చిన్ననాటి స్మృతి;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
తేటగీతి మాలిక /
============

వాన నీటిలో రంగుల పడవ లనెడి
చిత్ర రాజము దోచెను చిత్తమిపుడు.
నీలి నీటిలో పడవలు తేలి పోయి 
రాలు చినుకుల వానలో రయ్యి మనుచు

సాగు చుండగ బాల్యపు జ్ఞాపకాలు
సుళ్ళు తిరుగుచు వేగమే చొచ్చుకొచ్చి
తట్టి లేపెను నా మది తలపు నిపుడు.
మరలి రానట్టి చిన నాటి మధుర మైన 

స్మృతుల నీడలో నిమిషము సేదతీరి
చిలిపి యల్లరి చేసిన చిగురు దశని
మనసు పెట్టెలో పెట్టినే మరలి రాగ
వెచ్చ నైనట్టి కన్నీరు వచ్చె నిపుడు.

చెమ్మ గిల్లిన కళ్ళతో చెప్పు కొంటి
కాగితంబుల పడవపై కవిత నొకటి
తీయ నైనట్టి మన భాష తెలుగు లోన.
----------------------


కామెంట్‌లు