*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0188)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పార్వతీ పరమేశ్వరుల దార్శనిక సంవాదము - సేవకు అనుమతి - పార్వతీ దేవి ప్రతీ దినము సేవ.*
*నారదా! యోగ సాధనలో ఉన్న తపోధనులకు, ముని పుంగవులకు స్త్రీ సాంగత్యము కూడదని, అందులోనూ యవ్వనవతి అయిన స్త్రీ అన్ని ఆకర్షణలకు కారణభూతము అవుతుంది కనుక, తన సేవలో పార్వతిని ఉంచ వద్దని సదాశివుడు తన తండ్రి గిరిరాజుతో చెప్పగా విన్న పార్వతి, జగత్పిత అయిన పరమేశ్వరునితో "యోగీంద్రా! మీరు జ్ఞాన స్వరూపులు. మహాత్ములు. తపస్సనే ధనముగా కలిగి వుండి కూడా, నిత్యము తపస్సు చేస్తూనే ఉంటారు. అన్ని పనులను చేయగల శక్తి ప్రకృతి నుండే వస్తుంది కదా! ప్రకృతి వల్లనే సకల సృష్టి జరుగుతుంది కదా! ప్రకృతి లేకుండా లింగ రూప మహేశ్వరుడు ఏర్పడటం ఎలా సాధ్యం అవుతుంది, మహేశా! ఒక్కసారి ఆలోచించండి. మీరు పూజనీయులు, ఎల్లప్పుడూ వందనీయులు. ప్రకృతి తోడు లేకుండా ఏ ఒక్క పనీ జరుగదు కదా! స్వామి. ఒక్క సారి పరిశీలించండి" అని ప్రార్ధిస్తుంది.*
*ఎంతో గొప్పగా పార్వతి చెప్పిన మాటలు విన్న శంభుడు, ఈ సంవాదాన్ని ఇంకా కొనసాగించాలి అనుకుని, తన లీలలో భాగం చేయాలి అనుకుని, పార్వతి తో "నేను ఎంతో ఉత్తమమైన, ఘోరమైన తపస్సు చేసి ఈ ప్రకృతిని జయించి నశింప చేస్తాను. ప్రకృతితో సంబంధం లేని శివ రూపముగా ఉంటాను. అందువల్ల యోగులుగా వుండ దలచిన వారు, తపోధనులు ప్రకృతిని స్వీకరించ కూడదు. మానవ మాత్రుల ఆచారములు పాటించకుండా, నిర్వికారముతో ఉండాలి" అని ఈ చరాచర ప్రపంచ వ్యవహార పద్ధతిని వివరించారు. రుద్రుని ఈ మాటలు విన్న కాళి, మనసులోనే నవ్వుకుని, వీణా వాయిద్య నాదం వంటి తన మాటలతో ఇలా చెప్పింది.*
*"జీవులందరికీ ఆనందాన్ని, శుభాన్ని ఇచ్చే పరమేశ్వరా! యోగనిధీ, పకృతి లేని పురుషుడు ఉంటాడా. సాధ్యమేనా! మీరు ఇప్పుడు చెప్పిన మాటలు ప్రకృతి వల్లనే సాధ్య మయ్యాయి గదా! ఇది నిజము కాదా, పరాత్పరా! మీరు ప్రకృతి రహితంగా ఉండ గలిగితే ఆ ప్రకృతినే ఆధారం చేసుకుని ఎందుకు మాట్లాడారు. విషయమంతా పరిశీలించి తాత్విక దృష్టితో చెప్పాలి కదా. చెప్పడము, చేయటము, వినటము ఇవి అన్నీ కూడా ప్రకృతి వల్లనే సాధ్యము కదా, నాగాభరణా! మీరు ప్రకృతికి అతీతులు అయితే, ఈ హిమవత్పర్వతము మీద ఎందుకు కూర్చున్నారు. ఈ పర్వతం ప్రకృతిలోనే ఉంది కదా, స్వామీ. మీరు ప్రకృతి లో కలసి పోయారు. కనుకనే మిమ్మల్ని మీరు తెలుసుకోడానికి తపస్సు చేస్తున్నారు. మీకు మీ స్వ స్వరూపము తెలిస్తే ఇంక తపస్సు చేయవలసిన అవసరం లేదు కదా. ఈ వాద ప్రతి వాదనల వలన ఏమీ ప్రయోజనము లేదు. ఇప్పుడు నేను చెప్పే సత్యమైన మాట వినండి. నేనే ప్రకృతి. మీరు పురుషులు. ఇది సత్యము. ఇదే సత్యము. ఇది కాక వేరేది నిజము కాదు. నా వల్లనే మీరు సగుణులు నిర్గుణులుగా ఉండ గలుగుతున్నారు. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. మీరు జితేంద్రియులే. కానీ, ప్రకృతి అధీనంలో ఉండి అన్ని పనులూ చేస్తుంటారు. ఇక మీరు నిర్వికారులు ఎలా అవుతారు. ఒకవేళ, మీరు ప్రకృతికి అతీతులు అయితే నాతో ఉన్నందు వల్ల, నేను మీ సేవలు చేయడం వల్ల మీకు కలిగే కష్టమేమిటి, నష్టమేమిటి. నేను మీ దగ్గరగా ఉన్నందువల్ల మీరు భయానికి లోనుకావలసిన అవసరం ఏముంది?" అని తన వాదన వినిపించింది, గిరినందిని.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు