*"కుమార శతకం " - పక్కి లక్ష్మీ నరసింహ కవి - పద్యం 003*
 కందం:
*అతి బాల్యములో నైనను*
*బ్రతికూలపు మార్గములఁబ్రవర్తింపక స*
*ద్గతి మీర మెలగ నేర్చిన*
*నతనికి లోకమున సౌఖ్యమగును గుమారా !*
తా:
కుమారా! ఈ భూమి మీద ప్రతి మగ బిడ్డ, ఊహ తెలిసిన తరువాత, చిన్నతనములో నైన మంచిదారిలో నడవడం మరచి, చెడు మార్గాలలో వెళ్ళి తప్పుడు దారులలో వెళ్ళకుండా ఉండాలి. మంచి మార్గాన్ని మరచి పోకుండా, ఆ దారిలో నడుస్తూ చక్కగా నడచుకొన్న ప్రతీ మగ బిడ్డకీ ఈ భూమి మీద అన్ని సుఖాలూ దొరుకుతాయి.... అని పక్కి లక్ష్మీ నరసింహ కవి చెపుతున్నారు.
*భావం:*
*హిరణ్యకశిపుని, ప్రహ్లాద కుమారుడు ఇక్కడ మనకి చక్కని అందమైన ఉదాహరణగా నిలబడతాడు మన ముందు. తాను పుట్టింది రాక్షస జాతిలో. పెరిగింది రాక్షస కుమారుల మధ్య. తండ్రి నారాయణ వైరి. మరి ఇన్ని వ్యతిరేకతల మధ్యలో కూడా, చిన్నవాడైనా, పరమాత్ముని నామం వదిలి పెట్టలేదు కదా. అంటే పక్కి వారు చెప్పినట్లుగా, చెడు మధ్యలో ఉండి కూడా మంచితోనే కలసి మెలసి ఉన్నాడు. దాని ఫలితంగా పరమాత్ముని ప్రత్యక్ష దర్శనం చేసుకుని, చివరికి ముక్తిని పొందాడు. ఇంతకంటే సౌఖ్యం, ఈ భూమి మీద మానవులు ఏమి పొంద గలుగుతారు. మనమందరం మంచి దారిలో నడిచే మానసిక ధైర్యం, స్థైర్యం మనకు ఆ పరమాత్మడు ఇస్తాడని, ఇవ్వాలని, ప్రపంచంలో మంచి మాత్రమే రాజ్యం చేయాలి అని.... అలన్మేల్మంగా పద్మావతీ సమేత వేంకటేశ్వరుని ప్రార్ధించుకుందాము.*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు