుత్వాల వైఫల్యానికి అద్దం పడుతోంది. తక్కువ చదువుతో అధిక వేతనాలు, మెరుగైన జీవనోపాధి ఆశతో గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు వెదుక్కుంటూ వెళ్ళిన భారతీయులు దాదాపు ఒక కోటికి పైగా వుండగా, అధిక శాతం తెలుగు వారే వుండడం , 20 లక్షల మంది కార్మీకులుగా జీవిస్తూ, ఉద్యోగాలను నిలుపుకోవడానికి స్వదేశం రావడానికి, ఏజెంట్ల మోసాలతో సరైన ధృవ పత్రాలు లేక అయిన వారికి దూరం గా మనో వ్యధను అనుభవిస్తున్నారు. మన దేశం లో నిరుద్యోగ యువత ఎక్కువగా వుండడం తో కొంత మంది నకిలీ ఏజెంట్లు ఈ పరిస్థితులను తమకు అనుకూలం గా మలచుకొని ప్రాధమిక విద్య పూర్తికాని వారికి కూడా అధిక వేతనాల ఆశ చూపించి అక్కడ సరైన ఉద్యోగాలు లేకపోయినా వారిని నుండి భారీ మొత్తాలలో డబ్భులు గుంజి పర్యాటక వీసాలు లేక బోగస్ వీసాల మీద తప్పుడు ధృవ పత్రాలతో అక్కడ వీరిని విడిచి రావడం, తీరా అక్కడికి వెళ్ళాక వీరు కళ్ళు తెరిచేసరికి నిజాలు బయటకు రావడం తో స్వదేశం రాలేక, అక్కడి నిబంధనలకు తగిన పత్రాలు లేక  కార్మిక క్షేత్రాలలో సరైన వసతులు లేని అద్దె గదులలో కనీస భోజన సదుపాయాలు లేక , సంపాదన కోసం దొంగ చాటుగా పశువుల, జంతువుల పెంపక కేంద్రాలలో , ఇళ్ళల్లో బానిసలుగా పని చేస్తూ దుర్భర జీవితం గడపడం మన ప్రభుత్వాల నిష్క్రియా పరత్వం ప్రస్పుటం చేస్తున్నాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలస కార్మికులందరూ చిన్న, మధ్యతరగతి వారే. వీరందరూ నిర్మాణ, రిటైల్ రంగాలు, డ్రైవర్లుగా, వివిధ ఉత్పత్తి కంపెనీల్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నారు. వీరితోపాటు రోజువారీ కూలీలుగా ఎంతో మంది పనిచేస్తున్నారు. వీరు అందుకునే జీతాలు చాలా తక్కువే. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గిపోవడం.. కంపెనీలు మూతపడటంతో చేసేందుకు పని లేక, జీతాలు రాక వీరంతా తిప్పలు పడుతున్నారు. కనీసం తినడానికి రెండు పూటలా తిండి కూడా లేక కొన్ని రోజులుగా కాలే కడుపులతో కాలం గడుపుతున్నారు.  పని కోసం విదేశాలకు వలస వెళ్లే ఇండియన్ల కోసం ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) పథకం ఉంది. అయితే, ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్(ఈసీఆర్) కేటగిరీ పరిధిలోకి వచ్చే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. టెన్త్, అంతకంటే ఎక్కువ విద్యార్హతలు ఉన్నవారే ఈసీఆర్ కాని పాస్‌‌పోర్ట్‌‌లకు అర్హులు. పీబీబీవై స్కీమ్ను 2003లో ప్రారంభించారు. అయితే 2006, 2008, 2017లో ఈ స్కీమ్కు పలు సవరణలు చేశారు. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత వైకల్యం కలిగినా రూ.10 లక్షల బీమా రక్షణను అందిస్తుంది. అయితే కరోనా వల్ల సంభవించే మరణాలు ఈ స్కీమ్ పరిధిలోకి రావు. పీబీబీవై స్కీమ్ను మరోసారి సవరిస్తే ఈసీఆర్ / ఇసీఎన్ఆర్ కేటగిరీతో సంబంధం లేకుండా విదేశాల్లో ఉన్న మన వలస కార్మికులందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే పథకంలో కరోనా కేసులను కూడా కవర్ చేయాలి   ఎవరైనా ప్రమాదానికి గురైతే సరైన ఇన్సూరెన్సు, ధృవ పత్రాలు లేక సకాలం లో చికిత్స అందక వేల మంది నిర్భాగ్యుల జీవితాలు గాలిలో కలిసిపోతున్నాయి. మన ప్రభుత్వాలు దాహం అయ్యాక బావి తవ్వే చందాన మృత దేహాలను రప్పించేందుకు అప్పుడు చర్యలు మొదలు పెట్టడం , కనీసం అయినవారికి మృత దేహాన్ని ఆఖరు సారిగా కళ్ళరా చూసే భాగ్యం కలగకపోవడం , ఇటువంటి ఘటనలు ఎన్నిసార్లు పునరావృతం అయినా ప్రభుత్వాలలో స్పందన కరువవడం బాధిత కుటుంబాలలో ప్రభుత్వాల పట్ల తీవ్ర అసంతృప్తి జ్వాలలను రగిలుస్తున్నాయి. మన ప్రభుత్వాలు గల్ఫ్ బాధితుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపకుండా బాధకు పైపూత రాసిన విధం గా అప్పటికప్పుడు క్షమాభిక్ష సమయం లో రాయబార కార్యాలయం లో అనుమతులు, విమాన టిక్కెట్లు ఇప్పించి చేతులు దులిపేసుకుంటున్నాయి.గల్ఫ్ లో అనధికారికం గా వున్నవారిపై అక్కడి ప్రభుత్వం నిఘా విధించి కార్మీక క్షేత్రాలపై దాడులు చేయించి రహస్యం గా వున్నవారిని జైళ్ళలో పెట్టించినా , వీరి కంపెనీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం , అటువంటి కంపెనీలను ఉపేక్షిస్తూ ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోవడం దురదృష్టకరం. కంపెనీ యాజమాన్యాలు కార్మీకుల వీసాలు, పాస్ పోర్ట్లు  స్వాధీనం చేసుకొని వారికి సకాలం లో జీతాలు ఇవ్వకుండా , ఇవ్వలేదని ప్రశ్నించిన వారి ఉద్యోగాలు తొలగించడమే కాకుండా అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసి, తప్పుడు కేసులు పెట్టి జైళ్ళలో పెట్టడం జంతు సంస్కృతిని ప్రతిబింబింపజెస్తోఒంది. గల్ఫ్ లోని కార్మీకులలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు కావడం ప్రాధమిక విద్యాభ్యాసం లోపించడం తో ఆఅంగ్లం, హిందీ భాషలపై కనీస పరిజ్ఞానం లేకపోవడం తో సమస్యలను మౌఖికంగా , ధరకాస్తులను లిఖిత పూర్వకంగా తెలియజేయలేక అక్కడి రాయబాయ కార్యాలయంలో అధికారులు వీరి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడంతో ఇప్పటికీ సుమారుగా 24 వేల మంది తెలుగు వారు గల్ఫ్ జైళ్ళలోనే మగ్గుతున్నా , వీరిని విడిపించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి ఉపశమన చర్యలకు ఉపక్రమించకపోవడం దారుణం.  సొంత ఊళ్లో పనులు లేక,  వ్యవసాయం కలిసి రాక, పిల్లల చదువులు, పెండ్లిళ్లు, అప్పులు తీర్చేందుకు పొట్ట చేతబట్టుకుని ఎడారి దేశాలు పోయినోళ్లలో  కొందరు వివిధ కారణాలతో అక్కడే కన్నుమూస్తున్నారు. అక్కడ జరిగే ప్రమాదాల్లో చనిపోయినా, బతుకు భారమై ఆత్మహత్యలు చేసుకున్నా, అనారోగ్యాలతో కన్నుమూసినా ..తమవారి మృతదేహాలను తెప్పించడం ఇక్కడి కుటుంబ సభ్యులకు తలకు మించిన భారమవుతున్నది. గల్ఫ్ నుంచి ఒక్కో డెడ్బాడీని తేవాలంటే రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. వాళ్ల కాళ్లు..వీళ్ల కాళ్లు పట్టుకుని అప్పులు చేసి మరీ పైసలు కట్టినా వారాలు, నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. ఆ స్థోమత కూడా లేనివారు తమ వారి శవాన్ని వీడియో కాల్ లో చివరి చూపులు చూడాల్సిన దుస్థితి దాపురించింది
కామెంట్‌లు