*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0182)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పార్వతి అని నామకరణము - హిమవంతుని చింత - భవిష్యత్తు చెప్పిన నారదుడు*
*నారదా! చైత్రమాసంలో నవమి రోజు మృగశరా నక్షత్రం లో పుట్టిన నవజాత శిశువు, తెల్లని కాంతితో మెరిసి పోతూ, పరమతేజోవంతురాలు అయిన పాప పంచ భూతాలు తగులగానే ఏడవటం మొదలు పెట్టింది. అది విన్న మేనకా దేవి పరిచారికలు చాలా సంతోషంగా సంబరాలు జరుపుకున్నారు. హిమవంతుడు కూడా ఆ అందాలరాశిని చూచి మహదానంద భరితుడు అయ్యాడు.  రుషులను, మునులను సంప్రదించి హిమవంతుడు పాపకు "కాళీ" అని పేరు పెట్టి పిలుచుకుంటున్నాడు. తల్లి మేనక "ఉమ" అని పిలిచేది. ఇంటి ఆచారము వల్ల మిగిలున వారు, తల్లిదండ్రులు కూడా "పార్వతి" అని పిలుస్తున్నారు. వర్షాకాలములో పెరిగే నది నీటి మట్టము లాగా, ప్రతీ రోజూ వృద్ధి చెందే శుక్ల పక్ష చంద్రుడు లాగా అంబ దిన దిన ప్రవర్ధమానం అవుతోంది.   తానే విద్య అయిన పార్వతి తక్కువ సమయంలోనే అన్ని విద్యలు అభ్యసించింది.*
*నారదా! ఒకరోజు, శివుని ప్రేరణ వల్ల నీవు హిమవంతుని వద్దకు వెళ్ళావు. నిన్ను చూచి, ఎదురు వచ్చి నీకు ఉచితమైన ఆసనము ఇచ్చి, అర్ఘ్య పాద్యాదులు ఇచ్చి, కూర్చుడ బెట్టి కుశలం అడిగాడు, హిమవంతుడు. ఆ తరువాత, తన ఇంట పుట్టిన పార్వతి వల్ల తన జన్మ ధన్యం అయ్యింది అని, పార్వతి ని పిలిచి నీకు నమస్కరించమని చెప్పాడు. సకల సద్గుణవతి, చదువుల నిధి అయిన పార్వతి ఎంతో వినయంగా, బ్రహ్మ మానసపుత్రుడవై, బ్రహ్మ వేత్తవు అయిన నీకు నమస్కరించి, చేతులు కట్టుకుని నిలబడిన, పారవతిని నీకు చూపుతూ, "పుణ్య పురుషా! నీవు సాధుపుంగవుడవు! సమస్తమూ తెలిసిన వాడవు. నా కుమార్తె చేయి, జన్మ కుండలి చూచి ఆమె ఎవరికి భార్య అవుతుందో చెప్పవలసినది" అని అడిగాడు హిమవంతుడు.*
*తండ్రి అయిన హిమవంతుని కోరిక మీద, నారదా! నీవు పార్వతీ దేవి చేతి రేఖలను నిశితంగా పరిశీలించి, ఆ సుగుణవతిని నఖశిఖ పర్యంతం పరిశీలించి ఆమె జాతక లక్షణాలను, ఆమె వివాహ రహస్యాలను ఈ విధంగా చెప్పావు. "గిరిరాజా! మేనకా! వినండి. మీ కూతురు అన్ని శుభలక్షణములు కలిగినది. తన వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ వుంటుంది. ఈమె చంద్రుని పూర్ణకళతో సమానంగా ఎదుగుతుంది. పుట్టిన ఇంటికీ, మెట్టిన ఇంటికీ పేరు తెస్తుంది. ఈ చేతి రెఖలు అన్నీ కూడా శుభాలనే సూచిస్తున్నాయి. అయితే, ఒక గీత కొంచెము విలక్షణముగా వుంది. ఈ గీత ప్రభావము వల్ల, ఈమెకు తల్లిదండ్రులు లేని వాడు, అమంగళకరమైన వేషములో తిరుగుతూ ఉండేవాడు, భర్త అవుతాడు. ఇది సత్యం."*
*నారదా! నీ మాటలు విని మేనకా హిమవంతులు దుఃఖానికి గురి అయ్యారు. కానీ, నీ మాటలలో ఉన్న అర్ధాన్ని తెలుసుకున్న పార్వతి మాత్రం తనకు పరమశివుడు భర్తగా లభిస్తాడు అని తెలుసుకుని, ఆ సర్వేశ్వరుని దివ్యమైన పద్మ పాదాలను మనసులో నిలుపుకొని, ప్రేమగా ఆరాధించడం, ఆ క్షణం నుండే మొదలు పెట్టింది.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు