*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - తృతీయ (పార్వతీ) ఖండము-(0190)*
 *కార్తీకదామోదర మీనాక్షీ సుందరేశ్వరుల అనుగ్రహం పరమేశ్వర ఆత్మబంధువులు అందరకీ కలగాలని ప్రార్ధిస్తూ......*
🪔🪷🪔🪷🪔🪷🪔🪷🪔
బ్రహ్మ, నారద సంవాదంలో.....
*తారకాసురుడు - దేవతల కష్టాలు - బ్రహ్మకు చెప్పడం - శివపార్వతుల కళ్యాణం కొరకు ప్రయత్నం - తారకాసురుడు స్వర్గము వదలుట - లక్ష్య సిద్దికి దేవతల ప్రయత్నం.*
*నారదా! తారకాసురుడు పుట్టింది మొదలు మహా ఘోరమైన తపస్సు చేయడంవలన, బ్రహ్మ నైన నేను అతనికి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇచ్చాను. నా వరాల ప్రభావం చేత మూడు లోకాలను జయించి, ఇంద్ర లోకానికి వెళ్ళి సకలదేవతా సమూహాన్ని ఓడించి, ఇంద్రుని సింహాసనం మీద కూర్చుని సమస్త ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. దేవతలు అందరినీ తన దాసీగణంలో చేర్చుకున్నాడు. తన తోటి రాక్షసులను దిక్పాలురుగా నియమించి, మిగిలిన దేవతా పనులకు కూడా రాక్షసులనే ఉంచాడు. ఈ విధంగా దేవతలు తమ తమ స్థానాలు కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్నారు.*
*ఇప్పుడు దేవతలు అందరూ, దేవేంద్రుని తో కలసి బ్రహ్మ నైన నావద్దకు వచ్చి వారి బాధలను ఏకరువు పెడుతూ, "మాకు మీరే గతి. మమ్మల్ని ఉద్ధరించ గలిగేదీ మీరే. తారకాసురుడు అనే మంటలో పడి పురుగుల లాగా కాలి మసై పోతున్నాము. చక్రధారి తన చక్రంతో మమ్మల్ని రక్షిస్తారు అనుకుంటే, ఆ చక్రం తారకాసురుని మెడలో మాలలాగా ఉంది. మాకు దిక్కు ఎవరు? మమ్మల్ని ఆదుకునేది ఎవరు?" అని తమ గోడు తెలుపు కున్నారు.*
*అప్పుడు ఆ దేవతా సమూహానికి ఊరట కలిగిస్తూ, "నేను ఇచ్చిన వరాల బల గర్వం తోనే తారకాసురుడు ఇదంతా చేస్తున్నాడు. ఈ తారకాసురుని చంపడం వరాలు ఇచ్చిన నా వల్లా కాదు. విష్ణువు దేవుడు, శివ భగవానుడు కూడా చంపలేరు. "విషపు చెట్టే అయినా,నీరు పోసి పెంచిన వారు, పీకి అవతల పడవేయ కూడదు అని లోకోక్తి" కదా. అందువల్ల నా చేత తారకాసుర సంహారం జరగదు. మీరు అందరూ ఒక పని చేయాలి. ఏమిటంటే, శివపార్వతుల కళ్యాణం జరిగే విధనం ఆలోచించి, ఈ కళ్యాణం జరిగేటట్లు చూడాలి. ఇందువలన లోక కళ్యాణం కూడా జరుగుతుంది. అన్ని లోకాలు సుఖానుభూతిని పొందుతాయి".*
*"తారకాసురుని విష్ణు దేవుడు, శంభుడు కూడా సంహరించలేరు. శివపార్వతుల సంతానం వల్ల మాత్రమే ఇది సాధ్యం అవుతుంది. దక్ష యజ్ఞము లో ఉమాదేవి ప్రాణ త్యాగం చేసిన తరువాత, శివ భగవానుడు, గంగావతారము అనే పర్వతం మీద కఠోర తపస్సు చేస్తున్నారు. ఆయన ఆలోచనలను కళ్యాణం వైపు మరలించాలి. నిరంతర తపస్సు లో ఉన్న పన్నగభూషణుకి, పార్వతి అంతే సమానమైన దీక్షతో, ప్రతి రోజు సేవలు చేస్తోంది. కానీ, పరమేశ్వర ధ్యానం లో ఉన్న శివుడు, ఆమె వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. శివుని ఆలోచనలను తన వైపు తిప్పకోగల శక్తి, పార్వతికి మాత్రమే ఉన్నది. భగవంతుడు అయిన శివుడు, ఊర్ధ్వరేతస్కుడు. ఆ దేవుని వీర్యమును ధరించగల తల్లి పార్వతియే తప్ప వేరెవ్వరూ కాదు. అందువల్ల మీరు ఇంద్రుని తో సంప్రదించి, ఈ కళ్యాణ కార్యక్రమం పూర్తి అయ్యేటట్లు చూడండి. తారకాసురుని దేవలోకం నుండి పంపే పని నేను చేస్తాను" అని చెప్పాను.*
*తరువాత, నేను దేవలోకంలో, తారకాసురుని దగ్గరకు వెళ్ళి, "నేను నీకు దేవలోకం కానీ, ఇంద్ర పదవి కానీ వరంగా ఇవ్వలేదు. నీవు దేవలోకం వదలి మిగిలిన లోకాలు పాలించుకో. నీకు మంచి జరుగుతుంది." అని నచ్చ చెప్పగా తారకాసురుడు దేవలోకం వదలి మిగిలిన లోకాలను పాలిస్తున్నాడు. దేవలోకం చేరిన దేవతలు అందరూ, దేవేంద్రునితో, శివపార్వతుల కళ్యాణం కన్నులపండువగా జరిగే విధంగా ఆలోచన చేయమని ప్రార్ధించి వారి వారి ఇళ్ళకు వెళ్ళి ప్రశాంత జీవనం గడుపుతున్నారు.*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ

కామెంట్‌లు