*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0186)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*శివ భగవానుడు తపస్సు కొరకు గంగావతరణ తీర్థం వచ్చుట - హిమవంతుడు అవసరమైన ఏర్పాటు చేయుట*
*నారదా! హిమవంతుని కూతురు లోకపూజిత, శక్తిస్వరూప, పార్వతి త్వర త్వరగా ఎదుగుతూ 8సం.ల వయస్కురాలు అవుతోంది. అప్పుడు ఉమా రూపమైన సతీదేవి విరహంతో ఉన్న శివుడు, పార్వతి జన్మ కథ ను తెలుసుకుని, ఆమెను మనసులో ఉంచుకుని చక్కని ఆనందానుభవము పొందుతున్నారు. తన మనసుకు ఏకాగ్రతను కుదుర్చుకోవడానికి తపస్సు చేయాలని గంగావతారము అనే పేరుగల హిమవంతుని శిఖరము, ఇప్పటి "గంగోత్రి" కి తన శివ పార్షదులను వెంట బెట్టుకుని వచ్చారు. పార్షదులు కొంతమంది పరమేశ్వరుని తో గూడి తపస్సు లో వున్నారు. మిగిలిన పార్షదులు వారికి సేవలు చేస్తున్నారు. బ్రహ్మ లోకం నుండి అందరి పాపాలనూ తొలగించడానికి పరవళ్ళు తొక్కుతూ వచ్చిన పవిత్ర గంగ ఈ పర్వతముపైనే మొట్టమొదటిసారిగా భూమి మీద అడుగు పెట్టింది. జితేంద్రియుడు, చైతన్య మూర్తి, జ్ఞాన స్వరూపుడు, నిత్యుడు, జ్యోతిర్మయుడు, నిరామయుడు, జగన్మయుడు, చిదానందస్వరూపుడు అయిన పరమేశ్వరుడు ఏకాగ్ర భావముతో పరమాత్మను కోరి తపస్సు మొదలు పెట్టారు.*
*శివుడు, తన అధీనంలోని పృష్ఠ భాగమైన "గంగావతారము" / గంగోత్రి మీదకు వచ్చాడు అని తెలుసున్న హిమవంతుడు, పరుగు పరుగున తన పరివారముతో అక్కడకు చేరుకుని, ఆ స్వామిని మనసారా సేవించి, " మీరు నా ఏలుబడిలోని "గంగావతారము" అనే చోటికి తపస్సు కోసం రావడం వల్ల నా భాగ్యము పండినది. మేము ఎంతో పుణ్యము చేసుకొనడం వల్లనే మీరు ఈ స్థలమును ఉచితమైనదిగా భావించి ఇక్కడకు వచ్చారు. నేను సనాథుడను అయ్యాను. నేను, మీరు ఇక్కడ ఉన్నంత కాలమూ ఉండి మీకు సేవ చేసుకుంటాను. అనుమతి ఇవ్వండి" అని కోరాడు హిమవంతుడు.*
*హిమవంతుని మాటలు విన్న శివుడు, "నేను ఏకాంతలో ఏకాగ్రతతో తపస్సు చేసుకోవడానికి ఇక్కడకు వచ్చాను. నా తపస్సు కు ఎవరూ భంగం కలిగించకుండా చూడు, పర్వతరాజా! నీవు నీ ఇంటికి వెళ్లి సుఖంగా ఉండు" అని ఆజ్ఞ చేసారు శివుడు.  గిరిరాజు తన ఇంటికి తిరిగి వెళ్ళి, తన పరివారం అందరినీ పిలిచి, "ఈ రోజు నుండి నా పృష్ఠ భాగమైన " గంగావతారము / గంగోత్రి " వద్దకు ఎవరూ వెళ్ళకూడదు. కాదని ఎవరైనా వెళితే వారికి కఠినమైన దండన ఇవ్వబడుతుంది " అని చెప్పి ఎవరూ అటువైపు వెళ్ళకుండా కట్టడి చేసాడు, హిమవంతుడు.* 

*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు