సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 నివురు...నివుఱు
 *******
నివురు ...నివుఱు ఈ పదాల ఉచ్చారణ ఒకేలా ఉన్నా అర్థాలు మాత్రం వేరు వేరే.
మన తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఇదే. చిన్న మార్పుతో అర్థమే మారుతుంది.
నివురు అంటే ప్రేమతో  తాకు,దువ్వు, నిమురు సవరించు లాంటి అర్థాలు ఉన్నాయి.
నిమరడం ఆత్మీయమైన స్పర్శకు గుర్తు.
అయిన వారి ఆదరణ కోల్పోయిన వాళ్ళు, ప్రేమాభిమానాల కోసం తపించే వారు మన చుట్టూ, కుటుంబాల్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు.అలాంటి వారికి ప్రేమ పూర్వకమైన స్పర్శ ఎంతో అవసరం.
ప్రేమగా వారిని తాకితే చాలు . ఆ స్ఫర్శ అంతులేని భరోసా, భవిష్యత్తు పై ఆశను కలిగిస్తుంది.
పిల్లలే కాదు పెంపుడు జంతువులు కూడా ఆత్మీయంగా నిమిరితే ఎంతగానో సంతోషించడం, విశ్వాసాన్ని చూపడం గమనిస్తూ ఉంటాం.
నివుఱు అంటే బూడిద,భస్మం.
ప్రస్తుతం 'ఱ' అక్షరానికి బదులు 'ర' అక్షరాన్నే వాడుతూ ఉన్నారు.
కానీ ఆ అక్షరం తోనే అర్థం మారడం నిఘంటువు ద్వారా గమనించవచ్చు.
నిజం నివుఱు గప్పిన నిప్పులాంటిది.
అబద్ధాలతో పబ్బం గడిపేవారి జీవితాలు ఏనాటికైనా అభాసుపాలు కాక తప్పదు.
నివుఱు గప్పిన నిప్పులా సమయం వచ్చినప్పుడు మనమేంటో  తెలిసేలా జీవిద్దాం. నిప్పు రవ్వంటి నిజాయితీని ఆభరణంగా ధరించి  నిర్భయంగా, స్వేచ్ఛగా బతుకుదాం.
 నమస్సులతో 🙏

కామెంట్‌లు