*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0189)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*పార్వతీ పరమేశ్వరుల దార్శనిక సంవాదము - సేవకు అనుమతి - పార్వతీ దేవి ప్రతీ దినము సేవ.*
*నారదా! తానే ప్రకృతి, శివుడే పురుషుడు అని చెప్పి తన వాదనను నెగ్గించుకోవడానికి పార్వతి చెప్పి నిత్య సత్యాలు, ఎంతో నైపుణ్యంగా కూర్చబడిన మాటలు విన్న శివ భగవానుడు, "గిరిరాజ పుత్రికవైన గిరిజా! నీ మాటలు చాలా అందముగా వున్నాయి. సంఖ్యా మతమునకు అనుగుణముగా నీ వాదన చక్కగా వినిపించావు. నాకు సమ్మతమే. నీవు ప్రతీ నిత్యము నా సేవలు చేసుకోవచ్చు. కానీ, నీవు చేసే సేవలు శాస్త్ర విహితంగా ఉండాలి" అని ఉమ అయిన పార్వతి కి చెప్పి, హిమవంతునితో "నీ అనుమతి ఉంటే, నేను ఇక్కడ ఈ గంగావతారము అనే పర్వత శిఖరం మీద నా ఆనందమయ పరమార్ధ స్వరూపమును తలచుకుంటూ తపస్సు చేసుకుంటాను. నీ అనుమతి లేకుండా ఇక్కడ ఎవరూ ఉండలేరు. కనుక, నీ అనుమతి కోరుతున్నాను." అన్నారు.*
*భగవానుని ఈ మాటలు విన్న హిమవంతుడు, "మహాదేవా! ఈ సకల చరాచర జగత్తుకు అధిపతివి నీవు. నీకు నేను అనుమతి ఇవ్వడం ఏమిటి. మీ స్వేచ్ఛానుసారం, మీరు కోరుకున్నంత కాలం ఇక్కడ ఉండండి. అదే మాకు మహద్భాగ్యం. మా పూర్వ పుణ్య ఫలము వల్ల కదా, మీరు ఇక్కడకు వచ్చారు" అని అనేక నమస్కారాలు చేస్తూ చెప్పాడు. తరువాత, పార్వతీ, హిమవంతులను ఇంటికి వెళ్ళమని అనుజ్ఞ ఇచ్చి, తాను ధ్యానములో కూర్చున్నారు, మహాదేవుడు.*
*అప్పటి నుండి పార్వతి, హిమవంతుని తో కలసి లేదా తన ఇద్దరు చెలికత్తెలతో కలసి మహాదేవుని సేవలో ప్రతి నిత్యము గడిపేది. శివ గణములు కూడా పార్వతీ దేవి ఆజ్ఞలను గౌరవంతో పాటించే వారు. శివాశివులు వేరు కాదు కదా. పార్వతీ దేవి శివుని షోడషోపచారములతో ప్రతీ రోజూ పూజించెడిది. అనేక సార్లు ఆ స్వామి పాదాలను తాకి నమస్కారాలు చేసేది. శివుని సేవలో ఉన్న పార్వతీ దేవికి కాలగమనము కూడా తెలియలేదు. కొన్ని సంవత్సరాల కాలం గడచి పోయింది, కానీ పార్వతి సేవలో ఏవిధమైన మార్పులు రాలేదు. ఏకాగ్ర చిత్తంతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని నిత్యము తన సేవ చేస్తున్న పార్వతి మీద స్వామికి కరుణ కలిగింది. "ఈ కాళిక తపస్చర్యవ్రతము ఆచరిస్తే, మిగిలిన కొంచెము గిరిరాజ కూతురిని అనే గర్వము పోతుంది. అప్పుడు నేను ఈమె పాణిగ్రహణము చేయవచ్చు" అని అలోచించి, తాను ధ్యానము లో కూర్చున్నారు.*
*ఇప్పటి స్థితిలో, పార్వతి శివ స్వామి ఎదురుగా ఉన్నా ఆమెను చూడనట్లే తమ ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు. కాళి, శివదేవుని రూపము మనసులో ఉంచుకుని, ఉత్తమ భక్తి భావముతో సేవలో నిమగ్నమై పోయింది.*
*అంతలో, దేవతా సమూహము కూడబలుక్కుని సకల జగత్తు సంతోషం కోసం, తారకాసుర సంహారం జరగాలని, దానికి శివపార్వతుల కళ్యాణం జరగాలని, కామదేవుడిని, గంగావతారము మీదికి పంపుతారు. కామదేవుడు, తన కామ బాణాలను ప్రయోగిస్తే, కోపించిన శివుడు ఆతనిని దహించి వేస్తాడు. తరువాత, పార్వతీ దేవి తన గురించి చేసిన తపస్సుకు మెచ్చి, కాళిని పరిణయమాడుతారు. మన్మధుడు పునర్జీవుడు అవుతాడు. శివాశివులు లోక కళ్యాణ కార్యం కొనసాగిస్తారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు